Jan 25,2021 21:48

మాట్లాడుతున్న మహాలక్ష్మి

ప్రజాశక్తి- శ్రీకాకుళం సిటీ : రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికలకు కనీస వేతనం రూ.7,500 అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 27న డిఇఒ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్నామని, వంట కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని మధ్యాహ్న భోజన పథకం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు మహాలక్ష్మి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావులు పిలుపునిచ్చారు. సిఐటియు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్న భోజన పథకం యూనియన్‌ జిల్లా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న వారు కార్మికులు నిరుపేద, బలహీన వర్గాలకు చెందిన, ఒంటరి మహిళలు అధికంగా ఉన్నారన్నారు. కరోనా కాలంలో మధ్యాహ్న భోజన కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పిల్లలకు వండి పెడుతుంటే, వాళ్ల సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి ఈ పథకాన్ని నిర్వహిస్తున్న వాళ్లకి నెలవారి సక్రమంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో మధ్యాహ్న భోజన కార్మికులు పద్మ, లక్ష్మి, సన్యాసమ్మ, శ్యామల, రొయ్య భారమ్మ, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు.