Nov 06,2020 21:40

బిజినెస్‌ డెస్క్‌ : సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటూ ఎక్కువ ఫీచర్స్‌తో, తక్కువ ధరలకు ఫోన్లు అందిస్తున్న రెడ్‌మీ షావోమి నుంచి మరో కొత్త ఫోన్‌ రాబోతోంది. ఇటీవలే ఎంఐ 10టి సిరీస్‌ ఫోన్లను విడుదల చేసిన షావోమి త్వరలో రెడ్‌మీ బ్రాండ్‌ కింద కొత్త మోడల్స్‌ను తీసుకురానుంది. రెడ్‌మీ నోట్‌ 9, 5జి స్టాండర్డ్‌, హై ఎడిషన్‌ పేరుతో రెండు వేరియేషన్లలో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు డిజిటల్‌ చాట్‌ స్టేషన్‌ అనే టిప్‌స్టర్‌ వెబ్‌సైట్‌ తెలిపింది. ఇప్పటికే రెడ్‌మీ నోట్‌ 9 సిరీస్‌లో వచ్చిన మోడల్స్‌కు భారత్‌లో మంచి ఆదరణ లభించింది. మరోవైపు దేశీయంగా పలు మొబైల్‌ కంపెనీలు 5జి టెక్నాలజీ మోడల్స్‌ తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెడ్‌మీ నోట్‌ 9 సిరీస్‌లో తొలి 5జి ఫోన్‌ విడుదలకు సిద్ధమవుతోంది. ఆండ్రాయిడ్‌ 11 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. స్టాండర్డ్‌ వేరియంట్‌లో 6.53 అంగుళాలు, హై వేరియంట్‌లో 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డి డిస్‌ప్లేలో ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 800యు ప్రాసెసర్‌ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అలానే స్టాండర్డ్‌ వెర్షన్‌లో 4,820 ఎంఎహెచ్‌ బ్యాటరీ 22.5 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు, హై ఎడిషన్‌ వేరియంట్‌లో 5,000 ఎంఎహెచ్‌ బ్యాటరీ 33 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వెనుక వైపు 48 ఎంపి ప్రైమరీతో మూడు కెమెరాలు, ముందువైపు సెల్ఫీల కోసం 13 ఎంపి కెమెరా అమర్చారని సమాచారం. దీనిపై రెడ్‌మీ సంస్థ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.