Jan 21,2021 23:38

సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా నగర కార్యదర్శి ప్రియాంక

పెందుర్తి : కేంద్ర ప్రభుత్వం రైతులతో చెలగాటం ఆడటం మంచిది కాదని ఐద్వా నగర కార్యదర్శి డాక్టర్‌ ప్రియాంక పేర్కొన్నారు. జివిఎంసి 95వ వార్డు పరిధి శ్రామికనగర్‌లో మహిళలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా మూడు చట్టాలు, విద్యుత్‌ చట్టం కలిపి మొత్తం నాలుగు చట్టాలను తీసుకు రావడం దుర్మార్గమన్నారు. వీటిపై 55 రోజుల నుంచి రైతులు ఆందోళన తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వం బెట్టు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వ్యవసాయ రంగంలో 70 శాతం మంది మహిళలు ఆధారపడి పనిచేస్తున్నారని, సరైన పోషకాహారం అందక రక్తహీనత బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నెల 24న నిర్వహించే స్టూడెంట్‌ యూత్‌ మార్చ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఐద్వా నగర ఉపాధ్యక్షులు బి.అనంతలక్ష్మి మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు అండగా ఉండి పేద, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎన్‌.కుమారి, లక్ష్మి పాల్గొన్నారు.