Nov 30,2020 14:20

ముంబయి : శాంతియుతంగా నిరసన చేపడతున్న రైతులపై వాటర్‌కెనాన్‌లు ప్రయోగించిన మోడీ ప్రభుత్వ తీరుపై శివసేన విరుచుకుపడింది. ఉత్తర భారతంలో చలి అత్యధికంగా ఉండే సమయంలో.. వారిపై వాటర్‌కెనాన్‌లు ప్రయోగించడాన్ని క్రూరమైన చర్యగా పేర్కొంది. కాశ్మీర్‌ సరిహద్దుల్లో ఉగ్రవాదులపై సైనికులు దాడి చేసే విధంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులపై దాడులు చేశారని శివసేన తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో తెలిపింది. రైతుల ఉద్యమానికి ఖలిస్థానీయులతో సంబంధం ఉందని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ పోల్చడాన్ని శివసేన విమర్శించింది. బిజెపి అరాచకాన్ని కోరుకుంటోందని, ఖలిస్తాన్‌ అనేది ఒక ముగిసిన అధ్యాయమని పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసేందుకు ప్రభుత్వం తన సర్వశక్తులను ఒడ్డుతోందని, పొరుగుదేశాలతో వ్యవహరించేటపుడు ఈ విధంగా ఎందుకు ప్రవర్తించడం లేదని ప్రశ్నించింది. మహరాష్ట్రకు చెందిన 11 మంది సైనికులు సరిహద్దుల్లో శత్రువులతో పోరాడుతూ అమరులయ్యారని తెలిపింది. గుజరాత్‌లో మోడీ, అమిత్‌షాలు ఏర్పాటు చేసిన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని గురించి వివరిస్తూ.. రైతులపై మోడీ ప్రభుత్వం దాడిని చూసి ఆయన కళ్లు చెమర్చే ఉంటాయని పేర్కొంది. ఇడి, సిబిఐ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయిస్తోందని విమర్శించింది. ఈ సంస్థలను సరిహద్దుల్లో శత్రువులతో పోరాడేందుకు కూడా నియమించాలని, అప్పుడే ఆ సంస్థల శౌర్యాన్ని ప్రదర్శించే అవకాశం లభిస్తుందని మోడీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.