
అమరావతి : '' రైతులను నమ్మించి మోసం చేశారు.. ఇది మోసగాళ్ల పాలన.. ఇది పక్కా 420 పాలన '' అంటూ.. ప్లకార్డులతో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అమరావతిలో ప్రదర్శన చేపట్టారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.. నివర్ తుపాన్ బాధిత రైతాంగాన్ని ఆదుకోవాలని, జీవనోపాధి కోల్పోయిన పేదలను ఆదుకోవాలని కోరారు. ప్రతీ పేద కుటుంబానికి రూ.10 వేలు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కడతామన్న ప్రీమియం చెల్లించలేదని, ప్రీమియంను రైతులు చెల్లించకుండా అడ్డంపడ్డారని ఆరోపించారు. రైతులను నమ్మించి మోసం చేశారని, నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. క్రాప్ ఇన్సూరెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. మైక్రో ఇరిగేషన్ సబ్సిడీకి మంగళం పాడారని, క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఎగ్గొట్టి మోసం చేశారని అన్నారు. ఇన్పుట్ సబ్సిడి, విపత్తు పరిహారాన్ని ఎగ్గొట్టారని దుయ్యబట్టారు. రైతులకు రూ.20 వేల కోట్ల భరోసా ఎగ్గొట్టారని ఆరోపించారు. ''అన్నదాత సుఖీభవ'' రద్దు చేశారని, రుణమాఫీ ఎగ్గొట్టి రూ.8 వేల కోట్ల మోసం చేశారని ధ్వజమెత్తారు. వ్యవస్థలను ధ్వంసం చేశారని, విధానాలను నాశనం చేశారని అన్నారు. కేంద్రం ఇచ్చే ఇన్సూరెన్స్ వాటా పోయిందన్నారు. రాష్ట్రం కట్టాల్సిన ఇన్సూరెన్స్ వాటా ఎగ్గొట్టారని, రైతులను కట్టుకోనివ్వకుండా చెడగొట్టారని విమర్శలు గుప్పించారు.