Nov 30,2020 20:10

ప్రజాశక్తి - పాలకోడేరు
                భారీ వర్షాలు, తుపాన్ల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జెఎన్‌వి గోపాలన్‌ కోరారు. కుముదవల్లిలో ముంపునకు గురైన వరి పొలాలను సిపిఎం నాయకులు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా గోపాలన్‌ మాట్లాడారు. సార్వా సీజన్‌ ఆరంభంలోనే కురిసిన భారీ వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎన్నోవ్యయ ప్రయాసలకోర్చి తిరిగి మరోమారు పంటసాగుచేస్తే ఇప్పుడు ముంపునకు గురయ్యాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం నష్టాన్ని అంచనావేసి వాస్తవసాగుదారులైన కౌలుదారులకు నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. ఈయన వెంట మండల కన్వీనర్‌ ఆశ్రీయ, చంటి, పసుపులేటి రంగారావు, శ్రీనివాస్‌, సాయి పాల్గొన్నారు.