Nov 27,2020 13:11

న్యూఢిల్లీ : దేశ రాజధానిలో తమ మొర పెట్టుకునేందుకు వెళుతున్న రైతులపై బిజెపి పాలిత రాష్ట్రాలు కత్తిగట్టాయి. ఛలో ఢిల్లీలో పాల్గొనేందుకు పయనమైన అన్నదాతలను నిలువరించేందుకు హర్యానా, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాలు.. తమ సరిహద్దుల వద్ద బారికేడ్లను ఏర్పాటు చేయడంతో పాటు నీటి ఫిరంగులు, భాష్ప వాయువులను ప్రయోగిస్తున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ నుండి. హర్యానా మీదుగా వెళుతున్న రైతులకు ప్రతి చోట నిర్బంధాలే ఎదురవుతున్నాయి. ఎక్కడిక్కడే రహదారులన్నీ పోలీసులు అష్టదిగ్బంధంనం చేస్తున్నారు. ఇప్పటికే వేలాది మంది రైతులు హర్యానా గుండా ఢిల్లీకి చేరుకున్నారు. దీంతో హర్యానా ప్రభుత్వం మండిపడుతోంది. వారిని నిలువరించేందుకు మిలిటరీ ఎత్తుగడలను వినియోగిస్తుంది. రాష్ట్ర సరిహద్దుల వెంబడి పెద్ద పెద్ద గోతులు, కందకాలు తవ్వించింది. బారికేడ్లను కూడా తొలగించి రైతులు ఢిల్లీ బాట పడుతుండటంతో రోడ్డుపై పొడుగునా పెద్ద పెద్ద తవ్వకాలు చేపట్టింది. వీరిని నిలువరించేందుకు బారికేడ్లకు ముళ్లు చుట్టడం, ఇసుకతో నింపిన లారీలను రోడ్డుకు అడ్డుగా పెట్టడం వంటి చర్యలకు దిగింది. చలికి సైతం భయపడకుండా.. ఎన్ని అడ్డంకులు ఎదురౌతున్నా, లాఠీ చార్జీ చేసినా, నీటి ఫిరంగులు ప్రయోగిస్తున్నా.. ఢిల్లీకి చేరుకోవడమే లక్ష్యంగా రైతులు ముందుకు సాగుతుండటంతో హర్యానా ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పూనుకుంది.