Nov 30,2020 20:46

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్రరాజగోపాల్‌

మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్రరాజగోపాల్‌
రైతులకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలి
ప్రజాశక్తి-నెల్లూరు:నివర్‌ తుపాన్‌ కారణంగా జిల్లాలో నష్టపోయిన రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం సిపిఎం కార్యాల యం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో డెల్టా, నాన్‌డెల్టా ఏరియాలైన 44 మండలాల పరిధిలోని 562 గ్రామాల్లో రైతాంగం వేసిన అనేక రకాల పంటలు వరద నీటిలో మునిగిపోయా యన్నారు. అధికారులు వెంటనే ఎన్యూమరేషన్‌ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలన్నారు. వరి పంట, నారుమళ్లు 40 వేల ఎకరాలల్లో వరద నీటిలో మునకకు గురయ్యాయన్నారు. కోస్తాతీరంలో వందలాది రొయ్యలు, చెపల చెరువులకు గండ్లు పడటంతో రైతులు భారీగా నష్టపోయారన్నారు. అరటి, కూర గాయలు, తమలపాకుల తోటలు సైతం దెబ్బతిన్నాయన్నారు. పంటలు దెబ్బతినడమే కాకుండా మోటార్లు వరద నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాయన్నారు. నాన్‌డెల్టా ప్రాంతంలో 50 వేల ఎకరాల్లో మినుము పంట వరద నీటిలో మునిగిపోగా శనగ, పొగాకు, కంది, పసుపు, మిర్చి, మొక్కజొన్న, అలసందు, బొప్పాయి పంటలతోపాటు ఆకుతోటలు, పొగాకు బ్యారన్‌లు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు.
డెల్టా ప్రాంతంలో దెబ్బతిన్న వరినారుమళ్లకు, ముదురు వరిపైర్లకు ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం అందజేయాలన్నారు.రైతులు తిరిగి నార్లు పోసు కునేందుకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలన్నారు. ఆక్వా, చేపల చెరువులకు ఎకరాకి రూ.50 వేలు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలన్నారు. కరెంటు మోటార్లు వరదనీటిలో కొట్టుకుపోగా, మరమ్మతులకు గురైనా వాటిని సరిచేసుకునేందుకు ప్రభుత్వం నష్టపరిహారంగా రూ.25 వేలు అందజేయాలన్నారు. మెట్ట ప్రాంతంలో దెబ్బతిన్న మినుము, పొగాకు, శనగ, కంది, మిర్చి, మొక్కజొన్న, అలసంద, బొప్పాయి, పసుపు పైర్లుకు ఎకరాకు రూ.10 వేలు వంతున నష్టపరిహారంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డిసి పల్లి, కనిగిరి ప్రాంతాల్లోని వేలం కేంద్రాల పరిధిలో పూర్తిగా కూలిపోయిన, దెబ్బతిన్న పొగాకు బ్యారన్‌లకు బీమా వారిచ్చే పరిహారం నామమాత్రంగా ఉందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతిన్న బ్యారన్‌కు రూ.50 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న బ్యారన్‌కు రూ.25 వేలు నష్టపరిహారంగా అందజేయాలన్నారు. మెట్ట ప్రాంతంలో తుపాన్‌ కారణంగా మరణించిన జీవాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలన్నారు. తుపాన్‌ వరద నీటి ప్రవాహంతో తెగిపోయిన చెరువులను, రహదారులను యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయాలని డిమాండ్‌ చేశారు.