
కోడూరు, నాగాయలంక : నివర్ తుఫానుతో పంటలు నష్టపోయిన రైతులను రాష్ట్రప్రభుత్వం పరిహారం ఇవ్వటం ద్వారా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ అన్నారు. దివిసీమలోని పలు మండలాల్లో కలెక్టర్, అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు, అధికారులు ఆదివారం పర్యటించారు. జరిగిన పంట నష్టం పరిశీలించి, రైతులకు ఇన్ ఫుట్ సబ్సిడీ, పంటల భీమా అందేలా చూస్తామన్నారు. తొలుత కోడూరు మండలం విశ్వనాథపల్లి, మందపాకల, నాగాయలంక మండలం బావదేవరపల్లి, నంగేగడ్డ గ్రామాల పరిధిలో పర్యటించి పంటలను పరిశీలించారు. అనంతరం అవనిగడ్డ తహసిల్దారు కార్యాలయంలో రెవిన్యూ , వ్యవసాయ, పంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నివర్ తుఫాను కారణంగా కురిసిన అధిక వర్షాలకు అవనిగడ్డ నియోజక వర్గంలోని 6 మండలాల్లో పంట నష్టం సంభవించిందన్నారు. ఈ నియోజక వర్గంలో 29 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు వేసిందన్నారు. గౌరవ శాసన సభ్యులతో పాటు, వ్యవసాయ, రెవిన్యూ అధికారులతో కలసి దెబ్బతిన్న పంట పరిశీలించారు. అవనిగడ్డ శాసన సభ్యులు సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకుంటామని ప్రభుత్వ పరంగా ఇన్పుట్ సబ్సిడి, పంటల భీమా అందెలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి, దివి మార్కెట్ యార్డు ఛైర్మన్ కడవకొల్లు నరశింహరావు, వ్యవసాయశాఖ ఎడిఎ వెంకట మణి, అవనిగడ్డ తహసిల్దారు శ్రీనునాయక్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.