Nov 29,2020 23:38

పంటలను పరిశీలిస్తున్న పెంట్యాల హనుమంతరావు

ప్రజాశక్తి-పంగులూరు : తుపాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న కౌలు రైతులకు నష్టపరిహారం అందించాలని రైతు సంఘం, కౌలు రైతు సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. మండల పరిధిలోని పంగులూరు, తక్కెళ్లపాడు, కొప్పెరపాడు గ్రామాల్లో దెబ్బతిన్న పంటను నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెంట్యాల హనుమంతరావు మాట్లాడుతూ వర్షం కారణంగా పత్తి, మిర్చి ,మినుము పంటలు పూర్తి దెబ్బతిన్నాయని తెలిపారు. ఫలితంగా రైతులకు తీవ్ర నష్టం కలిగిం దన్నారు. కౌలు రైతులు కూడా వేలాది రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసి భారీగా నష్ట పోయారన్నారు. అధికారులు పంట నష్టాన్ని నమోదు చేసే సమయంలో కౌలు రైతులు సాగుచేసుకున్న భూములకు వారి పేర్లను నమోదు చేయాలన్నారు. ప్రభుత్వం ప్రకటించే రాయితీలు కౌలు రైతులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైౖతు సంఘం డివిజన్‌ నాయకులు తల్లపనేని రామారావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాయని వినోద్‌బాబు, వి. బాలకోటయ్య, శ్రీనివాసరావు పాల్గొన్నారు. చీమకుర్తి : నివర్‌ తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పొగతోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం జిల్లా తూర్పు కమిటీ కార్యదర్శి పమిడి వెంకటరావు తెలిపారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకో వాలన్నారు. వర్షాల వల్ల కెవిపాలెంలో ఉరకలెత్తిన పొగాకు తోటలను రైతుసంఘం బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా వెంకటరావు మాట్లాడుతూ పొగాకు రైతులు ఈ పాటికే ఎకరాకు రూ.25 వేల నుంచి రు.30వేల వరకూ ఖర్చు చేశారన్నారు. అయితే వర్షాల వల్ల పొగాకు తోటలు ఉరకెత్తినట్లు తెలిపారు. ఉరకలెత్తి వాడిపోతున్న తోటలను తొలగించి మరలా సాగుచేయడం తప్ప మరోక మార్గం లేదన్నారు. తోటలు దెబ్బతిన్న రైతులకు పొగాకు బోర్డు ఉచితంగా ఎరువులు సరఫరా చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొల్లూరి వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షులు బెజవాడ శ్రీనివాసరావు, నల్లూరి కృష్టయ్య, పమిడి సత్యనారాయణ,గోరంట్ల చెన్నయ్య, పమిడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కొండపి : నివర్‌ తుపాన్‌ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని సిపిఎం నాయకులు కెజి. మస్తాన్‌ కోరారు. మండల పరిధిలోని కట్టావారిపాలెం, కొండపి గ్రామాలలో తుపాన్‌ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను సిపిఎం బృందం పరిశీలి ంచారు. ఈ సందర్బంగా మస్తాన్‌ మట్లాడుతూ తుపాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలకు పొగాకు, మినుము, కంది, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముప్పరాజు చిన్న బ్రహ్మయ్య, రైతులు రావెళ్ల కృష్ణ, రావెళ్ల వెంకటేశ్వర్లు, రావెళ్ల నారాయణ పాల్గొన్నారు.
వెలిగండ్ల : తుపాన్‌ ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందజేసి ఆదుకోవాలని ఎపి రైతు సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా అధ్యక్షులు పిల్లి తిప్పారెడ్డి, ఎపి వ్యవసాయ కార్మిక సంఘం పశ్చిమ ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న బొబ్బర్లు, కంది, మిర్చి, వరి, శనగ పంటలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షం కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు నష్టపరిహారం అందజేయా లన్నారు. ఈ కార్యక్రమంలో వత్తిదారుల సంఘం నాయకులు రాయల మాలకొండయ్య పాల్గొన్నారు.