Jun 11,2021 08:21
  • పెరిగిన వ్యవసాయ ఖర్చులకు ఎంఎస్‌పికి పొంతనేదీ
  • ఎఐకెఎస్‌ విమర్శ

న్యూఢిల్లీ : ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ద్రోహం చేసిందని ఆలిండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) విమర్శించింది. కిసాన్‌సభ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అశోక్‌ ధావలే, హన్నన్‌ మొల్లా గురువారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కేంద్రం తాజాగా ప్రకటించిన కనీస మద్దతు ధర(ఎంఎస్‌పి)లు రైతులకు గిట్టుబాటు అయ్యేవిధంగా గానీ, పెరిగిన పంట ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా గానీ లేవని ఎఐకెఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెరిగిన పెట్టుబడి వ్యయాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రకటించిన ఈ ఎంఎస్‌పిల్లో గతేడాదితో పోల్చితే నామమాత్రపు పెంపు మాత్రమే చేపట్టారని పేర్కొంది. ప్రభుత్వం ఈ ఎంఎస్‌పిని లెక్కించడంలో సి2ప్లస్‌50 (పెట్టుబడి సమగ్ర వ్యయం ప్లస్‌ పెట్టుబడిలో 50 శాతం లాభం) ఫార్ములాను వినియోగించలేదని, ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌ (చెల్లించిన ఖర్చులు ప్లస్‌ కుటుంబసభ్యుల శ్రమ) కన్నా మించి కనీస మద్దతు ధరను నిర్ణయించామని కేంద్రం చెప్పుకోవడం హాస్యాస్పదమని ఎఐకెఎస్‌ దుయ్యబట్టింది. కేంద్రం తాజాగా ప్రకటించిన ఎంఎస్‌పి సి2ప్లస్‌50 ఫార్ములా కన్నా ఇది చాలా తక్కువగా ఉందని అది తెలిపింది. ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు ఆకాశాన్నంటుతున్న పెట్టుబడి వ్యయంతో ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న రైతుల ఆకాంక్షలను ఎంతమాత్రం నెరవేర్చేలా లేదని పేర్కొంది. కమిషన్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ కాస్ట్స్‌ అండ్‌ ప్రెసెస్‌ (సిఎసిపి) లెక్కలను ఫేస్‌ వ్యాల్యూగా తీసుకున్నా ఎ2 ప్లస్‌ ఎఫ్‌ఎల్‌కు, సి2ప్లస్‌50కి భారీ వ్యత్యాసం ఉండడం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందని ఎఐకెఎస్‌ పేర్కొంది. సిఎసిపి, రాష్ట్ర వ్యవసాయ శాఖలు వేస్తున్న ధరల అంచనాల్లో కూడా భారీ తేడా ఉందని తెలిపింది. కేంద్ర ప్రకటించిన కొద్దిపాటి ధరలు కూడా మెజార్టీ రైతులు పొందే అవకాశం లేదని, పంట ఉత్పత్తుల కొనుగోలుకు సంబంధించి ఎటువంటి హామీ ఇవ్వలేదని విమర్శించింది. ఈ ఎంఎస్‌పిల వద్ద రైతులు తమ పంటను అమ్ముకుంటే భారీస్థాయిలో నష్టపోవాల్సి వస్తుందని, ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే దేశంలోని రైతులందరూ సి2ప్లస్‌ 50 శాతం విధానంలో కనీస మద్దతు ధరను నిర్ణయించడంతోపాటు దానికి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారని కిసాన్‌ సభ పేర్కొంది. రైతుల పెట్టుబడి వ్యయానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు మిగతా 7లో వేస్తున్న అంచనా కంటే సిఎసిపి అంచనాలు చాలా తక్కువగా ఉంటున్నాయని ఎఐకెఎస్‌ తన ప్రకటనలో వివరించింది. ఉదాహరణకు వరి విషయమే తీసుకుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం అంచనా వ్యయం క్వింటాల్‌కు రూ.2,114 కంటే రూ.555 తక్కువగా సిఎసిపి అంచనా రూ.1,559గా ఉంది. పంజాబ్‌లో ప్రభుత్వ అంచనా వ్యయం రూ.1995గా ఉండగా, సిఎసిపి అంచనా రూ.1272 మాత్రమే ఉంది. కర్ణాటకలో ప్రభుత్వ అంచనా(రూ.2,733) కంటే రూ.1098 తక్కువగా ఉంది. కేరళలో వరి పెట్టుబడి వ్యయాన్ని క్వింటాల్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2,852గా అంచనా వేయగా, సిఎసిపి అందుకు విరుద్ధంగా రూ.2,044గా పేర్కొంది. కందిపప్పు విషయానికి వస్తే.. కర్ణాటకలో క్వింటాల్‌ ఉత్పత్తికి సి2 అంచనా రూ.6,399గా ఉండగా, సిఎసిపి రూ.1438 తక్కువగా రూ.4,961గా పేర్కొంది. ఇదే రాష్ట్రంలో క్వింటాల్‌ మినుములను రాష్ట్ర ప్రభుత్వం రూ.9,456 అంచనా వేయగా, సిఎసిపి మాత్రం దానికి దూరంగా.. 32 శాతం తక్కువగా రూ.6,173గా అంచనా వేసింది.
    నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం రైతులను దగా చేయడం మానుకోవాలని ఎఐకెఎస్‌ డిమాండ్‌ చేసింది. పెట్టుబడి వ్యయానికి సంబంధించిన తప్పుడు కొలబద్దలను సవరించడంతోపాటు లాభదాయకమైన కనీస మద్దతు ధర కల్పిస్తూ ఒక చట్టాన్ని తీసుకురావాలని కోరింది. రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిని నిరసనగా ఆందోళనలు చేపట్టాలని ఎఐకెఎస్‌ తన అన్ని యూనిట్లకు పిలుపునిచ్చింది. బిజెపి ప్రభుత్వం పాల్పడిన ఈ ద్రోహాన్ని ప్రజలకు వివరించాలని సూచించింది.