Jun 13,2021 08:09
  • నిధుల విడుదలలో జాప్యం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధాని పరిధిలో రైతులకు ఇవ్వాల్సిన కౌలు విషయంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోంది. ఏప్రిల్‌ నెలలో నిధులు విడుదల చేసి ఇవ్వాల్సిన వార్షిక కౌలు ఇప్పటికీ చెల్లించలేదు. పెద్ద రైతులకు ఇబ్బంది లేకపోయినప్పటకీ చిన్న రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 వేల మంది రైతులు భూములిచ్చినట్లు రికార్డుల్లో ఉంటే వీరిలో 22 వేల మంది చిన్నా చితక రైతులే కావడం విశేషం. వారందరూ ఏడాది కౌలు మీదే ఆధారపడ్డారు. 34,399 ఎకరాలకు సంబంధించి ఏడాదికి రూ.196 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకూ ఆరేళ్లు కౌలు చెల్లించారు. ఏడో ఏడాది చెల్లింపులకు సంబంధించి నిధులు రాలేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై ఇటీవల రైతులు ఆందోళనకు దిగారు. ఎఎంఆర్‌డిఎ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బయలు దేరారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం కొంతమంది మహిళా రైతులు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో అధికారులను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సమయంలో అధికారులు మాట్లాడుతూ నిధులు కేటాయింపు జరిపినా విడుదల కాలేదని తెలిపారు. దీనిపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవైపు రాజధానిని ముందుకు కదలనీయడం లేదని, కనీసం ఇవ్వాల్సిన కౌలు డబ్బులైనా ఇప్పించాలని కోరారు. నిధులు రాగానే వెంటనే బ్యాంకుల్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వం కావాలనే రైతులను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పరిధిలో రైతుల కుటుంబాల్లో చాలామంది కోవిడ్‌ బారినపడి చికిత్సలు చేయించుకోవాల్సి వచ్చిందని, అటు వంటి వారికి కౌలు డబ్బులు ఆదుకుంటాయ నుకుంటే సమయానికి పడలేదని, దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కో వాల్సి వచ్చిందని చెబుతున్నారు. డబ్బులొస్తా యనే ఉద్దేశంతో అప్పులు చేసి చికిత్సలు చేయించుకు న్నామని, ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెబుతున్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని వారు కోరుతున్నారు. దీనిపై వెలగపూడి రైతు భాను మాట్లా డుతూ సమయానికి డబ్బులు చెల్లిస్తే కొంతమందికి ఇబ్బందులు తప్పుతాయని తెలిపారు. అందరూ పెద్దరైతులు లేరని, చాలామంది చిన్నరైతులే ఉన్నారని, వారికి ఈ ఆదాయం తప్ప మరొకటి లేదని తెలిపారు. ఒకరిద్దరు పెద్దరైతులు ఉంటే వారిని చూపించి అందరికీ లక్షల్లో ఆదాయం ఉందనే విధంగా మాట్లాడటం సరికాదని తెలిపారు. ఆర్థిక సంవత్సరం పూర్తయిన వెంటనే కౌలు చెల్లించాల్సి ఉందని, ఆలస్యం అయ్యేకొద్దీ వడ్డీలకు తెచ్చుకుని తినాల్సి వస్తోందని వివరించారు.