
మానవహారం చేస్తున్న ఐద్వా నాయకులు
రైతుల ఆందోళనలకు 'ఐద్వా' సంఘీభావం
నగర,రూరల్ కమిటీల ఆధ్వర్యంలో మానవహారం
ప్రజాశక్తి-నెల్లూరు :రైతు వ్యతిరేక నూతన వ్యవసాయ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ 54 రోజులుగా ఢిల్లీలో రైతులు చేస్తోన్న ఆందోళనలకు మద్దతుగా 'ఐద్వా' సంఘం ఆధ్వర్యంలో మానవహారం, జిఒ కాపీలు దగ్ధం కార్యక్రమాలు నిర్వహించారు. సోమవారం ఐద్వా నగర కమిటీ ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్లో, రూరల్ కమిటీ ఆధ్వర్యంలో ఆర్టిసి బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. ఐద్వా రూరల్ కమిటీ ఆధ్వర్యంలో విఆర్సి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వరకు మహిళలు ప్రదర్శన నిర్వహించి అనంత రం నూతన వ్యవసాయ నల్లచట్టాలకు సంబంధించిన జిఒ కాగితాలను దగ్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
చట్టాలతో వ్యవసాయ రంగం నిర్వీర్యం
కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న వ్యవసాయ నల్ల చట్టాలతో రైతులకు నష్టం వాటిల్లు తుందని అటువంట వాటిని తక్షణమే రద్దు చేయాలని ఐద్వా నగర కమిటీ డిమాండ్ చేసింది. గాంధీ బొమ్మ సెంటర్లో మహిళా సంఘాల ఐక్యవేదిక నగర కమిటీల ఆధ్వర్యంలో మానవహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్షురాలు షేక్ మస్తాన్‌బీ, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ డి.అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ నవంబరు 24వ తేది నుంచి ఢిల్లీలో అన్నదాతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్నా బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఎముకలు కొరికే చలి ని సైతం లెక్కచేయకుండా మహిళా రైతులు సైతం ఈ పోరాటంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ఈ ఉద్యమంలో 54 మంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారన్నారు. దీనికి బిజెపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. కార్యక్రమంలో ఐద్వా నగర కమిటీ అధ్యక్షులు కె.పద్మ, ఎన్.వి.సుబ్బమ్మ, ఎ.పుష్పా, సిహెచ్ రమణమ్మ, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్ యూనియన్ నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.