Nov 28,2020 01:06

పద్మనాభంలో నీట మునిగిన వరి పంట

23,437 ఎకరాల్లో వరి పంట నీట మునక
పలు ప్రాంతాల్లో నేలమట్టం
బుచ్చయ్యపేట మండలంలో మొలకలెత్తిన పనలు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి, విలేకర్ల బృందం
నివర్‌ తుపాన్‌ రైతులకు తీవ్ర నష్టాన్ని తెచ్చింది. నివర్‌ ప్రభావంతో రెండు రోజుల పాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి కోసి వరి పనులు పూర్తిగా నీట మునిగాయి. బుచ్చయ్యపేట మండలంలో ధాన్యం మొలకలెత్తాయి. కొన్ని ప్రాంతాల్లో కోత దశలో ఉన్న వరి పంట పూర్తిగా నేలమట్టమైంది. మరికొన్ని ప్రాంతాల్లో వరి పొలాలు గెడ్డలను తలపించేలా ఉన్నాయి. జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు 24 మండలాల్లో 23,437 ఎకరాల వరి పంట నీట మునిగింది. కోతకోసిన వరి నీట మునిగిన ప్రాంతాల్లో పంట నష్టం ఎక్కువగా వుంది.
బుచ్చయ్యపేట : వరి పంట చేతికి వస్తుందన్న ఆశలు రైతన్నలు పూర్తిగా వదులుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో 2 వేల ఎకరాలకు పైగా పంట నీటిలోనే ఉంది. గురువారం రాత్రి సైతం భారీగా వర్షం కురవడంతో వరిచేలు ఒడ్డుకు తెచ్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఐదు రోజులుగా నీటిలోనే వరి పనులు ఉండడంతో ధాన్యం మొలకలొచ్చాయి. శుక్రవారం రైతులు పనలను ఆరబెట్టడానికి పొలాల్లోకి వెళ్లేటప్పటికీ పెద్ద పెద్ద మొలకలు రావడాన్ని చూసి ఏం చేయాలో తెలియక స్థితిలో పొలాల్లోనే విడిచిపెట్టారు. ఒక్క ఎకరాకు రూ.20 నుండి రూ.30 వేలు రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
దేవరాపల్లి : మండలంలో రెండు రోజు వర్షానికి 500 ఎకరాల్లో వరి చేను నేలకొరిగి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంట చేతికి వస్తుందన్న సమయంలో నివర్‌ రైతులను ముంచేసింది. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
సబ్బవరం : మండలంలోని పలు గ్రామాల్లో కోసి వరి పనలు నీటమునిగాయి. ప్రధానంగా పెదగొల్లలపాలెంలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మండల వ్యాప్తంగా 170 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లిందని వ్యవసాయాధికారి పి.సత్యనారాయణ తెలిపారు.
గొలుగొండ : తుపాను కారణంగా గురువారం సాయంత్రం కురిసిన వర్షానికి, వీచిన గాలులకు వరి చేలు పూర్తిగా నేలకొరిగాయి. మండలంలోని పాతమల్లంపేట, కొత్తపాలెం, గొలుగొండ, విప్పలపాలెం ఆయకట్టు ప్రాంతంలో వరి పంట పూర్తిగా దెబ్బతింది. పాతకేడిపేట పరిసరాల్లో గెడ్డలను తలపించే విధంగా వరి పంట మొత్తం పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వెంటనే అధికారులు స్పందించి రైతులకు జరిగిన నష్టాన్ని గుర్తించి రైతులను అన్ని విధాల ఆదుకోవాలని రైతు నాయకులు సాపిరెడ్డి నారాయణమూర్తి, మేకా సత్యనారాయణలు కోరారు.
సబ్బవరం : మండలంలో 68 హెక్లార్లలో వరి పంటకు నష్టం జరిగింది. స్థానిక వ్యవసాయాధికారి పి.సత్యనారాయణ శుక్రవారం నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. 14 గ్రామాల్లో పంటకు నష్టం వాటిల్లిందన్నారు. ఆయన వెంట ఎఇఒ బాలరాజు ఉన్నారు.
నక్కపల్లి : మండలంలో 700 ఎకరాల్లో వరిపంట దెబ్బతింది. నక్కపల్లి, ఉపమాక, చినదొడ్డిగల్లు, కాగిత, సీతంపాలెం, జి.జగన్నాధపురం, ఉద్దండపురం, గొడిచెర్ల గ్రామాల్లో వరి చేను నేలమట్టమయ్యింది. అపరాల పంట కూడా దెబ్బతింది. చినదొడ్డిగల్లు గ్రామంలో మినుమకు ఎక్కువ నష్టం వాటిలింది.
కశింకోట: మండలంలోని 350 హెక్టార్లులో పంటకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయాధికారి హరికష్ణ తెలిపారు. అడ్డాం, చెరకాంలలో ఎక్కువ మంది రైతులు నష్టపోయారని పేర్కొన్నారు. కశింకోట, వెదురు పర్తి, ఏనుగు తుని, గోబ్బూరు గ్రామాల్లో పంటకు ఎక్కువ నష్టం వాటిల్లిందన్నారు.
భీమునిపట్నం : మండలంలో 25 శాతం మేర వరి పంట దెబ్బతింది. కోతకు వచ్చిన సుమారు 25 హెక్టార్లు వరి పంట నేలకొరిగింది. మరో 16 హెక్టార్లలో వరి పనలు నీట మునిగాయి. తాటితూరులో ఎక్కువ నష్టం జరిగినట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి సిహెచ్‌.సంధ్య రత్నప్రభ తెలిపారు. కోత కోసి నేలకొరిగిన వరి పంటకు సంబంధించి తాటితూరులో సుమారు 21 హెక్టార్లు, సింగనబంద, దాకమర్రి, టి.నగరపాలెంలలో ఒక్కో హెక్టారు చొప్పున నష్టం జరిగినట్లు వివరించారు.ఆమె పలుచోట్ల శుక్రవారం పర్యటించారు.
పద్మనాభం : మద్ది, విలాస్‌ఖాన్‌ పాలెం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం, పొట్నూరు, రెడ్డిపల్లి, కోరాడ, అనంతవరం, గంధవరం, బాందేవుపురం గ్రామాల్లో 50 శాతం పంటకు నష్టం వాటిల్లింది.
జికె.వీధి : మండలంలోని 16 పంచాయతీల పరిధిలో ఉన్న గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు.
రాంబిల్లి : మండలంలోని దిమిలి, కుమారపల్లి, రాజాల, లోవపాలెం, పంచదార్ల, మామిడివాడ, కొత్తూరు గ్రామాల్లో 4 వేలా 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
ఆదుకుంటాం : అధికారులు
తుపాన్‌ ప్రభావం వలన పంటలకు నష్టం కలిగితే ప్రభుత్వ పరంగా ఆదుకోవడం జరుగుతుందని నర్సీపట్నం వ్యవసాయశాఖ ఎడి మోహన్‌రావు తెలిపారు. శుక్రవారం గొలుగొండ, చిన్నయ్యపాలెం, జోగుంపేట, పాతమల్లంపేట ప్రాంతాల్లో ఆయన నీటమునిగిన వరి పంటను పరిశీలించారు. నీటి మునిగిన పంటను రక్షించుకోవడానికి కాలువలు ఏర్పాటు చేసి నీరు బయటకు పోయే విధంగా రైతులు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామాల్లో సర్వే నిర్వహించి పంట నష్టం ఉంటే నమోదు చేస్తామన్నారు. ఎఒ మధుసూధనరావు పాల్గొన్నారు.
రైతులను ఆదుకోవాలి : సిపిఎం

విశాఖపట్నం : నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయిన రైతులను గుర్తించి నష్టపరిహారం అందించే చర్యలను వెంటనే చేపట్టాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. గ్రామస్థాయిలో పరిశీలిస్తే కోత దశలోవున్న వరి పంట నష్టం అధికారులు చెప్పిన లెక్కల కంటే అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. తక్షణమే పంట నష్టం వివరాలు నమోదు చేయాలని, సాంకేతిక కారణాలు చూపి నష్ట తీవ్రతను తగ్గించి చూపొద్దని హితవుపలికారు. ఎకరా వరికి రూ.25వేలు, చెరకుకు రూ.60 వేలు, ఉద్యాన పంటలకు రూ.50వేలు చొప్పున ఇవ్వాలన్నారు. పంట నష్ట జరిగి ఈ -క్రాప్‌లో నమోదుకాని రైతులకు కూడా పరిహారం అందించాలని కోరారు.
తక్షణమే పంట వివరాలు నమోదు చేయాలి : సిపిఐ
కలెక్టరేట్‌ : నివర్‌ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంట నీట మునిగి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సిపిఐ జిల్లా సమితి కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ప్రభుత్వం తక్షణమే పంట నష్టం వివరాలు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.