Sep 28,2020 16:19

కార్తిక్‌ శివకుమార్‌

దేశభక్తిని గురించి సోషల్‌ మీడియాలో స్లోగన్లు పెట్టే సినిమా సెలబ్రిటీలు ఎంతో మంది. అయితే కొందరు మాత్రమే 'దేశమంటే మట్టికాదోరు... మనుషులోరు!' అని నమ్ముతారు. అలాంటి వారిలో తమిళ హీరో కార్తి ఒకరు. కార్తి రైతులకు అండగా నిలబడేందుకు ఇటీవల 'ఉళవన్‌ ఫౌండేషన్‌' స్థాపించారు. రైతుల పంట పొలాలకు నీళ్లు అందించే పనులు చేపట్టారు. 'మా నాన్న సినిమా పరిశ్రమకు రాకపోయి ఉంటే మేము ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాళ్లం' అని కార్తి తన మూలాల గురించి చెప్పే మాటల్లోనే కాదు, ఈ ఫౌండేషన్‌ ద్వారా చేసే పనుల్లోనూ ఎంతో నిజాయితీ కనిపిస్తుందని ప్రశంసలు అందుకుంటున్నాడు. 'ఊపిరి' సినిమాతో అక్కినేని నాగార్జునతో పాటు తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన హీరో కార్తి గురించి కొన్ని విశేషాలు.

వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకుల్ని అలరించే హీరోల్లో కార్తి ఎప్పుడూ ముందు వరసలోనే ఉన్నారు. తన సోదరుడైన హీరో సూర్య కంటే కాస్త లేటుగా ఇండిస్టీలోకి అడుగుపెట్టినప్పటికీ అన్నతో సమానమైన ప్రేక్షకాదరణ పొందిన నటుడు కార్తి. సూర్య 'అగరం ఫౌండేషన్‌'తో పేద విద్యార్థులకు ఎంతో సహాయం చేస్తుంటే, కార్తి 'ఉళవన్‌' ఫౌండేషన్‌తో రైతుకు అండగా ఉంటున్నాడు. 'ఉళవన్‌' అంటే రైతు అని అర్థం. తాజాగా ఈ ఫౌండేషన్‌ ద్వారా తిరునల్వెలి జిల్లాలోని రాధాపురం తాలూకాకు చెందిన సూరావలి కెనాల్‌కు 13 కి.మీ. పొడవున తవ్వకం, మరమ్మతు పనులు చేయించారు. ఓమ్ని కనెక్ట్‌ ఇండియా ప్రై.లి. సహకారంతో ఈ పనులు నిర్వహించినట్లు తెలియజేశారు. దీని ద్వారా అక్కడ ఎనిమిది చెరువులకు నీటి సరఫరా జరిగి, పది గ్రామాల్లో 10 వేల ఎకరాలకు మేలు చేకూరుతుందని ప్రకటించారు.
అసలు పేరు : కార్తిక్‌ శివకుమార్‌
పుట్టింది : 25 మే, 1977
విద్య : మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ.
సినిమాలకు ముందు : ఇంజినీరింగ్‌ తర్వాత నెలకు రూ. 5000 లకు ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు. కొన్నాళ్లకు ఉన్నత చదువుల కోసం అమెరికన్‌ స్కాలర్‌షిప్‌ సాధించి, న్యూయార్క్‌లోని బింగ్‌హమ్‌టన్‌ యూనివర్సిటీలో ఇండిస్టియల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ డిగ్రీ పూర్తి చేశారు. ఇక్కడ చదువుతున్నపుడే ఒక ఎలక్టీవ్‌ సబ్జెక్ట్‌గా ఫిల్మ్‌మేకింగ్‌ని ఎంచుకున్నారు. అక్కడ చదువుకుంటూనే గ్రాఫిక్‌ డిజైనర్‌గా పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేసేవారు. చివరికి తన మజిలీ సినిమా పరిశ్రమ అని తెలిసినప్పటికీ తన తండ్రి శివకుమార్‌ ప్రోత్సాహం మేరకు సినిమాల కంటే ముందు ఉన్నత చదువు పూర్తిచేశారు.

కార్తిక్‌ శివకుమార్‌
సినిమాల్లో ఎంట్రీ : ప్రారంభంలో దర్శకుడు కావాలని అనుకున్నారు కార్తి. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం దగ్గర సహాయకుడిగా పనిచేస్తూ, అనుకోకుండా అదే సినిమాలో ఒక పాత్ర చేయాల్సి రావడం, తర్వాత నటనకు ఆఫర్లు రావడంతో నటుడిగా స్థిరపడ్డారు. హీరోగా తన మొదటి సినిమా 'పరుత్తివీరన్‌' (2007)తోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు పొందారు.
ప్రత్యేకతలు : నేపథ్యగానం. శగుని (2012)లో 'కంధ కార వాడై...', బిరియాని (2013)లో 'మిస్సిస్సిపి...' అనే పాటలు పాడారు.
సామాజిక సేవ :  తన అభిమానులను వివిధ సామాజిక కార్యక్రమాలకు ప్రోత్సహించడంలో భాగంగా తన 31వ ఏటలోనే 'మక్కల్‌ నాల మంద్రం' అనే సామాజిక సంక్షేమ క్లబ్‌ ప్రారంభించారు. ఇంతేనా! రక్తదానం నుంచి వికలాంగులకు సైకిళ్ల పంపిణీ, మహిళలకు కుట్టుమిషన్లు, పిల్లలకు స్కూల్‌ బ్యాగ్‌లు, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం వంటి చాలా కార్యక్రమాలు చేపట్టారు. కార్తి 2011లో లైసోసోమల్‌ స్టోరేజ్‌ వ్యాధులపై అవగాహనలో అంబాసిడర్‌గా ఉన్నారు. ఇప్పుడు 'ఉళవన్‌ ఫౌండేషన్‌' ద్వారా రైతులకు సేవ చేస్తున్నారు. 2018లో తాను రైతుగా నటించిన 'కడైకుట్టి సింగమ్‌' (తెలుగులో 'చినబాబు') సినిమా సందర్భంగా రైతులకు పోటీ నిర్వహించాడు. ఎవరైతే వ్యవసాయం సులభతరం చేయడానికి కొత్త పనిముట్లు కనుగొంటారో అలాంటి రైతులకు లక్షన్నర బహుమతి ప్రకటించారు. ఎల్లప్పుడూ రైతులకు అండగా ఉంటానని తరుచుగా చెబుతుంటారు కార్తి.
రాబోయే సినిమాలు : బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వంలో 'సుల్తాన్‌', మణిరత్నం దర్శకత్వంలో 'పొన్నియిన్‌ సెల్వన్‌'.