Jan 26,2021 00:46

ప్రజాశక్తి - అనకాపల్లి
రైతు వ్యతిరేక చట్టాలను తక్షణమే రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో చేపట్టిన రైతాంగ ఉద్యమానికి, జనవరి 26న తలపెట్టిన భారీ ట్రాక్టర్‌ ర్యాలీకి సంఘీభా వంగా పట్టణంలో తలపెట్టే రైతు రక్షణ యాత్రను విజయవంతం చేయాలని సిపిఎం పార్టీ నియోజకవర్గ కన్వీనర్‌ ఏ.బాలకష్ణ పిలుపునిచ్చారు. స్థానిక సర్వ కామదాంబ పార్కు వద్ద సోమవారం జరిగిన సభలో మాట్లాడారు. చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తుంటే ప్రధాని మోడీ నీరో చక్రవర్తిలా వ్యవహరించడం తగదన్నారు. ఈ ఉద్యమానికి అంతర్జాతీయంగా మద్దతు లభిస్తున్న నేపథ్యంలో ఈ చట్టాలను రద్దు చేయాలన్నారు. విద్యుత్‌ ఉత్పత్తి పంపిణీని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం విరమించు కోవాలన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌ స్థలాన్ని ఇతర అవసరాలకు మళ్లించరాదని, తుమ్మపాల షుగర్‌ ఫ్యాక్టరీని ఆధునీకరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొన్నారు.
రైతు నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అఖిల భారత రైతాంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే రైతు పెరేడ్‌ను విజయవంతం చేయాలని ఏఐకెఎస్‌సిసి నాయకులు బాలు, బాలకష్ణ పిలుపునిచ్చారు. అనకాపల్లి శారద వంతెన నుంచి మంగళవారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమయ్యే ట్రాక్టరు, స్కూటర్‌ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు