Jan 17,2021 10:23

న్యూఢిల్లీ : సిక్కు ఫర్ జస్టిస్ కేసులో రైతు నాయకుడు బల్దేవ్ సింగ్ సిర్సా, పంజాబీ నటుడు దీప్ సిద్ధులతో సహా సుమారు 40 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నోటీసులు  ​​పంపించడాన్ని పంజాబ్‌లోని 32 రైతు సంస్థలు తీవ్రంగా ఖండించాయి.  సిర్సా,  సిద్ధు ఢిల్లీలోని ఉగ్రవాద నిరోధక సంస్థ ప్రధాన కార్యాలయానికి ఆదివారం హాజరుకావాలని ఎన్ఐఏ కోరింది.  రైతు సంస్థలకు నోటీసులు పంపడం ద్వారా కేంద్ర ప్రభుత్వం భయపెట్టాలని చూస్తోందని,  అయితే రైతులు అలాంటి ఒత్తిడికి తలొగ్గరని సిర్సా చెప్పారు. రైతు పోరాటంలో పనిచేస్తున్న రైతులను వేధించడానికి కేంద్ర ప్రభుత్వం యుఎపిఎ కింద నోటీసులు పంపింది. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) తనకు పంపిన నోటీసులో జనవరి 17 న కార్యాలయంలో హాజరుకావాలని ఆదేశించినట్లు తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరించిందని రైతు సంఘాలు ఆరోపించాయి. రైతుల ఉద్యమానికి బిజెపి నేతృత్వంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం భయపడుతోందని రైతు నాయకులు పేర్కొన్నారు. రైతుల ఉద్యమంలో విదేశీ నిధులను ఉపయోగించారనే ఆరోపణలను బిజెపి కుట్రగా ఆయన అభివర్ణించారు. ఢిల్లీలోని సింగు సరిహద్దులో నిర్వహించిన రైతుల సమావేశం తరువాత  రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ విలేకరులతో మాట్లాడుతూ...  రైతుల ఆందోళనపై బిజెపి ప్రభుత్వం తీవ్ర భయాందోళనలో ఉందని  చెప్పారు. వారు మా ఐక్యతను విచ్ఛిన్నం చేయడంలో విఫలమయ్యారు.  అందుకే ఇప్పుడు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలకు నోటీసులు పంపుతున్నారని రాజేవాల్ తెలిపారు.  కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన ఆయన...  నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నామని, మాపై ఒత్తిడి తేవడం ద్వారా ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయలేరని అన్నారు. ప్రజలలో అశాంతిని సృష్టించడానికి ఈ మొత్తం నాటకం సృష్టించబడిందని ఆయన అన్నారు.  ప్రభుత్వంతో జరిగిన చర్చల సందర్భంగా రవాణాదారులు, చేతివృత్తులవారు, అమరవీరుల కుటుంబాలకు సహాయం చేసే వారికి నోటీసులు జారీ చేసే అంశం లేవనెత్తినట్లు రాజేవాల్ తెలిపారు.  జనవరి 19 న జరిగే తదుపరి రౌండ్ సమావేశంలో సామాన్యుల వేధింపుల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని చెప్పారు. 

కాగా, శిరోమణి అకాలీదళ్ నాయకుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ మాట్లాడుతూ... రైతు నాయకులను, రైతు మద్దతుదారులను ఎన్ఐఏ, ఇడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ద్వారా ప్రశ్నించేందుకు పిలుస్తూ... బెదిరించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని, 9వ తేదీ చర్చలు విఫలమైన తర్వాతనుండి కేంద్రం రైతులను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమౌతోందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.