Oct 24,2021 06:50

సర్వే ప్రకారం ఎ.పి లో 49.6 శాతం రైతులకే బ్యాంకుల నుండి సంస్థాగతంగా రుణాలు అందుతున్నాయి. వ్యవసాయం చేసే సగం మంది అన్నదాతలకు బ్యాంక్‌ పరపతి మృగ్యం. ఇచ్చామంటున్నవీ ఎక్కువ రెన్యువల్స్‌. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అప్రస్తుతమై పోయింది. సంస్థాగత పరపతిలో వాణిజ్య బ్యాంకుల నుండి అందుతున్నది 34.1 శాతం. దేశానికి అన్నం పెట్టేందుకు పంటలు పండించే రైతులకు బ్యాంకులు పెట్టుబడులు సమకూర్చకపోతే వారికి పైకం ఎలా అందుతుంది? గతి లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వడ్డీ వ్యాపారుల నుండి 31.1 శాతం మంది, సాధారణ వడ్డీ వ్యాపారుల నుండి 15.4 శాతం మంది అప్పు చేసి పంటలు సాగు చేస్తున్నారు.

     రైతుల స్థితిగతులపై జాతీయ గణాంక కార్యాలయం ఇటీవల విడుదల చేసిన 77వ రౌండ్‌ సర్వే వివరాలు అన్నదాతల వాస్తవ బతుకు చిత్రాన్ని ఆవిష్కరించాయి. దేశంలో వ్యవసాయ సంక్షోభం అంతకంతకూ తీవ్రమవుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో ఆ తీవ్రత ఇంకా ఎక్కువగా ఉందని నేషనల్‌ శాంపిల్‌ సర్వే (ఎన్‌.ఎస్‌.ఎస్‌) ఫలితాలు ధ్రువీకరిస్తున్నాయి. సర్వే లెక్కలు 2018 చివరి నాటివి. అనంతరం ఆర్థిక మాంద్యం, కరోనా పెను విలయం రైతు జీవితాన్ని మరింత దుర్బలమొనర్చాయి. ఇప్పుడు సర్వే చేస్తే వచ్చే ఫలితాలను ఊహించడానికే భయమేస్తుంది. అందుబాటులోకి వచ్చిన తాజా గణాంకాల మేరకు మన రాష్ట్ర రైతన్న సగటు రుణం అక్షరాలా 2 లక్షల 45 వేల 554 రూపాయలు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా మనదే అగ్ర స్థానం. జాతీయ సగటు రుణం రూ.74,121. జాతీయ రుణం కంటే ఎ.పి రుణం 221 శాతం అధికం. అలాగని జాతీయ స్థాయిలో రైతు పరిస్థితి బాగుందనుకోవడం పొరపాటు. 2013 నాటికి జాతీయంగా రైతు సగటు అప్పు రూ.47 వేలు కాగా ఇప్పుడది రూ.74 వేలు. అప్పటి కంటే ఇప్పుడు 57 శాతం పెరిగింది. ఎక్కువ కుటుంబాలపై అప్పు లున్న రాష్ట్రాల్లోనూ ఎ.పి దే మొదటి స్థానం. మన రాష్ట్రం లోగల రైతు కుటుంబాల్లో 93.2 శాతం అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. మన దగ్గర కోటి మంది రైతులుండగా 93.2 లక్షల మందిని రుణ పాశం వెంటాడుతోంది. అదే జాతీయ స్థాయిలో 50.2 శాతం వ్యవసాయ కుటుంబాలు రుణగ్రస్తమయ్యాయి. ఎన్‌.ఎస్‌.ఎస్‌ లో మచ్చుకే వివరాల సేకరణ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఇంటింటి సర్వే చేపడ ితే రైతు అప్పుల వెతలు ఇంకా దారుణంగా ఉంటాయి. వేళ్ల మీద లెక్కించగలిగేలా ఎగువ ధనిక, భూస్వాములు, కార్పొరేట్‌ వ్యవసాయదారులు మాత్రమే అప్పుల బయట ఉంటారు.
 

                                                   సగం మందికి బ్యాంక్‌ రుణాల్లేవు

సర్వే ప్రకారం ఎ.పి లో 49.6 శాతం రైతులకే బ్యాంకుల నుండి సంస్థాగతంగా రుణాలు అందుతున్నాయి. వ్యవసాయం చేసే సగం మంది అన్నదాతలకు బ్యాంక్‌ పరపతి మృగ్యం. ఇచ్చామంటున్నవీ ఎక్కువ రెన్యువల్స్‌. స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అప్రస్తుతమై పోయింది. సంస్థాగత పరపతిలో వాణిజ్య బ్యాంకుల నుండి అందుతున్నది 34.1 శాతం. దేశానికి అన్నం పెట్టేందుకు పంటలు పండించే రైతులకు బ్యాంకులు పెట్టుబడులు సమకూర్చకపోతే వారికి పైకం ఎలా అందుతుంది? గతి లేక వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఈ విషయాన్నే సర్వే కుండ బద్దలు కొట్టింది. వడ్డీ వ్యాపారుల నుండి 31.1 శాతం మంది, సాధారణ వడ్డీ వ్యాపారుల నుండి 15.4 శాతం మంది అప్పు చేసి పంటలు సాగు చేస్తున్నారు.
     వడ్డీ వ్యాపారులంటే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులను విక్రయించే వ్యాపారులు. వడ్డీపై ఉత్పాదకాలను రైతులకు అందించి వడ్డీ వేసుకుంటారు. పంటలు అమ్మగానే ముందు వారికే బకాయిలు చెల్లించాలి. గ్రామాల్లో ఈ పద్ధతి వ్యవస్థీకృతం అయినందు వల్లనే వైసిపి సర్కారు ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) వైపు రైతులు కన్నెత్తి చూడట్లేదు. సాధారణ వడ్డీ వ్యాపారులంటే అచ్చంగా చేతికి నగదు బదులిచ్చే బాపతు. వీరి వడ్డీ చాలా అధికంగా ఉంటుంది. నూటికి రూ.5-10 వసూలు చేస్తారు. రైతులకు సంస్థాగత పరపతి అందని కారణంగానే గ్రామాల్లో వడ్డీ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. ఇప్పుడు మైక్రో ఫైనాన్స్‌ సంస్థలు సైతం రైతులనే లక్ష్యంగా చేసుకొని అధిక వడ్డీలకు రుణాలిస్తున్నాయి. సర్వేలోనే మరో కీలక అంశం ఉంది. రైతులు చేస్తున్న అప్పుల్లో 60.3 శాతం కేవలం సాగుకే వెచ్చిస్తున్నారు. తతిమ్మా రుణాలను గృహ నిర్మాణం, విద్య, వైద్యం, వివాహాలు, శుభ కార్యాలు, ఇతరత్రా వ్యాప కాలకు వ్యయం చేస్తున్నారు. రైతు అప్పులంటే సాధా రణంగా వచ్చే చర్చ వారు సేద్యం కోసం చేసే ఖర్చులనే ఆ కోవలో వేస్తారు. ప్రభుత్వాలు సైతం అదే చెబుతుంది. రైతులూ మామూలు మనుషులే. సమాజంలో బతికే వారికి వచ్చే అవసరాలన్నీ వారికీ ఉంటాయి. రైతు అప్పులను సేద్యానికి కాకుండా ఆస్పత్రి, పిల్లల చదువులకు వాడకూడదనడం రైతుల పట్ల ఒక విధమైన వ్యతిరేకతను నూరి పోయడమే.
 

                                                            రోజుకు రూ.277

రైతుల ఆదాయాలపై జాతీయ గణాంక కార్యాలయం 2018-19 నాటికి ఉన్న పరిస్థితులపై సిచ్యువేషన్‌ అసెస్‌మెంట్‌ సర్వే (ఎస్‌.ఎ.ఎస్‌) గణాం కాలను మొన్ననే విడుదల చేసింది. జాతీయ స్థాయిలో రైతు కుటుంబం మొత్తం నెలవారీ పొందుతున్న ఆదా యం రూ.10,218 మాత్రమే. అన్నీ పోను దక్కుతున్నది రూ.8,337. ఒక రోజుకు పడుతున్నది రూ.277. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద పనులు చేసే కూలీకి ఇచ్చే సగటు కూలి డబ్బులకు దాదాపు సమానం. ఇది కూడా రైతు కుటుంబానికి అన్ని వనరుల నుండి సమకూరుతున్నది. ఎ.పి రైతుకు సైతం ఇంచుమించు ఇంత ఆదాయమే లభిస్తోందని ఎస్‌.ఎ.ఎస్‌ సర్వే పేర్కొంది. ఆరుగాలం కష్టించి పని చేసే రైతులకు ఇంత తక్కువ ఆదాయం వస్తున్నందునే వారి కుటుంబాలు అప్పుల్లో కూరుకుపోతున్నాయి. రైతులు రుణగ్రస్తం కావడానికి ప్రభుత్వ విధానాలే కారణం. మొదటిది సంస్థాగత పరపతి తగ్గిపోవడం. రెండవది వ్యవసాయ ఉత్పాదకాల ధరలు పెరగడం. మూడవది పంటలకు గిట్టుబాటు ధరల్లేమి. నాలుగు విపత్తుల సమయంలో పంటల బీమా వంటి సదుపాయాలు దరి చేరకపోవడం. ఈ నాలుగు ప్రధాన అంశాలపై స్వామినాథన్‌, జయతీ ఘోష్‌, కోనేరు రంగారావు, రాధాకృష్ణ వంటి కమిషన్లు అధ్యయనం చేసి సిఫారసులు చేశాయి. ఆ కమిషన్లను ప్రభుత్వాలే వేసినా అవి ఇచ్చిన సూచనలను మాత్రం బుట్టదాఖలు చేశాయి. ఎ.పి లోనే రైతుల రుణ కుటుంబాలు, సగటు రుణం దేశంలోకెల్ల గరిష్ట స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణం కౌలు వ్యవసాయం. రాష్ట్రంలో 32 లక్షల మంది కౌలు రైతులున్నారని 2015లో రాధాకృష్ణ కమిషన్‌ పేర్కొంది. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు సంస్థాగత పరపతి, ఇతర ప్రభుత్వ పథకాలను విధిగా వర్తింపజేయాలంది.
ఇప్పటికీ అతీగతీ లేదు. ప్రస్తుత వైసిపి ప్రభుత్వం తెచ్చిన నూతన చట్టం గతంలో ఉన్న అరకొర సదుపాయాలనూ దూరం చేసింది. 2020-21లో బ్యాంకులు రూ.94,629 కోట్ల పంట రుణాలిస్తే మొత్తంగా కౌలు రైతులకు ఇచ్చిన రుణాలు 79 వేల మందికి రూ.394 కోట్లు. భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసే కౌలు రైతుల 'పరపతి' ఇంత అధమస్తంగా ఉంది కనుకనే అత్యధిక రైతు కుటుంబాలు వడ్డీ వ్యాపారుల బారినపడి అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి. ఆత్మహత్యలకూ అప్పులే కారణం. ప్రభుత్వం ఎంత దాచిపెట్టినా ఏడాదికి వందల్లో రైతులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యల్లో కౌలు రైతులవే అత్యధికం.
 

                                                            విధానాలు మారాలి

రైతులకు 2004 నుండి ఎ.పి లో ఉచిత విద్యుత్‌ అమలవుతోంది. పావలా వడ్డీకే రుణాలన్నారు. 2013 నుండి సున్నా వడ్డీ అన్నారు. 2014 నుండి 2019 మధ్య రైతులకు రుణ మాఫీ అన్నారు. 2019 నుండి కేంద్ర స్థాయిలో పి.ఎం. కిసాన్‌ సాయం, రాష్ట్రంలో రైతు భరోసా అమలు చేస్తున్నారు. ఇవేవీ రైతుల జీవితాలను మార్చలేదు సరికదా మరింతగా అప్పుల్లోకి కూరుకుపోతున్నారు. ఉచిత విద్యుత్‌ను మినహాయిస్తే మిగతా పథకాలన్నీ కంటి తుడుపుకే. ఇప్పుడు ఉచిత విద్యుత్‌కూ దానికీ మీటర్ల ముసుగులో ఎసరు పెట్టారు. కఠిన నిబంధనల వలన రైతులకు పావలా వడ్డీ, సున్నా వడ్డీ వచ్చేది చాలా తక్కువ. రుణ మాఫీ అందరికీ అని చెప్పి తర్వాత పంట రుణాలేనని, గోల్డ్‌ లోన్లను మూడవ ప్రాధాన్యతగా చేసి, మాఫీని లక్షన్నరకే పరిమితం చేసి, చివరికి రూ.24,500 కోట్ల మాఫీ అని, అధికారం కోల్పోయే నాటికి రూ.15 వేల కోట్లిచ్చింది టిడిపి ప్రభుత్వం. రూ.9 వేల కోట్లు బకాయి పెట్టగా వాటితో సంబంధం లేదంది తర్వాత వచ్చిన వైసిపి ప్రభుత్వం. వైసిపి సర్కారు సైతం తక్కువ తినలేదు. రైతు భరోసా కింద ఒకేసారి ఖరీఫ్‌కు ముందు రైతుల చేతుల్లో రూ.12,500 పెడతామని హామీ ఇచ్చింది. కౌలు రైతులకూ ఇస్తామంది. పి.ఎం కిసాన్‌ కింద ఏడాదికి మూడు విడతల్లో అందే రూ.ఆరు వేలకు రాష్ట్రం ఇచ్చే వాటిని కలిపి తమకు రూ.18,500 వస్తాయనుకున్నారు రైతులు. తీరా చూస్తే కేంద్రం ఇచ్చే రూ.6 వేలను తన ఖాతాలో వేసుకొని, రూ.13,500 ఇస్తామని, అదీ ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తోంది. నికరంగా రాష్ట్రం ఇచ్చేది రూ.7500. కౌలు రైతులకు మరీ అన్యాయం చేసింది. కేంద్రం వారికి గుండు సున్నా చుట్టగా, ఇస్తామన్న రాష్ట్రం మొదటి ఏడాది 57 వేలు, రెండో ఏట 63 వేల మందికి ఇచ్చింది. ఈ నెల 26న మహా అయితే 70 వేల మంది కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. మన రాష్ట్రానికి కరువు, తుపాన్‌ విపత్తులు సర్వసాధారణం. రైతులను ఆదుకోవాల్సింది పంటల బీమా ఒక్కటే. గతంలో ఫసల్‌ బీమా కార్పొరేట్‌ ఇన్సూరెన్స్‌్‌ కంపెనీలకే మేలు చేసింది. రాష్ట్రం స్వంతంగా అమలు చేస్తున్న బీమాకు ఇ-క్రాప్‌ తప్పనిసరి చేయడంతో కౌలు రైతులకు అవకాశం లేదు. స్వంత భూమి కలిగిన రైతుల్లో సైతం 16 లక్షల మందే బీమా పరిధిలోకి వస్తున్నారు. వారిలో అతి తక్కువ మందికి, అదీ అరకొర సాయం లభిస్తోంది. ఇన్‌పుట్‌ సబ్సిడీ సైతం అంతే. సంస్థాగత పరపతి అందక, అధిక వడ్డీలపై అప్పులు చేసి పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక, విపత్తులొస్తే పంట నష్ట పరిహారం అందక రైతులు అప్పులు తీర్చలేకున్నారు. తలెత్తుకోలేక ఆత్మహత్యల బాట పడుతున్నారు. సాగును వదిలిపెడుతున్నారనడానికి ఈ ఖరీఫ్‌లో లక్షల ఎకరాలు బీడు పడటమే సాక్ష్యం. కార్పొరేట్ల గుప్పెట్లో పెట్టేందుకు బిజెపి తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు అమల్లోకొస్తే మొత్తానికే రైతు ఉనికి ప్రమాదంలో పడుతుంది. ఎన్‌.ఎస్‌.ఎస్‌, ఎస్‌.ఎ.ఎస్‌ సర్వేలతోనైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల దుస్థితిని అర్ధం చేసుకుంటాయా?

కె.ఎస్‌.వి. ప్రసాద్‌

/ వ్యాసకర్త సెల్‌ : 9490099019 /