Sep 20,2021 07:33

విలక్షణమై సినిమాలు, వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ నటుడిగా అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చున్నారు విజరు సేతుపతి. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'లాభం'. రైతు సమస్యలు, ఉమ్మడి వ్యవసాయం, రైతు సంఘాల ఎన్నికలు ఇతివృత్తంతో ఈ సినిమా తెరకెక్కింది. దేశంలో ఎనిమిది నెలలకు పైగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టంపై రైతులు పోరాటం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో విజరు సేతుపతి 'లాభం' చిత్రంలో ఏ అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు? మరి ఈ సినిమా కథేంటి? విజరు సేతుపతి ఎలా నటించారు? వంటివి తెలియాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే..!

రైతు ఇతివృత్తమే 'లాభం'


కథలోకి వెళ్తే.. వీరభద్ర అలియాస్‌ బద్రి (విజరు సేతుపతి) తన పండూరు గ్రామంలోకి ప్రవేశించడంతో కథ మొదలవుతుంది. ఆరేళ్ల ముందు ఊరు వదిలి వెళ్లిపోయిన బద్రి.. మళ్లీ పండూరు గ్రామంలోకి ప్రవేశించడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ప్రత్యర్థులు అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంటారు. అప్పటికే చాలామంది వ్యవసాయం చేయలేక గ్రామాన్ని విడిచిపెట్టేసి వెళ్లిపోతుంటారు. తాను ఈ ఆరేడేళ్లు దేశమంతా తిరిగి వ్యవసాయం ప్రాముఖ్యత తెలుసుకున్నానని, తాను వ్యవసాయం ఎలా చేయాలో చెబుతానని తన గ్రామ ప్రజలకు భరోసా ఇస్తాడు బద్రి. చాలామంది రైతులు తనకి అండగా నిలబడతారు. వచ్చీ రాగానే తనపై దాడి చేయాలని కొందరు ప్రయత్నిస్తే.. వారిని బద్రి తన్ని తరిమేస్తాడు. రైతు సంఘాన్ని తన చెప్పు చేతల్లో పెట్టుకుని ఆ ఊరు భూములపైనా, రైతులపైనా అధికారాన్ని చెలాయిస్తున్న వ్యాపారవేత్త నాగభూషణం (జగపతిబాబు). అదే గ్రామంలో రైతు సంఘం ప్రెసిడెంట్‌గా కూడా కొనసాగుతాడు. నాగభూషణం స్నేహితులపై తన స్నేహితులతో కలిసి రైతు సంఘం ఎన్నికల్లో బద్రి పోటీ చేయాలనుకుంటాడు. అలాగే రైతు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికవుతాడు బద్రి. నాగభూషణం స్నేహితులకి బద్రి ఒక పట్టాన మింగుడుపడడు.
అయితే కొడుకుతో కలిసి బయోడీజిల్‌ కంపెనీ పెట్టాలనుకున్న నాగభూషణానికి బద్రి అడ్డుగా నిలుస్తాడు. ఎలాగైనా బద్రిని దెబ్బ కొట్టాలని పన్నాగం పన్నుతారు. కానీ బద్రి మాత్రం తన స్నేహితులైన కొద్దిమంది యువకులతో కలిసి కొత్తతరహా సేద్యానికి నడుం బిగిస్తాడు. ఉమ్మడి వ్యవసాయం గొప్పతనమేమిటో చాటి చెబుతాడు. అదే క్రమంలో కొద్దిమంది చేతుల్లో ఉన్న ఇనాం భూముల్ని తీసుకుని ఊరి జనానికి పంచి పెడతారు. అయితే నాగభూషణం అతని మనుషులు వేసిన ఓ పన్నాగంలో బద్రి ఇరుక్కుంటాడు. పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతుంటాడు. చివరకు తనపై వచ్చిన అపవాదుని తను ఎలా తొలగించుకుంటాడు? ఈ క్రమంలో అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? బయో డీజిల్‌ కంపెనీ పెట్టాలనే ప్రయత్నాల్లో ఉన్న నాగభూషణం ఏం చేశాడు? బద్రికీ, నాగభూషణంకీ మధ్య సాగిన పోరాటంలో ఎవరు గెలిచారు? అనే విషయాలు తెలియాలంటే 'లాభం' సినిమా చూడాల్సిందే..
దేశంలో వ్యవసాయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. రైతుని భారతదేశానికి వెన్నుముక అంటుంటారు. అలాంటి రైతు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనే అంశాన్ని చెప్పడానికి తెరకెక్కించిన చిత్రమే 'లాభం'. అంతేకాదు.. రైతుల సమస్యను, పారిశ్రామిక వేత్తల దోపిడీిని కూడా తెలిపే సినిమా ఇది. గ్రామాల్లోని రైతులు సంఘటితమై రైతు సంఘాలను ఏర్పాటు చేసుకోకపోతే, దోపిడీకి గురి కాకతప్పదని ఈ సినిమా ద్వారా దర్శకుడు ఎస్‌. పి. జనన్నాథన్‌ తెలిపే ప్రయత్నం చేశారు. కారల్‌ మార్క్స్‌ ప్రవచించిన 'లాభం' అనే అంశం గురించి సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ కథానాయకుడు చెబుతూనే ఉంటాడు. రైతులు శ్రమదోపిడీకి ఎలా గురి అవుతున్నారో ఉదాహరణలతో సహా వివరిస్తాడు. అంతేకాదు రైతులు తాము పండించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను తామే నిర్ణయించుకోవాలని భావిస్తాడు. ఆ రకంగా చూసినప్పుడు ఇది రైతులను, రైతు సంఘాలను బలపరిచే చిత్రం. అలానే అభివృద్ధి పేరుతో పారిశ్రామిక వేత్తలు చేస్తున్న దారుణాలను ఎండగట్టే చిత్రం. కొన్ని పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం, ఇందులో చెప్పిన కొన్ని విషయాలు ఆకట్టుకునేలా ఉంటాయి.. ఇనాం భూముల వెనుక చరిత్ర, రైతులు ఇంకా పేదవాళ్లుగా మిగిలిపోవడానికి కారణాలను చెప్పిన విధానం సగటు ప్రేక్షకుడిని ఆలోచింపజేస్తుంది.
విజరు సేతుపతి తనదైన శైలిలో నటించారు. చాలా సన్నివేశాలను తన నటనాశైలితో రక్తికట్టించారు. శృతిహాసన్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది. మధ్యలో వచ్చి మధ్యలోనే వెళ్లిపోతుంది. జగపతిబాబు పెట్టుబడిదారుడిగా కనిపిస్తారు. ఆయన పాత్రకి వేరొకరితో డబ్బింగ్‌ చెప్పించడం మినహా ఫెర్ఫార్మెన్స్‌ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. డి.ఇమాన్‌ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. రామ్‌జీ సినిమాటోగ్రఫీ బావుంది. నిడివిపరంగా ఎడిటింగ్‌ బృందం మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. దర్శకుడు జగన్నాథన్‌ మరణానంతర వచ్చిన సినిమా ఇది. ఆయన ఎంచుకున్న అంశం మెచ్చుకోదగ్గదిగా చెప్పుకోవచ్చు.

చిత్రం: లాభం
నటీనటులు: విజరు సేతుపతి, శృతిహాసన్‌, జగపతిబాబు, సాయి ధన్సికా, రమేశ్‌ తిలక్‌, కలైరసన్‌ తదితరులు
సంగీతం: డి ఇమాన్‌
సినిమాటోగ్రఫీ: రామ్‌జీ
ఎడిటింగ్‌: ఎన్‌.గణేశ్‌ కుమార్‌, ఎస్పీ అహ్మద్‌
నిర్మాత: పి. ఆర్ముగం కుమార్‌,
విజరు సేతుపతి
దర్శకత్వం: ఎస్‌.పి.జననాథ్‌
విడుదల: 09-09-2021