Nov 30,2020 18:41

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీ వేదికగా చేస్తున్న ఆందోళనలకు రోజురోజుకూ మద్దతు పెరుగుతుంది. తాజా రాజస్థాన్‌లో బిజెపికి మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఎన్డీయేకు అల్టిమేటం జారీ చేసింది. ఆందోళన చేస్తున్న రైతులతో వెంటనే చర్చలు జరపాలని, రైతు వ్యతిరేక మూడు చట్టాలను వెంటనే రద్దు చేయాలని ఆ పార్టీ ఎంపి హనుమాన్‌ బెనివల్‌ డిమాండ్‌ చేశారు. నాలుగు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరి తగదని అన్నారు. గురువారానికి బదులు వెంటనే రైతులతో చర్చలు జరపాలని డిమాండ్‌ చేశారు. అమిత్‌షాను ఉద్దేశించి ట్వీట్‌ చేసిన బేనివల్‌ రైతుల డిమాండ్లు నెరవేర్చకుంటే తాము ఎన్డీయేలో కొనసాగేది లేదని అల్టిమేటం జారీచేశారు. రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోడంతోపాటు స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులన్నింటినీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో జాట్‌లు అధికంగా ఉండే 10 నుండి 15 లోక్‌సభ సీట్ల పరిధిలో ఆర్‌ఎల్‌పికి అధికంగా పట్టు ఉంది. గత ఎన్నికల్లో బిజెపితో పొత్తుతో ఆర్‌ఎల్‌పి పోటీ చేసింది. ఇప్పటికే వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బిజెపికి ఎప్పటి నుండో మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాళీదళ్‌ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.