Aug 08,2021 12:55

ఇటీవల కాలంలో తెలుగు సినిమాలతో పాటు పలు ఇతర భాషా చిత్రాలూ తెలుగులో రిలీజవుతున్నాయి. అంతేకాదు.. సామాజిక కథాంశాలతో వచ్చే ఈ చిత్రాలు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో మలయాళంలో విజయం సాధించిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదమవుతున్నాయి. అయితే మలయాళంతో పాటు, తెలుగువారికి కూడా సుపరిచితమైన నటుడు మమ్ముట్టి సినీ రంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన నటించిన పొలిటికల్‌ డ్రామా ఒన్‌ ఆహాలో వెండితెర ప్రేక్షకుల ముందుకొచ్చింది. రాజకీయాల్లో సమూల ప్రక్షాళన తీసుకురావాలని ప్రయత్నించే ముఖ్యమంత్రి పాత్ర ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. దీంతో పాటు రైట్‌ టు ది రీకాల్‌ అనే కథాంశంపై సినిమా నడుస్తుంది. అయితే అసలు సినిమా కథేంటి? ముఖ్యమంత్రిగా మమ్ముట్టి ఎలా నటించారు? అనుకున్న లక్ష్యాన్ని చేరతాడా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే !

చిత్రం : ఒన్‌
నటీనటులు : మమ్ముట్టి, మురళీగోపి, మాథ్యూ థామస్‌, జోజు జార్జ్‌ తదితరులు
దర్శకుడు : సంతోష్‌ విశ్వనాథ్‌
నిర్మాతలు : శ్రీలక్ష్మి ఆర్‌
సంగీత దర్శకుడు : గోపీ సుందర్‌
ఎడిటర్‌ : నిషద్‌ యూసఫ్‌
సినిమాటోగ్రఫీ : వైది సోమసుందరమ్‌
విడుదల తేదీ : జులై 30, 2021
ఓటీటీ : ఆహా

          కట్‌ చేస్తే ఫుడ్‌ డెలివరీ ఇవ్వడానికి దాస్‌ అనే వెయిటర్‌ ఓ అపార్ట్‌మెంట్‌కు వెళ్తాడు. కరెంటు పోవడంతో సెక్యూరిటీకి ఇచ్చి వెళ్తానని చెప్పినా, ఫుడ్‌ ఆర్డర్‌ చేసిన వ్యక్తి అందుకు ఒప్పుకోడు. దీంతో 12 అంతస్తులు ఎక్కి, ఆర్డర్‌ చేతికి ఇచ్చేసరికి తీవ్ర అస్వస్థతకు గురవుతాడు. దీంతో అతని కుమారుడు సంజరు (మాథ్యూ థామస్‌), కుమార్తె సీనా (గాయత్రి అరుణ్‌) కలిసి తండ్రిని ఆస్పత్రిలో చేర్చి, ఫుడ్‌ డెలివరీ తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్లి, గొడవ పెట్టుకుంటారు. అక్కడి నుంచి ఆస్పత్రికి తిరిగొచ్చేసరికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్లూరి రామచంద్రం (మమ్ముట్టి) వైద్య పరీక్షల నిమిత్తం అప్పటికే ఆస్పత్రికి వచ్చి ఉంటాడు. ముఖ్యమంత్రికి ఉండే ప్రోటోకాల్‌ వల్ల సంజరు ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఈ క్రమంలో సంజరు, అతని అక్కని పోలీసులు లోపలికి వెళ్లనివ్వకపోగా, సంజరుపై దాడి చేస్తారు. దీంతో మనస్థాపం చెందిన సంజరు స్నేహితురాలి సలహాతో ఫేస్‌బుక్‌ ఫేక్‌ ఐడీ క్రియేట్‌ చేస్తాడు. అందులో ముఖ్యమంత్రి మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తూ... ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెడతాడు. అది కాస్తా వైరల్‌గా మారుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని విపక్ష నాయకుడు జయానంద్‌ (మురళీ గోపీ) రాస్తారోకోలు, సమ్మెలు, స్ట్రైక్‌లు చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో రాజకీయాల్లో సమూల ప్రక్షాళన తీసుకురావాలని సంకల్పిస్తాడు. ఇక ప్రజాప్రతినిధుల పనితీరుపై ప్రజలకు అసంతృప్తి ఉంటే వారి కాలపరమితి తీరక ముందే వారిని రీ కాల్‌ చేసే బిల్లు కోసం కల్లూరి చంద్రం ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కల్లూరి చంద్రంకు ఎదురైన పరిస్థితులు ఏంటి? కల్లూరి చంద్రం స్నేహితుడు, పార్టీ ప్రెసిడెంట్‌ అయిన బాబీ (జోజు జార్జ్‌) చివరకు ఏం చేస్తాడు? వ్యవస్థలో మార్పు తీసుకురావడానికి పునాది ఎలా పడింది? తనకు వ్యతిరేకంగా పోస్ట్‌ పెట్టిన సంజరు కథ ఏమవుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానమే వన్‌ చిత్రం.
        రాజకీయ వ్యవస్థలోని లోపాలను తెలియజేస్తూ ఇప్పటి వరకూ అనేక కథలు వచ్చాయి. అప్పుడెప్పుడో తీసిన 'ఒకే ఒక్కడు, లీడర్‌, నేనే రాజు నేనే మంత్రి' సినిమాలు నుంచి ఇటీవల తీసిన 'భరత్‌ అనే నేను' చిత్రం వరకూ వచ్చినవన్నీ రాజకీయ కథాంశాలే.. ప్రతిదానిలోనూ ఎన్నికల ముందు రాజకీయ నాయకులు వ్యవహరించే తీరు.. పదవిలోకొచ్చాక మారే వారి ప్రవర్తనల తాలూకా కథలే. ఒక్కో చిత్రంలో ఒక్కో పాయింట్‌ను దర్శకులు టచ్‌ చేశారు. అయితే 'ఒన్‌' చిత్రంలో గతంలో వచ్చిన చిత్రాలకు పూర్తి భిన్నమైన పాయింట్‌ను దర్శకుడు సంతోష్‌ విశ్వనాథ్‌ ఎంచుకున్నారు. రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ ది పీపుల్‌ అమెండ్‌మెంట్‌ బిల్లు ఆర్‌ రైట్‌ టు ది రీకాల్‌.. తమ నాయకుడి పనితీరు సంతృప్తిగా లేకపోతే ఐదు సంవత్సరాలు పూర్తికాకముందే ఆ నాయకుడిని రీకాల్‌ చేసే అవకాశం ఓటర్లకు ఉండాలి. ఒక నియోజకవర్గంలో 50 శాతం లేదా అంతకంటే ఎక్కువమంది ఓటర్లు తమ నాయకుడు పనితీరు సరిగాలేదని స్పీకర్‌కు లేఖ ఇస్తే, ఆ ప్రాంతంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ కొత్త పాయింట్‌ను ఇందులో ప్రజెంట్‌ చేశాడు. సీఎంకు వ్యతిరేకంగా పోస్ట్‌ చేసిన సంజరును ఏం చేస్తారన్న ఉత్కంఠతో ఆసక్తి కలిగించేలా ఆయా సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు. అక్కడి నుంచి సీఎం చుట్టూ ఎలాంటి రాజకీయాలు జరుగుతాయి? ప్రభుత్వంలో ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ పదవులు కాపాడుకోవటం కోసం ఎలాంటి బెదిరింపులకు పాల్పడతారు? ప్రభుత్వాన్ని విమర్శల పాలు చేయడానికి ప్రతిపక్షం ఎలాంటి కుట్రలు చేస్తుంది. వంటి అంశాలను చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు. 'ఎటు అవకాశం ఉంటే అటు మారడమే సీనియారిటీ అనుకుంటే, నాకు ఈయనపై చెప్పేలేనంత గౌరవం ఉంది' వంటి డైలాగ్‌లు నేటి రాజకీయ నాయకుల కప్పదాట్లను సూటిగా ప్రశ్నించాయి. ద్వితీయార్ధం మొత్తం రైట్‌ టు రీకాల్‌, ప్రతిపక్షాలు చేసే కుట్రల చుట్టూ తిరుగుతుంది. సీఎం ఆటోలో వెళ్లడం, యూనివర్సిటీలో స్పీచ్‌ తదితర సన్నివేశాలు ప్రేక్షకులతో చప్పట్లు కొట్టిస్తాయి.
          కల్లూరి చంద్రం పాత్రలో మమ్ముట్టి తన అనుభవాన్ని చూపించారు. సీఎం పాత్రలో ఎంతో హుందాగా కనిపించారు. నీతి, నిజాయితీకి నిలువుటద్దంలా.. ప్రజలకు కష్టాలు వస్తే క్షణంలో స్పందించే మనసున్న నేతగా అందరినీ మెప్పిస్తారు. స్నేహితుడికి అండగా ఉంటూనే, పార్టీ అధ్యక్షుడిగా తాను పడే మథనాన్ని బాబి పాత్రలో జోజు జార్జ్‌ అద్భుతంగా చూపించారు. ఇక సాధారణ కుటుంబం, మధ్యతరగతి యువకుడిగా సంజరు చక్కగా నటించాడు. ప్రతిపక్ష నాయకుడిగా జయానంద్‌ క్యారెక్టర్‌లో మురళీ గోపీ సరిగ్గా సరిపోయారు. మిగిలిన పాత్రల్లో అందరూ చక్కగా నటించారు. ముఖ్యంగా నేపథ్య సంగీతం, బిజిఎం అందరినీ మెప్పిస్తుంది. కొన్ని సీన్లు రొటీన్‌ అనిపించాయి. వాటికి కత్తెరపడితే బాగుండేది. సినిమాటోగ్రఫీ బాగుంది. మాటలు కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉంటాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.