Nov 30,2020 23:21

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సిఐటియు నాయకులు

ప్రజాశక్తి-కాకినాడ సిటీ
పోరాటం ద్వారానే రైల్వేను కాపాడుకోగలమని సిఐటియు జాతీయ ఉపాధ్యక్షులు జి.బేబిరాణి అన్నారు. భారతీయ రైల్వే ప్రాముఖ్యతను వివరిస్తూ 'రైల్వే ప్రయివేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ' వేసిన పుస్తకాన్ని సిఐటియు నాయకులు సోమవారం ఆవిష్కరించారు. కచేరిపేటలోని లక్ష్మీ దాస్‌ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రతి ఏడూ 2.30 కోట్ల మందిని గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రపంచంలోనే 4వ స్థానంలో మన రైల్వే వ్యవస్థ ఉందన్నారు. 167 ఏళ్ల చరిత్ర కలిగి దేశ ప్రజలకు అత్యంత చవకైనా ప్రయాణాన్ని అందించే ఈ వ్యవస్థను ప్రయివేటు పరం చేయడం దారుణమన్నారు. ఏడాదికి రూ.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరుస్తుందన్నారు. 13,500 ప్రయాణికుల రైళ్లు, 9,100 గూడ్స్‌ రైళ్లతో 7,500 రైల్వే స్టేషన్లతో 13 లక్షల మంది ఉద్యోగులు, 1.24 లక్షల కిలోమీటర్ల రైల్వే లైన్‌ కలిగిన సంస్థను ప్రయివేటు పెట్టుబడిదారులకి కారు చవకగా బిజెపి ప్రభుత్వం అమ్మేస్తుందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రయివేటీకరణ అంటే సామాజిక న్యాయాన్ని వదులుకోవడమేనన్నారు. దేశాన్ని ప్రేమించే దేశభక్తులందరు దేశ సంపద మొత్తం కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెడుతున్న మోడీ, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వీరలక్ష్మి, చెక్కల రాజ్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షులు శేషబాబ్జి, దుర్గాప్రసాద్‌, బలరాం, మాలకా రమణ, చంద్రమళ్ల పద్మ పాల్గొన్నారు.