Nov 25,2020 06:42

భారతీయ రైల్వే దేశ ఆర్థిక వ్యవస్థకు జీవ నాడి. కోట్లాది ప్రజల జీవనంలో రైల్వే ఒక భాగం. సుమారు 2.3 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ, రోజుకు సరాసరి 30 లక్షల కిలోమీటర్లు దూరాన్ని తిరుగుతూ, ప్రపంచ రైల్వేలో నాల్గో స్థానంలో ఉంది. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషించడంతో పాటు...సాధారణ ప్రజలు రవాణా చార్జీలు భరించేలా సౌకర్యం కల్పిస్తూ...దేశ ఐక్యత, సమగ్రతలకు, అభివృద్ధికి భారత రైల్వేలు ఎంతగానో దోహదపడుతున్నాయి. రైల్వే రంగంతో పాటు ప్రభుత్వం రంగ సంస్థలన్నింటిని స్వదేశీ, విదేశీ ప్రైవేట్‌ కార్పొరేట్‌ సంస్థలకు మోడీ ప్రభుత్వం నైవేద్యంగా సమర్పిస్తోంది.


ఇటువంటి అవకాశం మళ్ళీ రాదని, దీన్ని వినియోగించుకుని కార్మిక చట్టాల్లో మార్పులు చేసి కార్మికుల్ని కట్టు బానిసలుగా చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. బిజెపి ప్రభుత్వం, 109 రూట్లలో పెద్ద రైల్వే స్టేషన్లు మధ్య ఇండియన్‌ రైల్వే ట్రాక్‌ల పై 151 జతల పాసెంజర్‌ రైళ్లును నడిపేందుకు స్వదేశీ, విదేశీ కార్పొరేట్‌ సంస్థల నుండి వారి అర్హతల వివరాలను (రిక్వెస్ట్‌ ఫర్‌ క్వాలిఫికేషన్‌) సమర్పించమని కోరింది. బెంగళూరు, ఛండీగఢ్‌, జైపూర్‌, ఢిల్లీ, ముంబయి, పాట్నా, ప్రయాగరాజ్‌, సికింద్రాబాద్‌, హౌరా, చెన్నై మొదలైన 12 జన సమర్థ (క్లస్టర్లు) నగరాలను కలుపుతూ ఈ 151 జతల పాసెంజర్‌ రైళ్లు నడుస్తాయి. రైల్వేను విడగొట్టి, ముక్కలు చేయడం తద్వారా ప్రైవేటీకరించేందుకు తోడ్పడే విధంగా చేయడమే దీని వెనుకనున్న ఉద్దేశమని స్పష్టమవుతోంది.


పాత పట్టాలు, సిగలింగ్‌ సిస్టమ్‌ల నిర్వహణకు ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉంది. అయితే ఉద్యోగులను పెంచడం లేదు సరికదా మంజూరయిన పోస్టులనే కుదించి వేస్తున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ జులై 2, 2020న 109 రైల్వే లైన్లను ప్రైవేటు వారికి అప్పగించాలని నిర్ణయించిన రోజే కొత్త ఉద్యోగాలపై నిషేధం విధిస్తూ అన్ని జోన్ల మరియు ఉత్పత్తి కర్మాగారాల జనరల్‌ మేనేజర్లకు ఉత్తర్వులు జారీ చేసింది. గడచిన రెండేళ్లలో కొత్తగా ఉత్పన్నమైన పోస్టులను పున:సమీక్షించాలని కోరినా ఇప్పటికీ భర్తీ చేయలేదు. అలాగే ఈ కొత్త పోస్టులను నింపవద్దంటూనే, ఖాళీగా పడి వున్న పోస్టులలో 50 శాతాన్ని సరండర్‌ చేసింది. ఇవన్నీ ఆర్థిక చర్యలలో భాగంగానే చెప్తున్నారు. అలాగే ప్రభుత్వం అన్ని రైల్వే విభాగాల ఆపరేషన్‌ మరియు నిర్వహణ కార్యక్రమాలను 15 శాతానికి కుదించింది. గతంలో 2020, జూన్‌ 19న రైల్వేలో తీసుకోవలసిన పొదుపు చర్యలను ప్రతిపాదిస్తూ అన్ని జోన్లకు ఉత్తర్వులను జారీ చేసింది. అందులో భాగంగానే లాభాలు రాని బ్రాంచ్‌ లైన్లను వీలైనంత మేరకు మూసేయాలని, ఔట్‌ సోర్సింగ్‌ పనులను కూలంకషంగా పున:సమీక్షించి తగ్గించాలని, ముఖ్యంగా రైళ్లలో హౌస్‌ కీపింగ్‌ సర్వీసులను (బెడ్‌ రోల్స్‌, స్టేషన్‌ క్లీనింగ్‌, సిటిఎస్‌, లిఫ్ట్‌ ఎస్కలేటర్ల వద్ద ఎస్కార్ట్‌ లను), అనౌన్సర్లను తీసేయాలని నిర్ణయించింది. ఉద్యోగుల ఓ.టి., టి.ఏ. లను 50 శాతానికి కుదించడమే కాకుండా ఇతర రకాల అలవెన్సులను 33 నుంచి 50 శాతానికి కుదిస్తూ రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఉన్న పోస్టుల తగ్గింపు ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థల చేత సృష్టించబడే పోస్ట్‌లకన్నా ఎక్కువే. మనం గతంలో చూసినట్లు, ఈ కొత్తగా సృష్టించబడే ప్రయివేటు ఉద్యోగాలు కూడా ప్రమాదకరమైన లక్షణాలతో కూడుకున్న అరకొర జీతాలతో, ఎలాంటి ఉద్యోగ భద్రత, ఆర్థిక సామాజిక భద్రత లేని కాంట్రాక్టు ఉద్యోగాలు, నిర్ణీత కాల పరిమితితో కూడిన ఉద్యోగాలు, అప్రెంటిస్‌లు, ట్రైనీలు మాత్రమే ఉంటారు. తేజాస్‌ ప్రైవేట్‌ ఎక్స్‌ప్రెస్‌లో మహిళలను నియమించారు. వీరు రూ.15 వేల నెల జీతానికే, రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. మేకప్‌ బాగా లేదని పనిష్మెంట్లకు గురి అవుతున్నారు. మహిళా ఉద్యోగుల దుస్థితికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. మన పిల్లలకు రైల్వేలో శాశ్వత ఉద్యోగాలు దొరకడం ఒక సుదూర స్వప్నమే.


రైలు వేగాన్ని పెంచి, ప్రయాణ సమయాన్ని తగ్గించడం ద్వారా విమాన ప్రయాణికులను రైలు ప్రయాణం వైపు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. సాధారణ ప్రయాణికుల అవసరాలతో నిమిత్తం లేకుండా, ప్రైవేట్‌ ఆపరేటర్లే ట్రైన్‌ ఏ స్టేషన్లో ఆగాలో నిర్ణయిస్తారు. ఆ స్టాప్‌లు కూడా పరిమితంగా ఉంటాయి. విమాన సౌకర్యం లేని చోట్లకు, ధనవంతుల కోసం రైళ్లను నడుపుతారు. మన దేశంలో ప్రపంచ స్థాయి రైళ్లు ధనికులకే తప్ప, కోట్లాది సాధారణ ప్రజలు ఉపయోగించుకునేందుకు కాదన్నది స్పష్టం అవుతుంది. ప్రైవేట్‌ రైళ్లుకు అనుకూలంగా మరొక వాదన ఏమిటంటే, రిజర్వేషన్‌ కోటాను పెంచడం ద్వారా, అత్యధిక మంది పాసెంజర్ల వెయిటింగ్‌ లిస్ట్‌ క్లియర్‌ అవుతుందట. కాని రైల్వే గణాంకాల ప్రకారం, 2018-19 సంవత్సరంలో 8.85 కోట్ల వెయిటింగ్‌ లిస్ట్‌ పాసెంజర్లలో 16శాం మాత్రమే క్లియర్‌ అయ్యాయని తెలుస్తుంది. ఇవి కూడా 70 శాతం బెర్తులు ఎ.సి, 30 శాతం బెర్తులు స్లీపర్‌ క్లాస్‌కు చెందినవి. వెయిటింగ్‌ లిస్ట్‌లో బెర్త్‌లకు డిమాండ్‌ వున్నా పెంచడం లేదు. అవసరానికి తగ్గట్టు స్లీపర్‌ క్లాస్‌ బెర్తులు పెంచాలి. అయినా ప్రైవేటీకరణ, లాభాలే తన లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించి, పేద ప్రజలకు అందుబాటు లోకి తెచ్చేందుకు పూనుకోదు.

ప్రజలకు ప్రపంచ స్థాయి ప్రయాణ సౌకర్యాలు కావాలంటే ప్రయివేటీకరణ తప్పనిసరి అని మీడియా రంగం అనేక వార్తా కథనాలను ఊదరకొడుతోంది. ప్రస్తుతం ప్రయాణీకుల ఛార్జీలలో 53 శాతం మాత్రమే వసూలు చేస్తూ, 47 శాతం రాయితీ పొందుతున్నారు. ఈ సబ్సిడీని ఒకేసారి ఎత్తివేయడం అవుతుంది. దీంతో ప్రయాణీకుల చార్జీలు ఒకేసారి రెట్టింపు అవుతాయి. అంతే కాకుండా సీనియర్‌ సిటిజన్లు, పిల్లలు, వికలాంగులు, క్యాన్సర్‌ పీడితులు, విద్యార్థులు తదితరులకిచ్చే రాయితీలు కూడా ఉండవు. పాస్‌లు అనుమతించబడవు. నేటి వరకు భారత రైల్వేలు సామాన్య జన బాహుళ్యానికి, పేదలకు అందుబాటు ధరలలో ఉండేవి. కానీ ఇకపై ఎంత మాత్రమూ కావు. ప్రయాణీకుల చార్జీలను పెంచి కార్పొరేట్ల లాభాల స్థాయికి తగిన భూమికను ఏర్పాటు చేసి భారత రైల్వేకి పోటీగా కార్పొరేట్‌ రంగ లాభాల్ని చూపించే ప్రయత్నం చేస్తోంది.
అనేక రకాలుగా దేశ సంపదను ప్రైవేటు కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం దోచిపెడుతోంది. భారత ప్రజలమైన మనం, కార్మిక వర్గం...బి.జె.పి. చేస్తున్న ఈ దేశ విద్రోహకర చర్యను చూస్తూ మౌన ప్రేక్షకులుగా ఎంతమాత్రం ఉండకూడదు. ఏ త్యాగాలకైనా సిద్ధపడి ఈ దుర్మార్గపు చర్యను ఐక్యంగా ఎదుర్కోవాలి. రైల్వేల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ...రైల్వే యూనియన్లతో సహా భారత దేశంలో ఉన్న మొత్తం కార్మిక వర్గం మొత్తం మీద...ఈ మహోద్యమంలో కలసి రావాలి. బిజెపి ప్రభుత్వ వినాశకర విధానాలను తిప్పికొట్టేందుకై భారత ప్రజానీకం, కార్మికవర్గం కలసి రావాలి. భారత ప్రజల ఆస్తులు అమ్మకం కోసం కాదని అలాగే ఎట్టి పరిస్థితుల లోను అమ్మనీయబోమని బిజెపి ప్రభుత్వానికి బలమైన సందేశాన్ని ఉధృత ఉద్యమాల ద్వారా తెలియజేయాల్సిన ఆవశ్యకత వుంది.
                                            - వి. ఉమామహేశ్వరరావు (సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు)