
మహిళలు కొన్ని ఉద్యోగాలకే పరిమితం అవ్వాలనే భావనని బద్దలు కొడుతూ... గత మూడేళ్లుగా రైలుబండిని సమర్థవంతంగా నిర్వహిస్తోంది ఆ వనితల బృందం. కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని వాంచినాడ్ ఎక్స్‌ప్రెస్‌ని నిర్వహించేది మొత్తం మహిళలే!
మన దేశంలో మహిళలచే నిర్వహించే ఏకైక రైలు వాంచినాడ్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలును సీనియర్ ఇంజినీర్ ఒకరు, జూనియర్ టెక్నీషియన్లు తొమ్మిది మంది. హెల్పర్లు ఎనిమిది మందితో మొత్తం 18 మంది మహిళలు దీనిని నిర్వహిస్తున్నారు. 58 ఏళ్ల సబియా బివి ఈ బృందానికి పర్యవేక్షకురాలిగా, వి.ఎం.శ్రీలేఖ (36) సూపర్వైజర్గా వ్యవహరిస్తున్నారు.
గ్రూప్-డి కేటగిరిలో నియామకం అయిన వారు సాధారణంగా ఎనిమిది నుంచి పదో తరగతి వారే ఉంటారు. కానీ ఈ మహిళలు రకరకాల డిగ్రీ అర్హతల్ని పొంది ఉన్నారు. ఉద్యోగ నియామకానికి మూడు నెలల ముందు ఈ బృందానికి మెకానికల్ 'ట్రిప్ షెడ్యూల్' శిక్షణ ఇచ్చారు. అందులో భాగంగానే 24 కోచ్‌లున్న రైల్లో .. ప్రతికోచ్కూ బల్టులను, గేర్, బ్రేక్‌లను, బోగీ లింక్‌లను తనిఖీ చేసి వాటిని శక్తినంతా ఉపయోగించి బిగించాల్సి ఉంటుంది. బ్రేక్ వైర్లను సమర్థవంతంగా బిగించాలి. ఈ శిక్షణలో చురుగ్గా, చాకచక్యంగా, సమర్థవంతంగా పనిచేయగలిగితేనే వారికి ఉద్యోగం లభిస్తుంది. రాత్రి, పగలూ, ఎండా, వాన .. ఇలా ఏ సమయమైనా తమకు కేటాయించిన పనిని షెడ్యూల్ ప్రకారం రోజూ పూర్తి చేయాలి. బరువైన టూల్‌బాక్స్‌ను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలా ప్రతి నిత్యం తనిఖీ చేసుకోవడంతోపాటు ఆ ఇంజిన్ మరమ్మతుల్ని కూడా వారే చేయాలి. అనుకోని అవాంతరాలు తలెత్తినప్పుడు హుఠాహుటిన పరుగులు పెట్టాలి. రబ్బరు బూట్లు, చేతిలో టార్చ్, తలపై హెల్మెట్‌తో పాటు బరువైన పనిముట్లను తీసుకుని వెళ్లి క్షణాల్లో పని చక్కబెగట్టగలగాలి. ఈ పని అంతా నిలబడి చేయాల్సి ఉంటుంది. ఎక్కువ దూరం నడవాల్సి ఉంటుంది. వారు పనిచేసే చోటు రైలు ఇంజిన్ వద్ద వేడిని తట్టుకోగలగాలి. అటు శారీరకంగానూ, మానసికంగానూ ఒత్తిడితో కూడుకున్న పని ఉంటుంది. ఒక్కోసారి చిన్న చిన్న గాయాలు తగులుతుంటాయి. వాటిని ఓర్పుగా తట్టుకుని నేర్పుగా ముందుకు సాగడమే లక్ష్యంగా, పని చేస్తోంది ఈ మహిళా బృందం. గత మూడేళ్లలో ఈ మహిళా బృందం చేపట్టిన పనిలో ఎటువంటి పొరపాట్లు, ప్రమాదాలు చోటుచేసుకోలేదు. నిత్యం అప్రమత్తంగా ఉంటూ సమర్థవంతంగా, సురక్షితంగా పనిచేస్తున్నందుకు ఈ మహిళా బృందానికి ప్రభుత్వం నుంచి ప్రశంసలతోపాటుగా జాతీయ అవార్డు దక్కింది. భారత రైల్వే పింక్ ఉమెన్ టీమ్‌గా వాంచినాడ్ ఎక్స్‌ప్రెస్ నిర్వహిస్తోన్న ఈ బృందాన్ని చేర్చింది.