Oct 28,2021 11:23

వాషింగ్టన్‌ : ముఖ్యమైన పండుగలు లేదా వ్యాపారం లాభాలు చవిచూస్తేనో, గొప్ప ఒప్పందాలు కుదిరితేనే ఉద్యోగులకు కంపెనీలు బోనస్‌లు ఇస్తూ ఉంటాయి. దాదాపు అన్ని కంపెనీలు ఇవే బాటలో నడుస్తాయి. కానీ అమెరికాకు చెందిన స్పాన్‌క్స్‌ కంపెనీకి చెందిన మహిళా బాస్‌ మాత్రం ఇందుకు భిన్నం. ఆమెనే సారా బ్లేక్లీ. ఉద్యోగులకు ఊహించనంత బోనస్‌ ఇవ్వడమే కాకుండా.. కళ్లు చెదిరే ఆఫర్‌ కూడా ఇచ్చారు. తమ కంపెనీకి చెందిన ఉద్యోగి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లివచ్చేందుకు రెండు ఫస్ట్‌క్లాస్‌ విమాన టికెట్లు ఇవ్వడంతో పాటు .. ఖర్చుల కోసం రూ. 7.5 లక్షల చొప్పున బోనస్‌ ప్రకటించి.. గొప్ప మనసున్న బాస్‌గా నిలిచారు. అసలు విషయంలోకి వెళితే.. స్పాన్స్‌కో మెజార్టీ వాటాను బ్లాక్‌ స్టోన్‌ కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 1.2 బిలియన్‌ డాలర్లు (అంటే రూ. 8.93 వేల కోట్లు). అయితే ఈ సంస్థను స్థాపించేందుకు తాను పడిన కష్టాలు, దాన్ని లాభాల బాట పట్టించేందుకు తాను పడ్డ కృషిని ఉద్యోగులకు తెలియజేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఒప్పందాన్ని ఉద్యోగులతో పంచుకున్నారు. ఆ ఆనంద క్షణాల్లోనే ఉద్యోగులకు భారీ ఆఫర్లు, బోనస్‌లు ప్రకటించారు. దీంతో ఉద్యోగులు ఉబ్బితబ్బి అవుతున్నారు.