Nov 26,2020 07:28

భారత రాజ్యాంగ పరిషత్‌ 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. ఆ రోజును ''రాజ్యాంగ దినోత్సవం'' గా ప్రకటించారు. భారత రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు రాజ్యాంగ పీఠిక (ప్రియాంబుల్‌)లో పేర్కొన్నారు. దీనితో పాటు 1973లో కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎం.సిక్రి ఆధ్వర్యంలో 13 మంది న్యాయమూర్తులతో ధర్మాసనం ఏర్పడి తీర్పు చెప్పింది. సమాఖ్య విధానం, లౌకిక విధానం, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ స్వతంత్రత, భావ ప్రకటనా స్వేచ్ఛ, ఆర్థిక-సామాజిక న్యాయం మొదలగు అంశాలను రాజ్యాంగ మౌలిక స్వరూపంగా తీర్పులో పేర్కొన్నది. గత ఆరేళ్లుగా రాజ్యాంగ మౌలిక లక్షణాలను దెబ్బ తీసే ప్రయత్నం ఒక పథకం ప్రకారం మోడీ ప్రభుత్వం చేస్తున్నది.
సమాఖ్య స్ఫూర్తికి తూట్లు
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సమాఖ్య రాజ్యంగా ఉండాలని భావించారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల అధికారాల కంటే కేంద్రం ఆధిపత్యం ఉండాలని కోరుకుంటుంది. ఏకపక్షంగా నోట్ల రద్దు, లాక్‌డౌన్‌ నిర్ణయాలు తీసుకున్న సందర్భాల్లో కేంద్రం తీరును అనేక రాష్ట్రాలు ప్రశ్నించాయి. జిఎస్‌టి ప్రవేశ పెట్టే సందర్భంలో కేంద్రం రాష్ట్రాలకు అనేక వాగ్దానాలు చేసింది. రాష్ట్రాల ఆదాయానికి లోటు ఏర్పడితే కేంద్ర 'సంఘటిత నిధి' నుండి ఆ లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నిలబెట్టుకోలేదు. జిఎస్‌టి నష్ట పరిహారాన్ని చెల్లించే బాధ్యత నుండి తప్పుకున్నది. కరోనా సంక్షోభ ప్రభావం ఎక్కువగా రాష్ట్రాలపై పడి, రాష్ట్రాలకు లభించే ఆదాయంలో 60 శాతం నుండి 70 శాతం తగ్గుదల కనిపిస్తున్నది. 2020-21 సంవత్సరానికి కేంద్రం పరిహారంగా రాష్ట్రాలకు చెల్లించవలసినది రూ. 3 లక్షల కోట్లు కాగా, ఇందులో జిఎస్‌టి సెస్‌ ద్వారా రూ. 65 వేల కోట్లు సమకూరగా, మిగిలిన రూ. 2.35 లక్షల కోట్లను రాష్ట్రాలకు చెల్లించడానికి కేంద్రం మొండిగా నిరాకరిస్తున్నది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు రాష్ట్రాల పన్నుల వాటాను 42 శాతం నుండి 41 శాతానికి తగ్గించింది. వ్యవసాయం రాష్ట్ర జాబితాలో ఉండగా, స్వంతంగా చట్టాలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది. కేంద్రం వ్యవసాయంలో చొరబడి, వ్యవసాయ చట్టాలను చేసి రాష్ట్రాలపై పెత్తనం చేయబోతున్నది. నూతన విద్యా విధానం 2020లో కూడా విద్యపై కేంద్రం ఆధిపత్యం పెంచే అనేక అంశాలు ఉన్నాయి. ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీస్తూ పథకం ప్రకారం మోడీ ప్రభుత్వం భారత సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తున్నది.
లౌకిక విధానంపై దాడి
భారతదేశ మత పరమైన 'భిన్నత్వం' దృష్ట్యా లౌకిక విధానమే శ్రేయస్కరమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను కల్పించారు. రాజ్యాంగం మైనార్టీలకు విద్యా, సాంస్కృతిక హక్కు ద్వారా అనేక రక్షణలు కల్పించినది. గత ఆరేళ్లుగా లౌకిక విధానాన్ని దెబ్బ తీసి మతతత్వంతో ప్రజల మధ్య మతపరమైన విభజన తేవటానికి కేంద్ర ప్రభుత్వం, సంఘ పరివార్‌ ప్రయత్నం చేస్తున్నాయి. గో రక్షక దళాల పేరుతో దేశంలో అనేక ప్రాంతాలలో మైనారిటీలు, దళితులపై దాడులు జరుగుతున్నాయి. జమ్ము-కాశ్మీర్‌కు 370వ నిబంధన రద్దు, సిఏఏ, ఎన్‌ఆర్‌సి వంటి చట్టాలు, ట్రిపుల్‌ తలాక్‌ వివాదం, రామాలయ నిర్మాణం మొదలగు అంశాలన్నీ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి, ప్రజల మధ్య, కార్మిక వర్గం మధ్య ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. లౌకిక విధానమే భారత ప్రజల ఐక్యతను పరిరక్షిస్తుంది.
పార్లమెంటరీ ప్రజాస్వామ్యం
రాజ్యాంగ నిర్మాతలు భారత దేశానికి అధ్యక్ష పాలనా విధానం కంటే పార్లమెంటరీ విధానం శ్రేయస్కరమైనదని భావించారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ద్వారా నియంతృత్వ విధానాలు ప్రబలకుండా అరికట్టవచ్చని భావించారు. బిజెపి విధానాల ప్రకారం భారతదేశంలో అధ్యక్ష పాలనా విధానం అవసరమని భావిస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితమే ఎల్‌.కె.అద్వానీ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ప్రస్తుతం అధికారం మొత్తం నరేంద్ర మోడీ చేతుల్లో, పీఎంవో వద్ద కేంద్రీకృతమై పాలన కొనసాగుతున్నది. రాష్ట్రాలతో, కేంద్ర మంత్రులతో సంప్రదింపుల ప్రక్రియ పూర్తిగా నిర్వీర్యమైంది. పెద్ద నోట్ల రద్దు, కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ ప్రకటించడం మొదలగు వాటిలో కేబినెట్‌లో కూడా చర్చ జరగలేదు. జరుగుతున్న ప్రక్రియను పరిశీలిస్తే పార్లమెంటరీ విధానం క్రమక్రమంగా అధ్యక్ష పాలనా విధానం వైపు అడుగులు వేస్తున్నట్లుగా ఉంది. ఇది అత్యంత ప్రమాదకరం.
న్యాయ వ్యవస్థపై ఒత్తిడి
న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పని చేసినప్పుడే రాజ్యాంగానికి, ప్రజల హక్కులకు సంరక్షణ ఉంటుంది. కాని గత ఆరేళ్లుగా న్యాయ వ్యవస్థ తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నది. న్యాయమూర్తుల నియామకంలో మోడీ సర్కారు జోక్యం చేసుకుంటున్నది. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలు, ప్రమోషన్లను కూడా ప్రభావితం చేస్తున్నది. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులకు తాయిలాలు అందిస్తున్నది. సుప్రీంకోర్టులో ఇటీవల జరిగిన అనేక సంఘటనలు న్యాయ వ్యస్థపై ఒత్తిడిని తెలుపుతున్నాయి. జమ్ము-కాశ్మీర్‌కు సంబంధించి 370 ఆర్టికల్‌ రద్దు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇంతవరకు విచారించలేదు. కాశ్మీర్‌లో 4జి నెట్‌వర్క్‌ కనెక్షన్‌ ఇవ్వకపోవడానికి సంబంధించి ప్రజలు ప్రాథమిక హక్కులు సంరక్షించడంలో సుప్రీంకోర్టు ఘోరంగా విఫలమైంది. వలస కార్మికులకు సంబంధించిన కేసుల్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించడం దారుణమైన విషయం. న్యాయ వ్యవస్థపై ట్వీట్లు చేయడాన్ని మహాపరాధంగా భావించి...కోర్టు ధిక్కార నేరం కింద సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌కు శిక్ష విధించడం న్యాయ వ్యవస్థపై ఒత్తిడిలో భాగమే. నవంబర్‌ 11న రిపబ్లిక్‌ టి.వి అర్ణబ్‌ గోస్వామికి యుద్ధప్రాతిపదికపై బెయిల్‌ మంజూరు చేయడం, ఆ సందర్భంగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోయేవిగా ఉన్నాయి. దేశంలో వేలాది మంది బెయిల్‌ లేకుండా జైళ్లలో మగ్గుతున్నారు. ప్రస్తుతం న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలు ప్రజ్యాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని విలువలను పరిరక్షించేవిగా లేవు.
భావప్రకటనా స్వేచ్ఛ
భారత రాజ్యాంగంలోని 19వ నిబంధన పౌరులందరికి భావప్రకటన స్వేచ్ఛ కల్పించింది. రాజ్యాంగం ఇచ్చిన అతి ముఖ్యమైన హక్కులలో అసమ్మతి హక్కు ఒకటి. తాను నమ్ముతున్న వాటిని ప్రచారం చయటానికి ప్రతి పౌరుడికి హక్కు ఉంది. గత ఆరేళ్లుగా భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు పెరిగాయి. సిఏఏ, ఎన్‌ఆర్‌సి లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంపై అనేక ఆంక్షలు విధించారు. ఉద్యమాలకు సంఘీభావం ప్రకటించినందుకు సీతారాం ఏచూరి, ప్రొ|| జయతీ ఘోష్‌, యోగేంద్ర యాదవ్‌ వంటి వారిపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటనా స్వేచ్ఛను కాలరాయడమే. ఢిల్లీ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ వంటి విశ్వ విద్యాలయాల్లో జరుగుతున్న ఉద్యమాలను అణచివేయటానికి కన్నయ్య కుమార్‌, ఉమర్‌ ఖలీద్‌ వంటి విద్యార్థి నాయకులపై కేసులు పెట్టారు. ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే భావప్రకటనా స్వేచ్ఛ, అసమ్మతి హక్కు అత్యంత ఆవశ్యకం. ఆర్థిక హక్కులు, పౌరహక్కులు, పర్యావరణ హక్కులు, సామాజిక హక్కులు పరిరక్షించబడాలంటే అసమ్మతి హక్కుని అనుమతించాలి. భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడుకోవాలి.
ఆర్థిక, సామాజిక న్యాయం
ప్రజలందరికి ''ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం'' జరగాలని భారత రాజ్యాంగ పీఠిక చెప్పింది. ప్రస్తుత బిజెపి ప్రభుత్వం గత పార్లమెంట్‌ సమావేశాలలో కార్మిక చట్టాలను సవరించి, 'లేబర్‌ కోడ్ల' పేరుతో కార్మిక హక్కులను కాలరాచింది. వ్యవసాయ చట్టాలను తెచ్చి రైతాంగ హక్కులను దెబ్బ తీసింది. దళితులు, గిరిజనులు మొదలగు బలహీన వర్గాల వారి హక్కులను కాపాడే చట్టాలను పరిరక్షించటానికి ప్రయత్నించటం లేదు. ఎస్‌సి, ఎస్‌టి అత్యాచారాల నిరోధక చట్టంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మార్చటానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. మన రాష్ట్రం లోని గిరిజన ప్రాంతాలలో ఉపాధ్యాయుల నియామకానికి సంబంధించి జీఓ నెం.3 ను సుప్రీంకోర్టు రద్దు చేస్తే దానిపై కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేదు.
పైఅంశాలతో పాటు కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలైన జాతీయ ఎన్నికల కమిషన్‌, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మొదలగు వాటి పనిలో కూడా జోక్యం చేసుకుంటున్నది. ఇటీవల కాలంలో ఎన్నికల కమిషన్‌ చేసిన అనేక నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం ప్రభావితం చేసింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశంలో రాజ్యాంగ వ్యవస్థలపై, రాజ్యాంగ ఆశయాలు, లక్ష్యాలు, విలువలు, ఆదర్శాలపై జరుగుతున్న దాడుల మీద చర్చ జరగాలి. ప్రజాస్వామ్య వాదులు, లౌకిక వాదులు, సామాజిక కార్యకర్తలు, ప్రజలు రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే విధంగా గొంతెత్తాలి.
                                                                                                 కెఎస్‌.ల‌క్ష్మ‌ణ‌రావు                                                                                                                 

                                                                                    (వ్యాసకర్త శాసనమండలి సభ్యులు,
                                                                                     సెల్‌ : 94402 62072)

lakshmanarao