Apr 15,2021 01:08

దీక్షకు మద్దతుగా కూర్చున్న లోకనాధం, రమణికుమారి తదితరులు

ప్రజాశక్తి-యంత్రాంగం
ఉక్కునగరం : రాజ్యాంగాన్ని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి ప్రజా పోరాటాలు చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌, చైర్మన్లు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్‌ పిలుపునిచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన దీక్షలు 62వ రోజుకు చేరుకున్నాయి. బుధవారం నాటి దీక్షల్లో టౌన్‌ అడ్మిన్‌, విఎస్‌జిహెచ్‌, టిటిఐ, సిఎస్‌డి, హెచ్‌ఆర్‌డి, ఆగ్రో విభాగాల కార్మికులు ఉద్యోగులు కూర్చున్నారు. దీక్షా శిబిరంలో ముందుగా అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి రాజశేఖర్‌, డి.ఆదినారాయణ, జె.అయోధ్యరాం మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. రక్షణ రంగం ఉద్యోగులు కూర్చున్న బుధవారం నాటి దీక్షలను లోకనాథం ప్రారంభించారు.
ఆకట్టుకున్న ప్రజానాట్యమండలి కళా ప్రదర్శనలు
కలెక్టరేట్‌ : జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద ప్రభుత్వరంగ పరిరక్షణ కోసం జరుగుతున్న రిలే నిరాహారదీక్ష శిబిరం వద్ద ప్రజానాట్యమండలి కళాకారులు డాక్టర్‌ బి ఆర్‌ అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్‌ గీతాలు ఆలాపించారు. అనంతరం స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటుకరణకు వ్యతిరేకంగా దండు నాగేశ్వరరావు రచించి, దర్శకత్వం వహించిన వీధినాటికలు ప్రదర్శించారు. కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు, కళాప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అచ్యుతాపురంలో రౌండ్‌టేబుల్‌ సమావేశం
అచ్చుతా పురం రూరల్‌ : స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ ఆపాలని, సొంత గనులు కేటాయించాలని అఖిలపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, ఉపాధ్యాయ, యువజన సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌చేసింది. అచ్యుతాపురంలోని ఎస్‌ఆర్‌కె రెసిడెన్సీలో బుధవారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కర్రి అప్పారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎలమంచిలి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కూండ్రపు అప్పారావు, టిఎన్‌ఎస్‌ఎఫ్‌ విద్యార్థి నాయకులు దేవర శివ, టిడిపి యువజన నాయకులు రాజు, ఉపాధ్యాయ సంఘం డిటిఎఫ్‌ నాయకులు ఎం.వెంకట అప్పారావు, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు కె.సోమునాయుడు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్‌.రాము మాట్లాడారు. ప్రజలందరూ పోరాడి స్టీల్‌ పరిశ్రమ కాపాడుకోవాలన్నారు. ఎల్‌ఐసి, రైల్వే, బ్యాంకులు తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటుకు అప్పగిస్తే రాబోయే కాలంలో యువతకు ఉపాధి దొరకదని చెప్పారు. ఈ కార్యక్రమంలో ముఠా సంఘం నాయకులు సత్తిబాబు, లాలం సత్యనారాయణ, లాలం రామారావు, పెయింటర్ల సంఘం నాయకులు ఎం.రమణ పాల్గొన్నారు. పత్రికా విలేకరులు మద్దతు తెలిపారు.