Jan 15,2022 09:07

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : తాను రాజకీయాల్లోకి రావడం లేదని, రాజ్యసభ సీటు అడిగాననేది ప్రచారమేనని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. కృష్ణాజిల్లా డోకిపర్రులో మెగా కృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన వెంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహించనున్న సంక్రాంతి సంబరాలకు కృష్ణారెడ్డి ఆహ్వానం మేరకు చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరిగి వెళుతూ తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు. తాను రాజ్యసభ సీటు అడగటం అనేది ప్రచారమేనని, దాన్నే వార్తలుగా ప్రసారం చేయడం సరికాదని అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం, థియేటర్ల మనుగడ కోసం సిఎం జగన్మోహన్‌రెడ్డిని కలిసి చర్చించిన విషయాలను పక్కదోవపట్టించారని తెలిపారు. ఆ సమావేశానికి రాజకీయ రంగు పులిమి రాజ్యసభకు పంపుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. అటువంటి ప్రచారాన్ని ఆపాలని కోరారు. ఇదే అంశంపై ట్వీట్‌ కూడా చేశారు. చిరంజీవికి పలువురు మద్దతు ప్రకటించారు. ట్వీట్‌ను సమర్థిస్తూ రీట్వీట్లు చేస్తున్నారు.