Jan 15,2022 15:53

-పట్టాలు తప్పించేందుకు గుర్తుతెలియని వ్యక్తుల దుశ్చర్య?
గాంధీనగర్‌: ముంబయి నుంచి ఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఈ రైలు శుక్రవారం రాత్రి గుజరాత్‌లోని వల్సాడ్‌ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్‌ స్తంభాన్ని ఢకొీట్టింది. రాత్రి 7.10గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని , ఇందులో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు శనివారం వెల్లడించారు. అయితే ఈ రైలును ఉద్దేశపూర్వకంగానే పట్టాలు తప్పించే ప్రయత్నం జరిగినట్లు అనుమానిస్తున్నామని వారు వెల్లడించారు. ' ముంబయి-హజ్రత్‌ నిజాముద్దీన్‌ ఆగస్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌ .. వల్సాడ్‌ దగ్గర్లోని అతుల్‌ రైల్వేస్టేషన్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఉంచిన సిమెంట్‌ స్తంభాన్ని ఢకొీట్టింది. వెంటనే ఆ స్తంభం పట్టాల నుంచి పక్కకు జరిగిపోయింది. ఈ ఘటన రైలు ప్రయాణంపై ఎటువంటి ప్రభావం చూపలేదు. ప్రయాణికులెవరూ గాయపడలేదు. లోకో పైలట్‌ వెంటనే రైల్వేస్టేషన్‌ సిబ్బందికి సమాచారం అందించారని వల్సాడ్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ అధికారి తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే అప్రమత్తమైన రైల్వే ఉన్నతాధికారులు , పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు సూరత్‌ ఐజీ రాజ్‌కుమార్‌ పాండియన్‌ తెలిపారు. రైలును పట్టాలు తప్పించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై వల్సాడ్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు పోలీసులుల తెలిపారు. ఇదిలిలా ఉండగా.. ఇటీవలే పశ్చిమ బెంగాల్‌ బికనేర్‌-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ప్రమాదంలో ఏడు బోగీలు పూర్తిగా ధ్వంసం కాగా, ఇప్పటివరకు తొమ్మిది మంది మృతి చెందారు. ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ జరపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.