Mar 02,2021 23:08

విజేతగా నిలిచిన ఆదోని జట్టు

ప్రజాశక్తి - కోసిగి రూరల్‌: కోసిగి రేణుక ఎల్లమ్మ జాతర సందర్భంగా కోసిగిలో నిర్వహించిన డివిజన్‌ స్థాయి ఫుట్‌బాల్‌ పోటీలు హోరాహోరీగా సాగాయి. మంగళవారం ఆదోని, కోసిగి మౌంట్‌ కార్మెల్‌ హైస్కూల్‌ రెండు జట్లు ఫైనల్‌ పోరులో తలపడ్డాయి. హోరాహోరీ పోరులో ఆదోని జట్టు విజేతగా నిలిచి మొదటి బహుమతిని కైవసం చేసుకుంది. కోసిగి మౌంట్‌ కార్మెల్‌ హైస్కూల్‌ రన్నర్‌గా నిలిచింది. విజేత ఆదోని జట్టుకు కోసిగి ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ తరుపున రూ.10 వేలను ఆదోని జట్టుకు అందించారు. రన్నర్‌గా నిలిచిన కోసిగి మౌంట్‌ కార్మెల్‌ హై స్కూల్‌ జట్టుకు కోసిగికి చెందిన దుబ్బా షౌకత్‌ ఆలీ రూ.5 వేలు అందజేశారు. ఆర్గనైజర్స్‌ విజరు కుమార్‌, సురేష్‌, శ్రీధర్‌, వంశీ పాల్గొన్నారు.