Jun 13,2021 08:40
  • ఫైనల్లో పావ్యుచెంకోవాపై గెలుపు
  • 40ఏళ్ల అనంతరం టైటిల్‌ నెగ్గిన చెక్‌ రిపబ్లికన్‌
  • ఐదేళ్లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెల్చిన మూడో అన్‌సీడెడ్‌ క్రీడాకారిణి

పారిస్‌ : ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను చెక్‌రిపబ్లిక్‌కు చెందిన అన్‌సీడెడ్‌ 25ఏళ్ల బార్బోరా క్రేజికోవా గెల్చుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో క్రేజికోవా 6-1, 2-6, 6-4తో 31వ సీడ్‌ రష్యాకు చెందిన అనస్తాషియా పావ్యుచెంకోవాను చిత్తుచేసింది. తొలిసెట్‌ను సునాయాసంగా గెల్చిన క్రేజికోవా.. రెండోసెట్‌ను ప్రత్యర్ధికి సమర్పించుకొంది. నిర్ణయాత్మక మూడోసెట్‌లో ఇరువురు హోరాహోరీగా తలపడిన తొలుతే బ్రేక్‌ పాయింట్‌ సాధించి మ్యాచ్‌ను ముగించడం విశేషం. కెరీర్‌లో ఐదో మేజర్‌ టోర్నమెంట్‌ ఆడుతూ క్రేజీకోవా ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ను ముద్దాడడం విశేషం. దీంతో గత ఐదేళ్లలో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గిన మూడో అన్‌ సీడెడ్‌ క్రీడాకారిణిగా క్రేజికోవా నిలువగా.. చెక్‌ రిపబ్లిక్‌ తరఫున 40ఏళ్ల తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గిన క్రీడాకారిణిగా బార్బోరా క్రేజికోవా రికార్డు నెలకొల్పింది.
 

                                                                         ఫైనల్లో జకోవిచ్‌

   పురుషుల సింగిల్స్‌ ఫైనల్లోకి టాప్‌సీడ్‌, సెర్బియాకు చెందిన నొవాక్‌ జకోవిచ్‌ ప్రవేశించాడు. శుక్రవారం రాత్రి జరిగిన రెండో సెమీఫైనల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌, స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌పై నొవాక్‌ జకో విచ్‌ అద్భుత విజయం సాధించాడు. నాలుగు గంటలకు పైగా సాగిన హోరాహోరీ పోరులో జకోవిచ్‌ 3-6, 6-3, 7-6(7-4), 6-2 తేడాతో నాదల్‌ను ఓడించాడు. ఈ ఓటమితో ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ రికార్డుస్థాయిలో 14వసారి గెలవాలన్న నాదల్‌ ఆశలు అడియాశయల్యాయి. నాదల్‌ సెమీస్‌లో ఓడడం ఇదే ప్రథమం. ఆదివారం జరిగే ఫైనల్లో జకోవిచ్‌ 5వ సీడ్‌ గ్రీస్‌కు చెందిన సిట్సిపాస్‌తో తలపడనున్నాడు. జకో టైటిల్‌ గెలిస్తే అతడి ఖాతాలో 19వ గ్రాండ్‌స్లామ్‌ జమ కానుంది.

01