Mar 02,2021 21:47

ఎమ్మెల్యేను సన్మానిస్తున్న వైసిపి అభ్యర్థి నంగినేని వెంకటలక్ష్మి

ప్రజాశక్తి - గుంతకల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వాలన్న టిడిపి నాయకత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.గత ఏడాది కరోనా కారణంగా మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా పడడంతో అధికార పార్టీ ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మున్సిపాలిటీలోని 37 వార్డుల్లో ఎక్కువ వార్డులు ఏకగ్రీవం చేసుకోవాలన్న యత్నానికి ఎక్కువ సమయం లభించింది. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ పచ్చజెండా ఊపడంతో ఎమ్మెల్యే తనదైన శైలిలో చైర్మన్‌ బరిలో ఉన్న 22 వార్డు అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే గాదిలింగప్ప భార్య నంగినేని వెంకటలక్ష్మిని ఏకగ్రీవం చేయించడానికి పావులు కదిపారు. ఆ వార్డులో ప్రధాన ప్రతిపక్ష టిడిపి అభ్యర్థి గుత్తి యాస్మిన్‌ తో పాటు మరో ఇద్దరితో మంగళవారం వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఈ విషయంలో స్థానక ఎమ్మెల్యే తన రాజకీయ చతురతతో అనుకున్నది సాధించాడన ఆ పార్టీ నాయకులు అంటున్నారు. ఇదే తరహాలోనే తన కుమార్తె నైరుతి రెడ్డి బరిలో ఉన్న వార్డు తో పాటు మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రామలింగప్ప భార్య భవానిని ఏకగ్రీవం చేయడానికి ఆయా వార్డుల లోని అభ్యర్థులతో వారి నామినేషన్లను ఉపసంహరణ చేసుకునేలా మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. ప్రతిపక్ష టిడిపి మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ ఎక్కువగా వార్డుల్లో గెలవడానికి తనదైన శైలిలో వ్యూహాలు పన్నుతున్నారు. బుధవారం నామినేషన్లు ఉపసంహరణ అనంతరం బరిలో ఎంత మంది అభ్యర్థులు ఉంటారు, ఎన్ని వార్డులు ఏకగ్రీవం అవుతాయన్నది తేలుతుంది.
ఎమ్మెల్యేకి వైసిపి అభ్యర్థి కృతజ్ఞతలు : మున్సిపాలిటీ 22 వార్డు వైసిపి అభ్యర్థి ఏకగ్రీవం అయింది. ఈ నేపథ్యంలో అభ్యర్థి నంగినేని వెంకటలక్ష్మి మంగళవారం స్థానిక ఎమ్మెల్యే వై.వెంకట్రామి రెడ్డి ని ఆయన క్యాంపు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన బాటలో ప్రజా సమస్యల పరిష్కారానికి కృష చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసిపి బిసి సెల్‌ రాష్ట్ర నాయకులు, మార్కెట్‌ యార్డు మాజీ ఛైర్మన్‌ గాది లింగేశ్వర బాబు(చిన్న),మాజీ కౌన్సిలర్‌ నాగరత్న, వైసిపి నాయకులు వాసు తదితరులు పాల్గొన్నారు.