Dec 04,2021 03:06

మీడియా సమావేశంలో మాట్లాడుతున్న తూర్పునౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌దాస్‌ గుప్తా

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
2022 ఫిబ్రవరి 21న ప్రెసిడెంట్స్‌ ఫ్లీట్‌ రివ్యూ (పిఎఫ్‌ఆర్‌)కు తూర్పునౌకాదళం ఆతిథ్యం ఇస్తుందని, ఇలా విశాఖలో పిఎఫ్‌ఆర్‌ జరపడం ఇది మూడోసారి అని తూర్పునౌకాదళం వైస్‌ అడ్మిరల్‌ బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా ప్రకటించారు. శుక్రవారం తూర్పునౌకాదళంలోని కాకతీయ ప్రాంగణం డాక్‌యార్డులోని ఐఎన్‌ఎస్‌ జలాశ్వ నౌకపై మీడియా కాన్ఫెరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా మాట్లాడుతూ త్రివిధ దళాధిపతి అయిన రాష్ట్రపతి 50 దేశీయ నౌకలు, కోస్ట్‌ గార్డ్‌ సామర్థ్యాలను, 50 యుద్ధ విమానాలు, జలాంతర్గాములను రివ్యూ చేస్తారని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో రెండేళ్లకోసారి జరిగే మిలాన్‌ విన్యాసాలు 2022 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 4 వరకూ విశాఖలో నిర్వహిస్తామని తెలిపారు. ఈ విన్యాసాలకు 47 దేశాలకు ఇప్పటివరకూ ఆహ్వానం పంపామని, 25 వరకూ ఇప్పటికే ఆమోదం తెలిపాయని చెప్పారు. చైనా, పాకిస్తాన్‌కు ఆహ్వానం లేదన్నారు. మిలాన్‌ విన్యాసాలకు ఫిబ్రవరి 27న ఎపి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నట్లు చెప్పారు.
అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియా ఏ దేశంతోనైనా మిలటరీ డ్రిల్స్‌ చేసినంత మాత్రాన ఆయా దేశాలతో కలసి వారి శతృవులతో మన నేవీ యుద్ధం చేయదని తెలిపారు. సంయుక్త విన్యాసాల ద్వారా నేర్చుకోవడం, బలపడడమే ప్రధానంగా చూస్తామన్నారు. ఇండో పసిఫిక్‌ రీజియన్‌లో గానీ, మలబార్‌ విన్యాసాలు ఏవైనా సరే మన ప్రయోజనాలతోనే భారత నావికాదళం చేస్తుందన్నారు.
తూర్పునౌకాదళం తన శక్తి సామర్థ్యాలను పెంచుకుంటూ విస్తరిస్తుందని, 3 అడ్వాన్స్‌డ్‌ హెలికాప్టర్‌లు ఐఎన్‌ఎస్‌ డేగా వద్ద ఉన్నాయని, నౌకాదళానికి ఎంహెచ్‌-60 మల్టీరోల్‌ హెలికాప్టర్‌లు త్వరలో రాబోతున్నాయని వెల్లడించారు. నౌకాదళానికి అత్యంత ముఖ్యమైన ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ కొచ్చిన్‌లో ట్రయల్స్‌ అవుతున్నాయని, 2022లో రాబోతుందని పేర్కొన్నారు. స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖ హిందుస్థాన్‌ షిప్‌యార్డులో చాలా నౌకల తయారీకి రంగం సిద్ధం అయ్యిందని, చాలా ఆర్డర్‌లు హెచ్‌ఎస్‌ఎల్‌లో ఉన్నాయని అన్నీ ఆచరణ రూపం దాల్చనున్నాయని తెలిపారు.
స్వదేశీ పరిజ్ఞానంతో తూర్పునౌకాదళం అభివృద్ధి అవుతుందని నేవల్‌ బడ్జెట్‌ ఈ రీజియన్‌లో రూ.57వేల కోట్లుగా ఉందని వైస్‌ అడ్మిరల్‌ తెలిపారు. ఇక్కడ గల 41 నౌకల్లో 39 ఇండియన్‌ షిప్‌యార్డుల్లోనే నిర్మించినట్లు చెప్పారు. మొత్తంగా భారత నౌకాదళంలో 130 నౌకలు (షిప్స్‌) ఉండగా, తూర్పునౌకాదళంలో 26 భారీ నౌకలు, 30 వరకూ కాస్త చిన్నవి ఉన్నాయని పేర్కొన్నారు. 60 యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయని, యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధమేనని వెల్లడించారు.
సముద్రంపై మన దేశ రక్షణ వ్యవహారాలను పరిరక్షించుకోవడం తీర భద్రత, నార్కోటిక్‌ అక్రమ రవాణా, ప్రకృతి విపత్తులు ఏవైనా సరై నేవీ సివిల్‌, మెరిటైం, వార్‌, ద్వైపాక్షిక ఆపరేషన్స్‌ నిర్వహిస్తుందని తెలిపారు. తమిళనాడు, కేరళ, ఏపి తుపాన్ల సందర్భంగా ఎన్‌డిఆర్‌ఎఫ్‌, హెచ్‌ఎడిఆర్‌ కార్యకలాపాల్లో నిమగమైనట్లు చెప్పారు. తాజాగా జవాద్‌ తుపాను సందర్భంగా యుద్ధనౌకలు, ఎయిర్‌క్రాఫ్ట్స్‌ను సిద్ధంగా వుంచామన్నారు.
నేవీ డే రద్దు
197లో ఇండియా-పాకిస్తాన్‌ యుద్ధంలో పాక్‌పై విజయానికి చిహ్నంగా ప్రతి ఏటా డిసెంబరు 4న జరుపుకునే నేవీ డేను ఈ ఏడాది కోవిడ్‌, జవాద్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు బిశ్వజిత్‌ దాస్‌ గుప్తా వెల్లడించారు. ఏటా నేవీ డే సందర్భంగా బీచ్‌ రోడ్డులో జరిగే యుద్ధనౌకలు, విమానాల విన్యాసాలు, అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించడం ఈ ఏడాది నిర్వహించడం లేదన్నారు. ఈ సమావేశంలో నేవల్‌ ఆఫీసర్‌ ఏపి ఇన్‌ఛార్జి కమడోర్‌ ఎం.గోవర్థన్‌రాజు, రియర్‌ అడ్మిరల్‌ కమాండింగ్‌ ఈస్టర్న్‌ ఫ్లీట్‌ తరుణ్‌ సోబ్టి, నేవల్‌ డాక్‌యార్డు అడ్మిరల్‌ సూపరింటెండెంట్‌ రియర్‌ అడ్మిరల్‌ ఐబి ఉత్తయ్య, కమడోర్‌ స్వప్న్‌ గుప్తా (కమాండింగ్‌ సబ్‌మెరైన్‌ ఈస్ట్‌) పాల్గొన్నారు.