
మెల్బోర్న్: ఆస్ట్రేలియా న్యూస్ పేజీలపై నిషేధాన్ని త్వరలో ఎత్తేస్తామని ఫేస్బుక్ మంగళవారం ప్రకటించింది. తాము తీసుకొచ్చిన మీడియా చట్టాన్ని సవరించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం అంగీకరించడంతో ఫేస్బుక్ ఈ నిర్ణయం తీసుకుంది. అసలు ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ఏమిటంటే.. కంటెంట్ వాడుకుంటున్నందుకు ఫేస్బుక్, మీడియా సంస్థలకు డబ్బు చెల్లించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనిని వ్యతిరేకించిన ఫేస్బుక్... ఆస్ట్రేలియా న్యూస్ పేజీలపై నిషేధాన్ని విధించింది. ఫేస్బుక్ సడెన్‌గా తీసుకున్న నిర్ణయంపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చిన ప్రభుత్వం ఫేస్‌బుక్‌ను చర్చలకు ఆహ్వానించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఆ సంస్థ ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు. ఈ చర్చల్లో భాగంగా ప్రభుత్వం చట్ట సవరణకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో న్యూస్పేజీలపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఫేస్బుక్ ఆస్ట్రేలియా మేనేజింగ్ డైరెక్టర్ విల్ ఈస్టన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఫేస్బుక్ సంస్థ తమకు మళ్లీ ఫ్రెండ్ అయిందని ప్రధాని మోరిసన్ పేర్కొన్నారు.