Apr 14,2021 20:02

భోపాల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బిఎంసి) తన 'కితాబ్‌ ఘర్‌' ద్వారా పాత పుస్తకాలకు కొత్త జీవితాన్నిస్త్తోంది. 'కితాబ్‌ ఘర్‌' పాత పుస్తకాలను సేకరించి నిల్వ చేస్తుంది. వాటిని కొత్త నోట్‌బుక్కులుగా రీసైకిల్‌ చేసి పేద పిల్లలకు పంపిణీ చేస్తుంది. పిల్లల అభివద్ధిలో పఠనం కీలకపాత్ర పోషిస్తుండగా, భోపాల్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ 'కితాబ్‌ ఘర్‌' ద్వారా పుస్తక విరాళాలను అందుకుంటోంది. 2019లో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు లక్షకు పైగా పుస్తకాలను విరాళంగా అందుకుంది.
స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించింది బిఎంసి. విద్యాసంవత్సరం పూర్తయిన తర్వాత పుస్తకాలను పడేయకూడదని చాలా కుటుంబాల్లో చాలాకాలంగా ఉన్న పద్ధతి. వాటిని వారి కుటుంబంలోని తరువాత బ్యాచ్‌ పిల్లలతో లేదా తమ అనుబంధ కుటుంబాలతో పంచుకుంటూ డబ్బును ఆదా చేస్తారు. పుస్తకాలను వృథా కానీయరు. 'కితాబ్‌ ఘర్‌' ముఖ్య లక్ష్యం కూడా ఇదే. 'ముఖ్యంగా కోవిడ్‌-19 సమయంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయాయి. అలాంటి వారికి ఈ 'కితాబ్‌ ఘర్‌' బాగా సహాయపడుతుంది' అని చెప్తున్నారు భోపాల్‌ అదనపు మునిసిపల్‌ కమిషనర్‌ ఎంపి సింగ్‌.
భోపాల్‌, ఇండోర్‌, రారుపూర్‌, లక్నో, నాగ్పూర్‌.. ఐదు నగరాల్లోని ప్రజలకు స్క్రాప్‌ సేకరణ, చెత్త పారవేయడంలో ఉచిత ఇంటి సేవలను అందిస్తున్న 'కబాడివాలా.కామ్‌'తో పౌరసంఘం భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ పుస్తకాలను మొదట రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్లలో లేదా బిఎంసి వార్డ్‌ కార్యాలయాల్లో నిల్వ చేస్తారు. తర్వాత వాటిని అవసరాలు, వినియోగం ఆధారంగా వేరుచేస్తారు. వాటిని రీసైకిల్‌ చేసి, కొత్తవి కొనుగోలు చేయలేని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పంపిణీ చేస్తారు. ''మేము కుటుంబాల నుంచి పాత పుస్తకాలను సేకరించడమే కాక, ఈ విధానం వల్ల ఎన్ని చెట్లు కాపాడబడతాయో వారికి వివరిస్తాము'' అని చెప్తున్నాడు కబాడివాలా.కామ్‌ డైరెక్టర్‌ అనురాగ్‌ అసతి.
        సేకరించిన ఈ పుస్తకాలను పాఠశాల పాఠ్య పుస్తకాలు, మ్యాగజైన్‌లు, నోట్‌బుక్‌లు, ఇంకా తర్వాత బ్యాచ్‌ విద్యార్థులకు అధ్యయన సామగ్రిగా ఉపయోగపడతాయి. ఈ విధంగా లబ్ధి పొందిన విద్యార్థులలో అథర్‌ అలీ ఒకడు. ''కోవిడ్‌-19 మా కుటుంబ ఆదాయాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను కొనలేకపోయాను. అప్పుడు నేను 'కితాబ్‌ఘర్‌'కు వెళ్లి గొప్ప సహాయాన్ని పొందాను'' అని చెప్పాడు.