Nov 30,2020 22:54

- కొనసాగుతున్న తుంగభద్ర పుష్కరాలు
- నేటితో ముగియనున్న పన్నెండేళ్ల పండగ
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి:
 కార్తీక సోమవారం సందర్భంగా తుంగభద్ర పుష్కరాల్లో పదకొండో రోజు కార్తీక శోభ కనిపించింది. పుష్కర స్నానాల కోసం ఘాట్ల వద్ద ఉదయం నుంచే భక్తుల సందడి కనిపించింది. ఘాట్లలో ఏర్పాటు చేసిన షవర్ల వద్ద భక్తులు పుష్కర స్నానాలను ఆచరించారు. సోమవారం దాదాపు 10వేల మంది భక్తులు హాజరైనట్లు అంచనా. నవంబర్‌ 20న ప్రారంభమైన తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. 12 రోజులుగా సాగుతున్న పుష్కరాల్లో భక్తుల సందడి అంతంత మాత్రమే కనిపించింది. కర్నూలు నగరం సంకల్‌ బాగ్‌ పుష్కర ఘాట్‌ వద్ద కార్తీక సోమవారం సందర్భంగా తుంగభద్ర నదికి పంచహారతి నిర్వహించారు. భక్తులు వెలిగించిన దీప కాంతులతో పుష్కరఘాట్‌ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. హారతుల అనంతరం వేద పండితులు తుంగభద్ర జలాన్ని భక్తులపై ప్రోక్షణ చేసి వేదాశీస్సులు అందించారు. ప్రిన్సిపల్‌ జిల్లా జడ్జి రాధాకృష్ణ కృపాసాగర్‌, స్పెషల్‌ జడ్జి విఎల్‌.సత్యవతి, సివిల్‌ జడ్జి వి.శ్రీనివాస్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ ఎ.శ్రీనివాస్‌ హారతి కార్యక్రమాన్ని తిలకించారు.
మంత్రాలయం : మంత్రాలయం సమీపంలోని పుష్కర ఘాట్లు జన సందోహంతో నిండి పోయాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు షవర్ల ద్వారా స్నానాలు చేస్తూ సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో పాటు కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్నానాలు చేసిన అనంతరం రాఘవేంద్రుని దర్శనార్థమై శ్రీ మఠం ముందు బారులు తీరారు. సుమారు 10 వేల మంది భక్తులు రాఘవేంద్రస్వామిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. శ్రీ మఠం యాజమాన్యం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం, భోజన వసతి కల్పించారు.
ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయుల తెప్పోత్సవం
పవిత్ర తుంగభద్రానది తీరంలో ఉత్సవ మూర్తి ప్రహ్లాదరాయుల తెప్పోత్సవం నిర్వహించారు. తుంగభద్ర పుష్కరాల్లో భాగంగా తుంగా హారతి, తెప్పోత్సవం సందర్భంగా పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పీఠాధిపతులకు వెండి కిరీటంతో సన్మానం
శ్రీరాఘవేంద్రస్వామి మఠం పీఠాధిపతులు శ్రీసుభుదేంధ్రతీర్థులను కర్నాటక రాష్ట్రం పోత్నాల్‌కు చెందిన భక్తులు వెండి కిరీటంతో సన్మానించారు. తుంగ హారతి సందర్భంగా ఆయనను భక్తులు శాలువాలు, పూలమాలలు వేసి వెండి కిరీటాన్ని అలంకరించారు. కర్నాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన విశ్వ విద్యాలయం వారు శ్రీసుభుదేంధ్రతీర్థులకు డాక్టరేట్‌ను ప్రకటించిన నేపథ్యంలో ఈ కిరీటం బహుకరించినట్లు పేర్కొన్నారు.
అలరించిన భక్తి గీతాలు
మంత్రాలయంలోని తుంగభద్ర తీరంలో ఆలపించిన భక్తి గీతాలు భక్తులను అలరించాయి. తుంగా హారతి కార్యక్రమంలో కర్నాటక రాష్ట్రంలోని సంగీత విధ్వాంసులు పుత్తూరు నరసింహ నాయక్‌ కన్నడ భక్తి గీతాలు ఆలపించారు. లక్ష దీపోత్సవం సందర్భంగా వేల సంఖ్యలో భక్తులు పాల్గొని దీపాలు వెలిగించారు. కన్నడ భాషల్లో పాడిన భక్తి గీతాలు భక్తులకు వీనులవిందు కలిగించాయి.
కౌతాళం : మేళిగనూరు గ్రామం వద్ద వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రం భక్తులతో కిటకిట లాడింది. శ్రీ రామలింగేశ్వర దేవాలయం చైర్మన్‌ మల్లికార్జున స్వామి ఉచితంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బదినేహల్‌ గ్రామానికి చెందిన నాకేష్‌ రెడ్డి ఏర్పాటుచేసిన శివ రెడ్డి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుండి ఉచితంగా వాహనాల ద్వారా పుష్కరాలకు వెళ్ళడానికి సౌకర్యం కల్పించారు.
పిల్లల నుంచి వృద్ధుల వరకూ...
కర్నూలు కార్పొరేషన్‌ : పిల్లల జలకాలాటలతో కార్తీక పౌర్ణమి రోజు పుష్కర ఘాట్లు కళకళలాడాయి. సంకల్‌ బాగ్‌ పుష్కరఘాట్‌ వద్ద జనసందోహం ఎక్కువగా కనిపించింది. ఏడాది పిల్లల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకూ పుష్కర స్నానాలు చేశారు. పుష్కర స్నానాలు వద్ద వాలంటీర్లు, పోలీసులు తమ విధుల్లో భాగంగా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తెలియజేస్తూ పుష్కర స్నానాలు ఆచరించేందుకు సహకరించారు. పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు వ్యర్థ పదార్థాలను తొలగిస్తూ శుభ్రం చేశారు.
పుష్కర ఘాట్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ
సిబెళగల్‌ : మండలంలోని గుండ్రేవుల పుష్కర ఘాటును పుష్కర ప్రత్యేక డీఎస్పీ షౌకత్‌ అలీ సోమవారం తనిఖీ చేశారు. ఇప్పటి వరకూ సుమారు 8వేల మంది పుష్కరాల్లో పాల్గొన్నట్లు పోలీస్‌ సిబ్బంది డీఎస్పీకు తెలిపారు. పుష్కర స్నానాలు, పిండ ప్రదానాల వంటి వాటిపై నిఘా పెట్టాలని, లోతట్టు ప్రాంతాల్లోకి ఎవరినీ వెళ్లనివ్వకూడదని సిబ్బందికి డీఎస్పీ సూచించారు.