Nov 25,2020 21:33

నామమాత్రంగా ఉన్న భక్తులు

పుష్కరాలకు కరోనా ఎఫెక్ట్‌
మొగ్గు చూపని విఐపిలు, ప్రజా ప్రతినిధులు
ఆరో రోజు పుష్కర ఘాట్ల వద్ద తగ్గిన భక్తుల సందడి
ప్రజాశక్తి - కర్నూల్‌ కలెక్టరేట్‌
తుంగభద్ర పుష్కరాలపై కరోనా ప్రభావం పడింది. విఐపిలు, ప్రజాప్రతినిధులు పుష్కరాలకు రావడానికి మొగ్గు చూపడం లేదు. తుంగభద్ర పుష్కరాలు ప్రారంభమై బుధవారానికి ఆరోరోజుకు చేరుకున్నాయి. జిల్లాలోని 23 పుష్కర ఘాట్ల్‌ వద్ద యాత్రికుల సందడి అంతంతమాత్రంగానే ఉంది. ఒక్క సంగమేశ్వరం పుష్కర ఘాట్‌ వద్ద మాత్రం పెద్ద ఎత్తున విచ్చేసి సాంప్రదాయ పూజలు నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో ప్రతి ఒక్కరికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నారు.
తుంగభద్ర నదికి పుష్కర హారతి : స్థానిక సంకల్‌ బాగ్‌ పుష్కరఘాట్‌ వద్ద వేదపండితులు కుంభహారతి, నంది హారతి, బిల్వ హారతి, నాగ హారతి, నక్షత్ర హారతులను నిర్వహించారు.
భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు : ఎమ్మెల్యే
కొత్తపల్లి : తుంగభద్ర పుష్కరాలకు వచ్చే భక్తులందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించామని నందికొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్‌ తెలిపారు. సంగమేశ్వర క్షేత్రంలో జరుగుతున్న తుంగభద్ర పుష్కరాలను ఆయన పరిశీలించారు. ముందుగా ఆలయ పురోహితులు తెలకపల్లి రఘురామ శర్మ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. అనంతరం సప్తనది జలాలతో ప్రత్యేక పూజలు చేశారు. ఏఆర్‌ అడిషనల్‌ ఎస్పి, పుష్కర ఘాట్‌ ప్రత్యేక అధికారి హనుమంతు, వైసిపి సీనియర్‌ నాయకులు చెరుకు చెర్ల రఘురామయ్య, రఫీ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా పోలీసులు అప్రమత్తంగా ఉండాలి : ఎస్‌పి
నివర్‌ తుఫాన్‌ ముప్పుతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ పకీరప్ప తెలిపారు. సంగమేశ్వరం పుణ్యక్షేత్రాన్ని ఎస్‌పి దర్శించుకున్నారు. ముందుగా ఎస్‌పికి పురోహితులు తెలకపల్లి రఘురామయ్య శర్మ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఎస్‌పి మాట్లాడుతూ నదులలో అనధికారికంగా బోట్‌ లు( పడవలు) నడుపుతుంటే వెంటనే ఆపాలన్నారు. ఆత్మకూరు డిఎస్‌పి శృతి, సిఐలు బిఆర్‌.క్రిష్ణయ్య, ప్రసాద్‌, కొత్తపల్లి ఎస్సై నవీన్‌ బాబు పాల్గొన్నారు.
ఆర్‌టిసి బస్సుల్లో కనిపించని కరోనా నిబంధనలు : సంగమేశ్వర క్షేత్రంలో దాదాపు ఆరుగంటలకు ఒక ఆర్టీసీ బస్సు మాత్రమే ఉండడంతో ప్రయాణికులతో కిటకిటలాడుతుంది. ఆర్టీసీ బస్సులో కరోనా నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కించి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని చర్చించుకుంటున్నారు.
మంత్రాలయం : మంత్రాలయంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సందడి తగ్గింది. పుష్కర స్నానాలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు గంగమ్మ ఘాట్‌ వద్ద రుద్రభూమి ఘాట్‌ వద్ద కొంత మేరకు భక్తులు షవర్ల ద్వారా స్నానాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం రాఘవేంద్రుని మూల బందావనాన్ని దర్శించుకున్నారు.
రాఘవేంద్రుని సన్నిధిలో గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ : మంత్రాలయం రాఘవేంద్రస్వామిని తెలంగాణ రాష్ట్ర గాయకుడు గజల్‌ శ్రీనివాస్‌ దర్శించుకున్నారు. దర్శనార్థం ఆలయం చేరుకున్న ఆయన రాఘవేంద్రుని మూల బందావనాన్ని దర్శించుకున్నారు. అనంతరం పీఠాధిపతులు శ్రీ సుభుదేంధ్రతీర్థులు ఆయనకు శేష వస్త్రం ఫల మంత్రాక్షతలు అందించి ఆశీర్వదించారు.