Oct 04,2020 19:43
పురివిప్పే వర్ణాలు.. సీజనల్‌ పూలు..

వర్షాకాలం మధ్యంతరంలో అంటే అక్టోబర్‌ మొదటి వారంలో నాటితే నవంబర్‌ చివరి వరకూ పెరిగే మొక్కల గురించి తెలుసుకుందాం.. ఇవి ఉండేది నాలుగు నెలలే. అయినా ఇల్లంతా వర్ణశోభితంతో కాంతులీనుతూ పలకరించేవి సీజనల్‌ మొక్కలు. కాస్తంత స్థలం ఉంటే చాలు.. నేలమీదైనా.. కుండీల్లోనైనా.. చక్కగా ఇమిడిపోయి కనువిందు చేస్తాయి. శీతగాలి తగలగానే మొగ్గ తొడిగి, పూలు విరిసి, మురిపిస్తాయి. ఫిబ్రవరి వరకూ సీజనల్‌ పూల హడావిడి ఉంటుంది. వాస్తవానికి సీజనల్స్‌ చాలావరకూ శీతల దేశాల మొక్కలే. కూల్‌గా ఉండే ప్రాంతాల్లో సీజనల్స్‌ మొక్కలు, పువ్వులూ బాగా నిగారింపుగా, పెద్ద పరిమాణంలో విచ్చుకుంటాయి. సాధారణంగా పూణే, బెంగళూరు ఫ్లోరీకల్చర్‌ క్షేత్రాల్లో నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో సీజనల్‌ మొక్కల నారు తయారుచేస్తారు. నారు స్టేజీలో ఉన్న వీటిని తీసుకొచ్చి, నర్సరీల్లో ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో పెంచుతారు. ఒకటి, రెండు నెలల్లో పూల పూత మొదలై, వేసవి ఆరంభానికి ముగుస్తుంది. ఈ వారం డాలియాలు.. పోన్షిటియాలు గురించి తెలుసుకుందాం..

చలికాలపు డాలియాలు


చలికాలపు డాలియాలు
చూడగానే ఆహా! అనిపించే పువ్వులు డాలియాలు. ఇవి శీతలదేశాలకి చెందిన పూజాతి మొక్కలు. ఒక్కో పువ్వు అరచేతి పరిమాణంలో ఉంటుంది. అందమైన రూపులో కొలువుదీరి, రంగురంగుల కాంతులు విరజిమ్ముతుంది. తెలుపు, ఎరుపు, పసుపు, కాషాయం, గోధుమ, ముక్కుపొడుం రంగుల్లో పువ్వులు పూసే డాలియా మొక్కలు ఉన్నాయి.


నవంబర్‌ నుంచి ఫిబ్రవరి వరకూ పువ్వులు పూస్తాయి. వేసవి కాలం వచ్చేసరికి మొక్క చనిపోతుంది. ఇది పూర్తిగా సీజనల్‌ ప్లాంట్‌. వర్షాకాలంలో మొక్క నాటితే రెండడుగుల వరకూ పెరిగి, శీతగాలి తగలగానే పువ్వులు మొదలవుతాయి. ఒక్కో పువ్వు మూడురోజుల పాటు ఉంటుంది. కుండీల్లో వీటిని పెంచుకోవడం శ్రేయస్కరం. ఇటీవల డ్వార్ప్‌ (పొట్టి) రకానికి చెందిన హైబ్రీడ్‌ డాలియాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి అడుగు ఎత్తులోనే పువ్వులు పూస్తాయి. కాస్త పువ్వు పరిమాణం చిన్నగా ఉన్నా! ఐదారు రంగుల కలబోతతో వివిధ వర్ణాల్లో జిగేల్‌ మంటాయి. ఇంటి డాబాల మీద, ప్రహరీగోడల మీద, పోర్టుకో పైన పెంచుకోవచ్చు. పువ్వులు పూసేది నాలుగు నెలలే కనుక చీడ, పీడల సమస్య ఉండదు. ఎరువుల అవసరం అసలే లేదు. పువ్వులతో సిద్ధంగా ఉండే ఇలాంటి రెడీమేడ్‌ మొక్కలు కడియం నర్సరీల్లో లభిస్తాయి.

రంగులు మార్చే.. పోన్షిటియాలు
ప్రకృతిలో గమ్మత్తయిన మొక్కల్లో పొన్షిటియాలు ఒకటి. ఆకులే పువ్వులుగా మారే వింతైన మొక్కలివి. వర్షాకాలంలో మొక్కలు నాటితే అవి పెరుగుతూ శీతాకాలంలో చలి గాలి తగలగానే ఆకులే పువ్వులైపోతాయి. అందుకే వీటిని రంగులు మార్చే ఊసరవెల్లి మొక్కలంటారు. ఎరుపు, గోధుమ, తెలుపు, లేత పసుపు, లేత గులాబి రంగుల్లో పువ్వులు పూసే పొన్షిటియా మొక్కలు ఉన్నాయి. అడుగు నుంచి రెండడుగులు ఎత్తు వరకూ ఇవి పెరుగుతుంటాయి. కుండీల్లో పెంచుకోవడం శ్రేయస్కరం. బయటి వాతావరణంలో లేత ఎండలోనూ, షేమీషేడ్‌ అంటే ఎండా, నీడా తగిలే ప్రాంతాల్లోని ఇవి పెరిగి, పూలు పూస్తాయి. రేఖలుగా ఉండే ఈ పువ్వులు చూడచక్కగా ఉంటాయి. పువ్వులు మొక్కనే ఉంచితే అందం. తుంచితే పనికిరావు. మొక్కకు ఒక్కొక్క పూరేఖా వాడిపోతుంటే చిగురుగా మరికొన్ని రేఖలు పుట్టుకొస్తాయి. వేసవి రాగానే ఉన్న పూరేఖలు, వచ్చే రేఖలు అన్నీ ఆకులుగా మారిపోతాయి. మళ్ళీ వచ్చే శీతాకాలం వరకూ మొక్కను జాగ్రత్తగా పెంచితే, చక్కగా ఆకులతో పెరుగుతుంది. చల్లని సీతగాలి తగలగానే మళ్లీ ఆకులు పువ్వులుగా మారతాయి.


పొన్షిటియా వైట్‌లో చెట్టుజాతి మొక్కలూ ఉంటాయి. ఇవి ఎనిమిదడుగుల పొడవు పెరుగుతాయి. చెట్టంతా చిన్న చిన్న పూరేఖలుగా విచ్చుకుని, సాయంత్రానికి గాఢమైన సువాసనలు గుప్పిస్తుంది. ఇంటి ముంగిట పెరట్లోనూ ఖాళీ స్థలాల్లో పెంచుకుంటే ఈ మొక్కలు సీజన్లో పాలరాతి శిల్పల్లా మెరుస్తాయి.

- చిలుకూరి శ్రీనివాసరావు,
8985945506