Dec 03,2021 18:30

పూర్తికాని ప్రభుత్వ భవనాల నిర్మాణం
కానరాని శ్మశానవాటిక
నిర్వాసితుల అవస్థలు
ప్రజాశక్తి - బుట్టాయగూడెం
మన పాలకులు పదేపదే చెప్పేది పోలవరం జాతీయ ప్రాజెక్టు.. ఇది ఆంధ్రుల జీవనాడి అని. మాటలు సరే ప్రాజెక్టు నిర్మాణానికి సర్వస్వం త్యాగం చేసి నిరాశ్రయులైన నిర్వాసితులకు మాత్రం పాలకులు మారుతున్నా కష్టాలు తప్పడం లేదు. మండలంలోని దొరమామిడి గ్రామ సమీపంలోపోలవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన 60 నిర్వాసిత కుటుంబాలకు ఏర్పాటు చేసిన పునరావాస కాలనీలో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
ప్రాజెక్టు నిర్వాసితులను తరలించే నాటికి పునరావాస కాలనీలో 31 అంశాలతో కూడిన సౌకర్యాలు కల్పించాలని 2013 భూసేకరణ చట్టం స్పష్టంగా చెబుతోంది. అయితే ఇక్కడి కాలనీలో అసంపూర్తి నిర్మాణాలు, అధ్వానమైన రోడ్లు, డ్రెయినేజీలు దర్శనమిస్తున్నాయి. అంతర్గత రహదారులు (సీసీ రోడ్ల) నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కొద్దిపాటి వర్షానికి రోడ్లు బురదగా ఉంటున్నాయి. వర్షపునీరు బయటకు వెళ్లేందుకు డ్రెయినేజీల నిర్మాణం పూర్తికాలేదు. కొద్దిపాటి వర్షం కురిసినా పంట పొలాల్లో నీరు కాలనీలోకి వస్తుంది. ఈ నీరు బయటకు వెళ్లని పరిస్థితి. డ్రెయినేజీలు నిర్మించినా ఇళ్లలోకి మట్టిని తోలేందుకు డ్రెయినేజీలపై పైకప్పులను తొలగించేశారు. దీంతో ఆ మట్టి డ్రెయినేజీల్లో పేరుకుపోయి నీరు బయటకు వెళ్లడం లేదు. దీంతో మురుగునీరు పేరుకుపోయి దుర్వాసన రావడంతోపాటు దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇంటి ఆవరణలో మట్టిగుట్టలు ఉండటం వల్ల నిర్వాసితులు నానావస్థలు పడుతున్నారు.
పునరావాస కాలనీలో పాఠశాల, అంగన్వాడీ, ఆరోగ్య ఉప కేంద్రం, పోస్టాఫీస్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం జరుగుతున్నాయి. అవి ఎప్పటికి పూర్తవుతాయో.. ఎప్పటికి జనానికి అందుబాటులోకి వస్తాయో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. నిర్వాసితుల ఇళ్లలో కొన్నింటి శ్లాబ్‌ల నుంచి నీరు లీకవుతోంది. కొన్ని ఇళ్లకు సీలింగ్‌ ఫ్యాన్‌ ఏర్పాటుకు సంబంధించిన రింగులు లేకుండా నిర్మించారు. మొత్తానికి నిర్వాసితుల ఇళ్లతోపాటు ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం నత్తనడకన సాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతోపాటు కాలనీలో గుడి, కమ్యూనిటీ హలు నిర్మాణం చేపట్టలేదంటే అతిశయోక్తి కాదు. ఇక కాలనీలో విద్యుద్దీపాలు ఎక్కడా ఏర్పాటు చేయలేదు. వెలుతురు కోసం ఏర్పాటు చేసిన సౌర విద్యుద్దీపాలు మొత్తం పది మాత్రమే ఉన్నాయి. కాలనీలో ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ ఉంది. ఇంటింటికీ కుళాయి ఉన్నా వాడకానికి మాత్రమే ఆ నీరు పనికొస్తుంది. కరెంటు లేకపోతే ఆ నీరూ అందని పరిస్థితి. చేతిపంపులను ఏర్పాటు చేస్తే కొంత నీటి సమస్య తగ్గుతుందని జనం అభిప్రాయ పడుతున్నారు. దొరమామిడి ఆర్‌ఒ ప్లాంటు నుండి ప్రతిరోజూ తాగునీరు కొనుక్కుంటున్నారు.
భూముల వివాదం పరిష్కారమయ్యేనా..!
నిర్వాసితులకు భూమికి భూమి ఇచ్చే విషయంలో ఎక్కువగా వివాదాస్పద భూములను కేటాయించారనే ఆరోపణలున్నాయి. నిర్వాసితులకు చినజీడిపూడి గ్రామ సమీపంలో ఇచ్చిన 12 ఎకరాల 35 సెంట్ల భూమి వివాదాల్లోనే ఉంది. ఆరేళ్ల కిందట భూమి చూపించినా ఇప్పటికీ వివాదాన్ని పరిష్కరించి ఆ భూమిని అప్పగించడంలో అధికారుల ఆలసత్వం కొనసాగుతోంది.
ఐదు నెలలైనా వీడని సమస్యలు
నిర్వాసితులు పునరావాస కాలనీకి వచ్చి ఐదు నెలలు గడిచినా ఇక్కడ ఇబ్బందులు పోలవరం వెళ్లి తెలపాల్సి వస్తోంది. గ్రామాల నుంచి తరలించేటప్పుడు నిత్యం అందుబాటులో ఉంటామని అధికారులు చెప్పారని, అయితే ఆచరణలో అలా లేదని చెబుతున్నారు. సరుగుడు గ్రామానికి చెందిన వలంటీర్‌ జీలుగుమిల్లి మండలంలో యర్రవరం పునరావాస కాలనీలో ఉంటున్నారు. పింఛన్లు ఇచ్చే సమయంలో ఇక్కడికి వచ్చి వెళ్తుంటారు. తమ కాలనీలోని వారిని వలంటీర్‌గా తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఇక్కడకు వచ్చాక మొదట్లో పోలవరం వెళ్లి అంగన్‌వాడీ సరుకులు తెచ్చుకునేవారు. ఇప్పుడు రెడ్డిగణపవరం సమీపంలో పునరావాస కేంద్రమైన పల్లపూరు వెళ్లి పాలు, గుడ్లు తెస్తున్నారు. మిగిలిన సరుకులు దొరమామిడి అంగన్‌వాడీ కేంద్రాల నుంచి తీసుకుంటున్నారు. అన్ని సరుకులూ ఇక్కడికే తీసుకురావాలని కోరుతున్నారు.
పునరావాస కాలనీలో పాఠశాల నిర్మాణం జరుగుతుంది. కాలనీకి రాకముందు గ్రామంలో విద్యార్థులు పైడాకులమామిడి పాఠశాలలో చదువుకునేవారు. ప్రస్తుతం పైడాకులమామిడి రెడ్డిగణపవరం సమీపంలో ఉంది. దూరం కావడంతో దొరమామిడిలోని పాఠశాలకు సుమారు 15 మంది పిల్లలను తల్లిదండ్రులు పంపుతున్నారు. ఇక్కడికొచ్చి ఐదు నెలలైనా మమ్మల్ని ఎవరూ పనులకు పిలవడం లేదని నిర్వాసితులు వాపోతున్నారు. ప్రస్తుతం వ్యవసాయం చేసేందుకు భూమిలేదు. తమకు కనీసం ఉపాధి హామీ కిందనైనా పనులు చూపాలని వారు కోరుతున్నారు.
కానరాని శ్మశానవాటిక
ఇక్కడి కాలనీలో ఎవరైనా మృతి చెందితే కుటుంబ సభ్యులకు అష్టకష్టాలు తప్పడం లేదు. శ్మశానవాటికకు పునరావాస కాలనీ సమీపంలో ఎకరంన్నర భూమి గుర్తించారు. అయితే ఆ భూమిని ఇప్పటికీ కొనుగోలు చేయలేదు. దీంతో పెద్దలను ఒప్పించి మృతదేహాలరె అరిచేల చెరువు కట్ట దగ్గర ఖననం చేస్తున్నారు. అదే సమయంలో పశువులను కట్టేందుకు చినజీడిపూడి సమీపంలో 82 సెంట్ల భూమిని ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ భూమిని కేటాయించకపోవడంతో ఇళ్ల మధ్యే పశువులను కట్టేస్తున్నారు. ఇకనైనా పశువుల కోసం కేటాయించిన భూమిని ఇవ్వాలని కోరుతున్నారు.