Oct 27,2021 18:38

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
           పునరావాస కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, కాలనీవాసుల సమస్యలకు పరిష్కారం చూపుతామని జెసి బిఆర్‌.అంబేద్కర్‌ అన్నారు. బుధవారం మండలంలోని కోటరామచంద్రపురం ఐటిడిఎ మీటింగ్‌హాలులో అధికారులతో, సర్పంచులతో నిర్వహించిన పిఎల్‌ఎంసి సమావేశానికి జెసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు సర్పంచులు, అధికారులతో ప్రాజెక్టు లెవిల్‌ మోనటరింగ్‌ కమిటీ (పిఎల్‌ఎంసి) సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిర్వాసితుల ప్రతీ సమస్యకు తప్పనిసరిగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తామన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు పిఎల్‌ఎంసి కమిటీలు సహకరిస్తుందన్నారు. కమిటీ సభ్యుల సమావేశంలో లిఖిత పూర్వకంగా సమస్యలు తెలియజేస్తే పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. భూమికి భూమి ఇచ్చిన వారి విషయంలో భూముల భద్రత విషయంలో సహకారం అందిస్తామని, అందరూ సమిష్టిగా ఉండాలని ఆయన సూచించారు. జంగారెడ్డిగూడెం, కుక్కునూరు డివిజన్లలో పునరావాస ప్యాకేజీ అందించాలని, గతంలో కేటాయించిన భూములను స్వాధీన పరచాలని సూచించారు. ఇంటి నిర్మాణం కోసం లేఅవుట్లలో స్థలాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, తమకు కేటాయించిన భూములలో వేరేవారు సాగుచేయడం, ఇంటి నిర్మాణం చేస్తున్నారని, ఈ తరహా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు అందించారు. దరఖాస్తులను పరిశీలించి గ్రామసభలు నిర్వహించి అర్హులందరికీ ప్యాకేజీ అందజేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలపై ప్రభుత్వానికి మినిట్స్‌ ద్వారా నివేదిక పంపుతామని పిఒ ఒ.ఆనంద్‌ పేర్కొన్నారు. బరియల్‌ గ్రౌండ్‌కు సంబంధించిన స్థలాల సమస్యకు పరిష్కారం చూపి స్థల కేటాయింపు పూర్తి చేయాలని జేసి ఆదేశించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు పరిపాలనాధికారి/ఎక్స్‌ ఆఫీషియో జెసి ఒ.ఆనంద్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ వైవి.ప్రసన్నలక్ష్మీ, ఎస్‌డిసిలు గీతాంజలి, సూర్యనారాయణ రెడ్డి, ఎస్‌పి కె.నరసింహమూర్తి, షెడ్యూల్డ్‌ తెగల నిర్వాసితుల ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.