Nov 30,2020 21:46

శ్రీకాకుళం కార్పొరేషన్‌ వద్ద ధర్నా చేస్తున్న పట్టణ పౌర సమాఖ్య నాయకులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం సిటీ : మున్సిపల్‌ చట్టాలను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 16వ నంబరు ఆర్డినెన్స్‌, ప్రజలపై భారాలు మోపేలా భారీగా పెంచిన ఆస్తి పన్ను, నీటి, డ్రయినేజీ ఛార్జీలకు సంబంధించిన 196, 197, 198 జిఒలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పట్టణ పౌర సమాఖ్య నాయకులు డిమాండ్‌ చేశారు. ఇవే డిమాండ్లతో సమాఖ్య ఆధ్వర్యాన శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస-కాశీబుగ్గ మున్సిపాల్టీ, పాలకొండ, రాజాం నగర పంచాయతీ కార్యాలయాల వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్ద చేపట్టిన ధర్నాలో ఆస్తి పన్ను జిఒలను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి టి.తిరుపతిరావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఉపాధి, వ్యాపారాల్లేక ఇబ్బందులు పడుతుంటే, పన్నులు పెంచడం సరికాదన్నారు. పాత పద్ధతిలో భవనం విలువ ఆధారంగా ఆస్తి పన్ను పెంచితే, ఇప్పుడు ఆ భవనం స్థల విలువనూ కలిపి పెంచుతున్నారని విమర్శించారు. 15 శాతం మాత్రమే పెంచుతామని చెప్తున్న మున్సిపల్‌ మంత్రి, ఈ విషయాన్ని చట్ట సవరణలో ఎందుకు పొందుపరచలేదని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 1995 ప్రకారం 15 శాతానికి తగ్గకుండా 30 శాతం మించకుండా ఆస్తిపన్ను నిర్ణయించాల్సి ఉందని స్పష్టం చేశారు. ప్రభుత్వం దిగొచ్చి ఆస్తి పన్ను జిఒలను వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రవ్యాప్త పోరాటం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సమాఖ్య నాయకులు శ్రీదేవి పాణిగ్రాహి, పి.ప్రసాదరావు, కె.సూరయ్య, వెంకట్రావు పాణిగ్రాహి, జి.చంద్రిక తదితరులు పాల్గొన్నారు.
పలాసలో మున్సిపల్‌ కమిషనర్‌ నారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సమాఖ్య మండల అధ్యక్షులు బి.ఓంకార్‌, నాయకులు ఎన్‌.గణపతి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను విధించే రీతిలో చట్టాన్ని సవరించిందని విమర్శించారు. దీనివల్ల మున్సిపల్‌ ప్రాంతాల్లో భారీగా ఇంటి పన్నులు పెరిగి ప్రజలపై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ బడ్జెట్‌ నుండి స్థానిక సంస్థలకు నిధులు కేటాయించాల్సి ఉండగా, దాన్ని గాలికొదిలేసి స్థానిక సంస్థల స్వయం సమృద్ధి పేరుతో పట్టణ ప్రజలపై భారాలను మోపుతున్నాయని విమర్శించారు. కార్యక్రమంలో సంఘ నాయకులు పి.శశిధరవర్మ, ఎన్‌.ఢిల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు.
పాలకొండలో నగర పంచాయతీ కమిషనర్‌ బి.ఎం శివప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పట్టణ పౌర సమాఖ్య నాయకులు దావాల రమణారావు, పప్పల అనంత్‌ మాట్లాడుతూ కరోనా కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలపై భారాలు వేయడం సమంజసం కాదన్నారు. కార్యక్రమంలో సంఘ నాయకులు ఎస్‌.భాస్కరరావు, కె.రమేష్‌, జి.జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు.
రాజాం నగర పంచాయతీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిహెచ్‌.రామ్మూర్తి నాయుడు మాట్లాడుతూ స్థానిక సంస్థల నుంచి వసూలు చేసిన పనుల్లో వాటాను స్థానిక సంస్థలకు ఇవ్వాల్సి ఉన్నా కేంద్రం అమలు చేయడం లేదని విమర్శించారు. పట్టణ ప్రజలపై భారాలను మోపుతోందన్నారు. రాజాం నగర పంచాయతీలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. అనంతరం కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సత్యారావు, నాగరాజు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.