May 18,2021 23:00

ఆసుపత్రి బయట నిలిపి ఉంచిన అంబులెన్స్‌లు

ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్‌
నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి వద్ద ప్రయివేటు అంబులెన్స్‌ ఓనర్స్‌, డ్రైవర్స్‌ దందా జోరుగా సాగుతోంది. కరోనా పుణ్యమా అని అంబులెన్స్‌ ఓనర్లు రోగులను పిండేస్తున్నారు. 150 పడకల ఏరియా ఆస్పత్రికి అంబులెన్స్‌ లేకపోవడం వీరి దోపిడీకి ఆయువుగా మారింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి అత్యవసరంగా రావాలన్నా, ఇక్కడ నుంచి మెరుగైన వైద్య సేవల కోసం ఎక్కడికైనా వెళ్లాలన్నా ప్రయివేటు అంబులెన్స్‌లను ఆశ్రయించకతప్పడంలేదు. నర్సీపట్నం పరిసర ప్రాంతాల నుంచి సుమారు 10 కిలోమీటర్లు తీసుకెళ్లేందుకు రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రి సిబ్బంది సహకారం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై గతంలో మున్సిపల్‌ కమిషనర్‌ పలు సూచనలు చేసి హాస్పిటల్‌ వద్ద ధరల పట్టిక పెట్టమని చెప్పినప్పటికీ ఓనర్లు బేఖాతరు చేశారు. ఆసుపత్రిలో మృతిచెందిన వ్యక్తులను తీసుకెళ్లేందుకు ప్రయివేట్‌ అంబులెన్స్‌ యజమానులు ప్యాకేజీ నిర్ణయించారు. వారిని తీసుకెళ్లేందుకు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ పద్దతి మంచిది కాదని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇటీవల వీడియో విడుదల చేశారు. ఏరియా ఆసుపత్రికి సమీపంలో మున్సిపాలిటీ రోడ్డుకు అనుకుని అంబులెన్స్‌ కార్యాలయాన్ని కూడా అనధికారికంగా ప్రారంభించారు. అనుమతులు లేని నిర్మాణాలు చేసినప్పటికీ మున్సిపాలిటీ సిబ్బంది పట్టించుకోకపోవడం గమనార్హం. నిరుపేదలే ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు. అటువంటి వారు అంబులెన్స్‌కు రూ.వేలల్లో చెల్లించాలంటే బెంబేలెత్తిపోతున్నారు. కరోనా టైంలో దందాలపై నాయకులు, ఆసుపత్రి కమిటీ, అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.