Dec 03,2021 07:49
  • మూడు నెలల్లోపు చెల్లించాలని ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో/న్యూడిల్లీ బ్యూరో : నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జిటి) రాష్ట్ర ప్రభుత్వానికి రూ.243.16 కోట్ల భారీ జరిమానా విధించింది. పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగాయంటూ, ఆ మొత్తాన్ని జరిమానాగా ఎపి కాలుష్య నియంత్రణ మండలికి మూడు నెలల్లోపు చెల్లించాలని గురువారం ఎన్‌జిటి తీర్పునిచ్చింది. సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే వట్టి వసంతకుమార్‌ ఆ నాలుగు ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఎన్‌జిటిని ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా దాదాపు ఐదేళ్లపాటు పలు కమిటీలు ఈ ప్రాజెక్టు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడాయి. చింతలపూడి, పట్టిసీమ, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలు పోలవరం ప్రాజెక్టులో అంతర్భాగంగా చేపట్టినవని, పోలవరం పూర్తయితే వాటి అవసరం వుండదనే ప్రభుత్వ వాదనలను ఎన్‌జిటి తోసిపుచ్చింది. పర్యావరణ నిబంధనలు అడుగడుగునా ఉల్లంఘనలు జరిగాయని పోలవరం ప్రాజెక్టుకు రూ.120.07 కోట్లు, చింతలపూడికి రూ.73.63 కోట్లు, పట్టిసీమకు రూ.24.90 కోట్లు, పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు రూ.24.56 కోట్లు కలిపి మొత్తం రూ.243.16 కోట్లు జరిమానా విధించింది. జరిమానా నిధుల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యులతో కమిటీని నియమించాలని ఆదేశించింది.