Oct 27,2021 23:00

మాట్లాడుతున్న కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌

- నిర్మాణానికి అడ్డంకిగా కోర్టు కేసులు
- డిసెంబర్‌ నాటికి 100 శాతం పూర్తి చేయాలి
- అధికారులకు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశం
ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: 
కోర్టు కేసులతో నిలిచిన ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించాలని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశించారు. స్థానిక కలెక్టర్‌ సమావేశ మందిరంలో బుధవారం ఉపాధి హామీ పథకం అనుసంధానంతో పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ అధికారులు నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల పురోగతిపై ఆయన సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి చేపడుతున్న భవన నిర్మాణాలకు కోర్టు కేసులు అడ్డంకిగా మారాయన్నారు. ఆయా ప్రాంతాలలో వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. జిల్లాలో 871 గ్రామ సచివాలయాల నిర్మాణానికి ప్రభుత్వం అధికారికంగా అనుమతి మంజూరు చేసిందన్నారు. ప్రస్తుతం 289 భవనాలు పూర్తి కాగా, మరో 208 భవన నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయన్నారు. ల్యాండ్‌ ఎక్చేంజ్‌ విధానం అమలులోకి రావటంతో భవన నిర్మాణాలలో పురోగతి రానుందన్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు ముందుకు వచ్చి వారి భూమిని ఇస్తే అంతే విలువైన భూమిని మరొక చోట పంపిణీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టు కేసులలో ఉన్న ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా కేటాయించే భూములలో భవన నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.
హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణ పురోగతి 10 శాతం
వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవన నిర్మాణాలు పురోగతి 10 శాతమని కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 453 భవనాలు శ్లాబ్‌ దశకు చేరుకోగా, 294 భవనాలు పునాది దశలోనే ఉండిపోయాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టిన భవన నిర్మాణాలు డిసెంబర్‌ నాటికి 100 శాతం పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్‌ ఎస్‌ఇ కొండయ్య, ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు, డిఇలు, ఏఇలు పాల్గొన్నారు.