Nov 22,2020 15:22

పాట్నా : బీహార్‌లో ఎన్నికలు ముగిసినా వేడి తగ్గడం లేదు. ముఖ్యమంత్రి, జెడియు నేత నితీష్‌ కుమార్‌ నేతృత్వాన నూతనంగా కొలువు దీరిన మంత్రులపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అవినీతి ఆరోపణలు మొదలుపెట్టారు. దీంతో జెడియు నేతల్లో ఆందోళన మొదలైంది. తేజస్విపై ఎదురుదాడికి దిగారు. అనేక అవినీతి కేసుల్లో, క్రిమినల్‌ కేసుల్లో తేజస్వి పేరు ఉన్నందున ప్రతిపక్ష నేతగా ఆయన ఉండకూడదంటూ డిమాండ్‌ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలపై విద్యా శాఖ మంత్రి మేవాలాల్‌ చౌదరి తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత ఈ డిమాండ్‌ తెరపైకి వచ్చింది. నితీష్‌ కమార్‌ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తేజస్వి వ్యాఖ్యలు చేయడంపై శనివారం జెడియు జాయింట్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఈ సమావేశానికి జెడియు రాష్ట్ర అధ్యక్షుడు వశిష్టత నారాయణ సింగ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అశోక్‌ చౌదరి, అధికార ప్రతినిధులు సంజరు సింగ్‌, నీరజ్‌ కుమార్‌, అశోక్‌ అలోక్‌లు తేజస్విపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...అవినీతి, మత విద్వేషాలు, నేరాలను తమ ప్రభుత్వం సహించదంటూ వ్యాఖ్యానించారు. తమ ముఖ్యమంత్రిలా క్లీన్‌ రికార్డు లేని వారు...అవినీతిపై ఆరోపణలు చేస్తున్నారని, తేజస్విపై ఎస్‌సి/ఎస్‌టి చట్టంతో పాటు ఐపిసిలోని పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారని చెప్పారు. రాఘోపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గం నుండి పోటీ చేసే సమయంలో దాఖలు చేసిన నామినేషన్‌ పత్రాల్లో తనపై ఉన్న కేసుల గురించి వెల్లడించలేదని, ఉద్దేశపూర్వకంగా ఆ వివరాలు ఇవ్వకపోవడంపై ఎన్నికల కమిషన్‌ గుర్తించాలని పేర్కొన్నారు.