Dec 03,2021 19:27

భారత క్రీడారంగంలో విజేతలుగా నిలిచిన అతి తక్కువమందిలో ఆమె ఒకరు. పైగా పురుషుల ఆధిపత్యం నడుస్తున్న 2000 సంవత్సర ప్రారంభంలోనే 'లాంగ్‌ జంప్‌ క్వీన్‌'గా చరిత్ర సృష్టించారు అంజు బాబీ జార్జ్‌. 'నాకు క్రీడలే ఊపిరి, నేను అందులోనే జీవిస్తున్నాను. నా లక్ష్యం ఒలింపిక్‌ పతక విజేతలను ప్రోత్సహించడమే' అంటారు ఆమె. ఇటీవల వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఆమెను 'ఉమెన్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా గౌరవించింది. భారత క్రీడా ప్రియుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయే, భవిష్యత్తు తరాలకు గొప్ప స్ఫూర్తినిచ్చే ప్రయాణం ఆమెది.

ప్రతిభను గుర్తించడమే కాక, లింగ సమానత్వం కోసం పాటుపడుతున్న అంజుకు దక్కిన పురస్కారం ఇది. 'తన జీవితాన్ని  అథ్లెటిక్స్‌కు అంకితం చేసినందుకు' ఈ అవార్డుకు ఆమె ఎంపికైంది. 'నేను 18 ఏళ్ల క్రితం ప్రపంచ క్రీడా పోటీల్లో పాల్గొని విజయం సాధించాను (2003లో ప్రపంచ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌ లాంగ్‌ జంప్‌ పోటీల్లో కాంస్య పతకం గెలుచుకును ఏకైక భారతీయురాలు). ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ బంగారు పతకం గెలవడంతో భారత్‌లో ప్రతిభకు కొదవలేదని ప్రపంచానికి అర్థమైంది. దేశంలో ప్రతిభను పెంచి ఒలింపిక్‌ పతక వీరులుగా తయారుచేయడమే నా ముందున్న లక్ష్యం' అంటారు ఆమె.
ప్రస్తుతం 'అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా' సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌, 'ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ' సభ్యురాలిగా, 'అథ్లెట్స్‌ కమిషన్‌' సభ్యురాలిగా, 'దేశ మిషన్‌ ఒలింపిక్స్‌ సెల్‌'లో భాగమై విస్తృత సేవలు అందిస్తున్నారు. 'జీవితంలో, క్రీడలలో, ప్రతి రంగంలో మహిళలు చాలా బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది బాలికలు క్రీడారంగం వైపు అడుగులు వేయాలి. అలాంటి ప్రతిభావంత క్రీడాకారులను ఒలింపిక్‌ పతక విజేతలుగా తీర్చిదిద్దాలి' అంటును అంజు స్వస్థలం కేరళ చీరంచిరా గ్రామం. 1977లో జన్మించారు. సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన అంజును క్రీడారంగం వైపు ప్రోత్సహించారు ఆమె తండ్రి మార్కోస్‌. పాఠశాల విద్య నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఆమె క్రీడా ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లు. కోచ్‌, న్యూట్రిషనిస్ట్‌, జాతీయ మాజీ క్రీడాకారుడు రాబర్ట్‌ బాబీ జార్జ్‌ను వివాహం చేసుకున్నారు.
ఆటలు.. అవార్డులు...
1992 నుంచి 1996 వరకు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు గెలవడం మొదలుపెట్టారు. 1996లో ఢిల్లీ జూనియర్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ లాంగ్‌ జంప్‌లో బంగారు పతకం గెలిచి ప్రపంచానికి తన ఉనికిని చాటారు. 2002 కామన్‌వెల్త్‌ పోటీల్లో రజత పతకం, 2003 ఆఫ్రో ఏషియన్‌ పోటీల్లో బంగారు పతకం... ఇలా చెప్పుకుంటూ పోతే వరుసగా ప్రతి ఏడాది ప్రపంచ పోటీల్లో పాల్గొని భారత సత్తా చాటిన ఏకైక మహిళా క్రీడాకారిణిగా నిలిచారు. 2002-03లో అర్జున అవార్డు, 2003-04లో రాజీవ్‌ ఖేల్‌ రత్న  అవార్డు, 2004లో పద్మశ్రీ అవార్డులు ఆమె ప్రతిభకు పట్టం కట్టాయి. 2013లో అథ్లెటిక్‌గా రిటైరైనా మెరికల్లాంటి ఎంతోమంది క్రీడాకారిణులను తయారు చేయడంలో, ప్రోత్సహించడంలో నిర్విరామంగా కృషి చేస్తున్నారు.
క్రీడలపై ఆసక్తి ఉన్న, అర్హులైన పిల్లలకు, ఆర్థిక, మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంతో పనిచేసేలా 'అంజు బాబీ జార్జ్‌ పౌండేషన్‌' స్థాపించారు. అంతేకాదు, 2016లో యువతుల కోసం శిక్షణా అకాడెమీని ప్రారంభించారు. ఈ కేంద్రం నుంచి వచ్చిన క్రీడాకారిణి షైలీ సింగ్‌ ప్రపంచ యు20 పోటీల్లో విజేతగా నిలిచిందని వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
'భారత అథ్లెటిక్స్‌ ఫెడరేషన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా లింగ సమానత్వం కోసం గళం విప్పడంలో ఆమె ఎప్పుడూ ముందుంటారు. పాఠశాల విద్యార్థినులను భవిష్యత్తు క్రీడాకారిణిలుగా తీర్చిదిద్దుతూ బాలికలకు క్రీడలతో పాటు విద్యాభివృద్ధికి కృషి చేస్తారు' అనిపేర్కొంది. ఇంకా 'భారతదేశంలో క్రీడను అభివృద్ధి చేయడంలో ఆమె చేసిన ప్రయత్నాలు, ఆమె అడుగుజాడల్లో మరింతమంది మహిళలు అనుసరించేలా ప్రేరేపించినందుకు ఈ ఏడాది అవార్డుకు ఎంపిక చేశాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె కృషి 'అర్హత కంటే ఎక్కువ' అని వరల్డ్‌ అథ్లెటిక్స్‌ ప్రకటించింది.