Jul 25,2021 10:17

యువ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ ఇటీవల కాలంలో సామాజిక, రాజకీయ అంశాలపై కాస్త ఎక్కువగానే స్పందిస్తున్నారు. కేవలం సహాయలు మాత్రమే చేయకుండా ప్రజల తరపున గొంతెత్తుతున్నాడు. అవసరమైనప్పుడు ప్రభుత్వాలను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై సామాన్యులు ప్రశ్నిస్తున్న సమయంలో నిఖిల్‌ కూడా తనదైన శైలిలో ఆవేదన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ట్యాక్సులను రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు.

పేరు : నిఖిల్‌ సిద్ధార్థ్‌
పుట్టిన తేదీ : 1985 జూన్‌ 1
పుట్టిన ప్రాంతం : బేగంపేట, హైదరాబాద్‌
నివాస ప్రాంతం : హైదరాబాద్‌
భార్య : డాక్టర్‌ పల్లవి వర్మ
చదువు : బిటెక్‌
హాబీస్‌ : రీడింగ్‌, ఫుట్‌బాల్‌
తల్లిదండ్రులు :శ్యామ్‌ సిద్ధార్థ్‌, వీనా సిద్ధార్థ్‌
సోదరులు : రోహిత్‌ సిద్ధార్థ్‌, సొనాలి సిద్ధార్థ్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరోల్లో వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో నిఖిల్‌. నూతన దర్శకులను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తున్నాడు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీడేస్‌' సినిమాతో టాలీవుడ్‌లో వెలుగులోకి వచ్చిన నిఖిల్‌ 'హైదరాబాద్‌ నవాబ్స్‌' చిత్రానికి సహాయ దర్శకునిగా చిత్రరంగ ప్రవేశం చేశాడు. నట శిక్షకుడు ఎన్‌.జె. భిక్షు దగ్గర శిక్షణ పొందాడు. 'హ్యాపీడేస్‌' చిత్రానికి ముందు అనేక చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించాడు. ఆ తర్వాత సోలో హీరోగా చాలా చిత్రాల్లో నటించాడు. 'స్వామి రారా.., కార్తికేయ, సూర్య వర్సెస్‌ సూర్య, ఎక్కడికిపోతావు చిన్నవాడా, అర్జున్‌ సురవరం' వంటి సినిమాలు నిఖిల్‌కు హీరోగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.

    అయితే నిఖిల్‌ కేవలం సినిమాల గురించి మాత్రమే కాదు, అప్పుడప్పుడూ రాజకీయాల గురించీ మాట్లాడతాడు. సామాజిక అంశాలపైనా స్పందిస్తుంటాడు. అప్పుడప్పుడూ ప్రజల పక్షాన ప్రభుత్వాలను నిలదీస్తుంటాడు. నిత్యావసరంగా మారిపోయిన పెట్రోల్‌, డీజిల్‌పై ప్రభుత్వం ఇష్టానుసారంగా ట్యాక్సులు వేస్తుందంటూ ఇప్పటికే ప్రతిపక్షాలూ మండిపడుతున్నాయి. ఈ క్రమంలోనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై టాలీవుడ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ కూడా స్పందించాడు.

011


    పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ప్రభుత్వం ట్యాక్సులను రద్దు చేయాలని నిఖిల్‌ కోరారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో.. 'అసలు ఏం జరుగుతుంది. రూ.35 ఉండాల్సిన పెట్రోల్‌/డీజిల్‌ ధర పంపు వద్ద మాత్రం రూ.100గా ఉంటుంది. ఇంధనంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే ట్యాక్సులను వెంటనే రద్దు చేయాలి. ఈ ధరల పెంపు వలన ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరి తరపునా ఇది నా రిక్వెస్ట్‌' అంటూ నిఖిల్‌ ట్వీట్‌ చేశాడు. దీనికి ఓ ఫోటో కూడా షేర్‌ చేశారు. గతంలోనూ నిఖిల్‌ చేసిన ట్వీట్‌ సామాజిక మాద్యమాల్లో భారీగానే చెక్కర్లు కొట్టింది. 'కరోనా సమయంలో ఎంతోమంది సాధారణ ప్రజలే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. కానీ రాజకీయాల నాయకులు మాత్రం ఒకరినొకరు బ్లేమ్‌ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు' అంటూ వీడియో ద్వారా కౌంటర్‌ ఇచ్చారు. అలాగే 'మోడీజీ కూడా మిగతా విషయాలపై కాకుండా ప్రస్తుత పరిస్థితులపై ఎక్కువగా ఫోకస్‌ పెడితే బావుంటుంది' అని నిఖీల్‌ ట్వీట్‌ చేశాడు.
 

పబ్లిసిటీ లేకుండానే..
దేశవ్యాప్తంగా కరోనా విజృంభించిన తరుణంలోనూ నిఖిల్‌ మానవత్వంతో ముందుకొచ్చాడు. కష్టకాలంలో అనేక మంది కరోనా బాధితులకు, సామాన్యులకు తనవంతు సేవలను అందించాడు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా, బ్లాక్‌ ఫంగస్‌ బాధితులకు సహాయ సహకారాలను అందిస్తున్నాడు. సోషల్‌ మీడియా ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్స్‌ను అలాగే మెడిసిన్‌ను సకాలంలో అందించి, చాలామంది ప్రాణాలకు ఊపిరి పోశాడు. పబ్లిసిటీ లేకుండానే నిఖిల్‌ తన మంచి పనులను కొనసాగించాడు.
     ప్రస్తుతం ఈ యంగ్‌ హీరో తన సూపర్‌ హిట్‌ సినిమా 'కార్తికేయ సీక్వెల్‌'లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే సుకుమార్‌ నిర్మాణంలో తెరకెక్కుతున్న '18 పేజీస్‌' సినిమాలో నిఖిల్‌ సిద్ధార్థ్‌ నటిస్తున్నాడు. ఈ మూవీలో నిఖిల్‌ సరసన అనుపమ పరమేశ్వరన్‌ నటిస్తోంది. పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే నిఖిల్‌ త్వరలో మరో సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. మెడికల్‌ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ప్రముఖ రచయిత కోన వెంకట్‌ రాసిన ఓ కథతో నిఖిల్‌ సినిమా రాబోతుందని తెలుస్తుంది.