Sep 17,2021 23:03

ఆన్‌లైన్‌ ద్వారా సమీక్షిస్తున్న ఇన్‌ఛార్జి మంత్రి శ్రీరంగనాథరాజు

ప్రజాశక్తి - గుంటూరు : కాల్వ చివరి భూములకూ నీరందించాలని అధికారులను జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. జిల్లా స్థాయి వ్యవసాయ సలహా సంఘం సమావేశం వెబ్‌ఎక్స్‌ ద్వారా మంత్రి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ పంటల వివరాలన్నీ రైతు భరోసా కేంద్రంలో తప్పనిసరిగా నమోదు చేయాలని, ఎరువులను ఆర్‌బికెల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. కౌలు రైతులకు పంట రుణాలివ్వాలని బ్యాంకర్లకు సూచించారు. నకిలీ పురుగు మందులు విక్రయాలు జరగకుండా నిత్య పర్యవేక్షణతోపాటు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టాలన్నారు. జెసి దినేష్‌ కుమార్‌ మాట్లాడుతూ కౌలురైతులకు రూ.100 కోట్ల వరకు పంట రుణాలందాయన్నారు. మండలాల వారీగా ఎరువుల అవసరంపై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని, ఇప్పటికే సరఫరా అయిన ఎరువులను రైతులకు అందిస్తున్నామని తెలిపారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు సరఫరా చేయాలన్నారు.