Jun 13,2021 00:23

- నాడు పూర్తి చేస్తామన్నారు.. నేడు మాట తప్పారు..
- ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు
ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: 
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడీ అయిన పోలవరం ప్రాజెక్టు రెండేళ్ల వైసిపి పాలనలో ప్రశ్నార్థకంగా మారిందని టిడిపి బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఒక ప్రకటనలో విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 2021 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామని హామీనిచ్చారు. తరువాత 2022 ఖరీఫ్‌ నాటికి పూర్తి చేస్తామని మాట మార్చారు. ఇప్పుడు ఎప్పటికి పూర్తి చేస్తారో కూడా చెప్పే పరిస్థితిలో లేకపోవడం హేయమన్నారు. టిడిపి ప్రభుత్వం చేసిన పనులను తాము చేసినట్లుగా చెప్పుకుంటూ ప్రారంభోత్సవాలు జరుపుకోవడం దారుణమన్నారు. వైసిపి ప్రభుత్వం రెండేళ్లల్లో కేవలం 0.89 శాతం పనులు మాత్రమే చేశారని, 1 శాతం పనులు చేయని జగన్‌ పోలవరం డ్యాం కట్టి నీరందిస్తామని చెప్పడం హాస్యాస్పదం అన్నారు. టీడీపీ హయాంలో ఆమోదింపజేసుకున్న రూ. 55,548 కోట్లకు సాంకేతిక ఆమోదం తెస్తే 28 మంది ఎంపిలుండీ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఆమోదం తెచ్చుకోకపోవడం జగన్‌ రెడ్డి అసమర్థానికి నిదర్శనం అన్నారు. జగన్‌ రెండేళ్లల్లో ఒక్క ఎకరా సేకరించలేదని, ఒక్కరికి పునరావాసం కల్పించలేదన్నారు. పోలవరంలో విగ్రహానికి పెట్టే ఖర్చులో రెండేళ్లలో ప్రాజెక్టుకు ఖర్చు పెట్టారా...అని ప్రశ్నించారు..? ఆ నాడు పట్టిసీమ దండగన్నారుజ అదే పట్టిసీమ ద్వారా 370 టీఎంసీలు సాగునీరు అందించి కష్ణా డెల్టా పంటలను కాపాడామన్నారు. రాయలసీమకు మునుపెన్నడూ లేని విధంగా నీరందించి కోనసీమగా మార్చామని పేర్కొన్నారు. 960 మెగా వాట్ల విద్యుత్‌ ప్లాంట్‌ ఊసే లేదని, డయా ఫ్రం వాల్‌ గురించి మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు.