Apr 14,2021 19:34

పిల్లలూ, ప్రపంచంలో అతి పెద్ద గ్రంథాలయం ఎక్కడ ఉందో మీకు తెలుసా?
10 కోట్ల పుస్తకాలు... 3 వేల మందికి పైగా సిబ్బంది... 221 ఏళ్ల చరిత్ర... అన్నీ కలిస్తే... ప్రపంచంలోనే అతి పెద్ద గ్రంథాలయం! అమెరికా రాజధాని వాషింగ్‌టన్‌ డీసీలో ఉంది. 1800 సంవత్సరంలో అమెరికా ప్రభుత్వం దీన్ని కేవలం 5000 డాలర్లతో ప్రారంభించింది. లైబ్రరీ ఆఫ్‌ కాంగ్రెస్‌గా పిలిచే దీంట్లో మొత్తం 14 కోట్ల వస్తువులు ఉన్నాయి. పుస్తకాలతోపాటు సీడీలు, పురాతన పత్రాలు, మ్యాపులూ, వీడియోలు... ఇలాంటి చాలా ఉన్నాయి. ఇక్కడ ఉన్న పుస్తకాలన్నిటిని పేర్చుకుంటూ పోతే 1046 కిలోమీటర్లు ఉంటాయి. కేవలం గ్రంధాలయం నిర్వహణకు 3,597 మంది సిబ్బంది పనిచేస్తారు. అతి పెద్ద లైబ్రరీగా గిన్నిస్‌ రికార్డు పొందిన దీనికి www.loc.gov అనే వెబ్‌సైట్‌ ఉంది.
          దీన్ని ప్రారంభించిన పన్నెండేళ్ల తర్వాత బ్రిటిష్‌ సైనికులు యుద్ధం చేసి దీనిలోని చాలా పుస్తకాలను, వస్తువులను తీసుకొని వెళ్లారు. తర్వాత అప్పటి అధ్యక్షుడు థామస్‌ జెఫరసన్‌ 6000 వేల పుస్తకాలతో మళ్లీ లైబ్రరీ ప్రారంభించారు. తర్వాత క్రమంగా పుస్తకాల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 470 భాషల పుస్తకాలు ఉన్నాయి. 5,26,378 కాపీరైట్‌లు నమోదయ్యాయి. పాఠకుల కోసం 20 విశాలమైన గదులున్నాయి. సదస్సుల నిర్వహణకు అయిదు వేదికలు ఉన్నాయి. ఒక సినిమా థియేటర్‌ ఉంది. ఇప్పుడిది అత్యాధునిక సౌకర్యాలతో, కంప్యూటర్‌ పరిజ్ఞానంతో మూడు విశాలమైన భవనాల్లో కొలువుదీరింది. అమెరికా కాపీరైట్‌ సంస్థగా కూడా పనిచేస్తుంది. ఎలాంటి సమచారం కావాలన్నా క్షణాల్లో దొరుకుతుంది.